7th NITI Aayog Meeting In Delhi: AP CM YS Jagan Speech Highlights, Details Inside - Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటే: నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం జగన్‌

Published Sun, Aug 7 2022 10:16 AM | Last Updated on Sun, Aug 7 2022 9:10 PM

AP CM YS Jagan Attend NITI Aayog Governing Council Meeting In Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరయ్యారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాల్లో ఆత్మ నిర్భర్‌ సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారంపై చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందన్నారు. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని,  జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటేనని, వ్యవసాయరంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తాము ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

  •  వ్యవసాయరంగంలో ఉన్న రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, ఉచిత పంటలబీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు తదితర పథకాలు, కార్యక్రమాలను రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నాం.
  • రైతులకు మరింత అండగా నిలవడానికి వారికి భరోసానిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కింద ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం.  నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాలద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. 
  •  డిజిటిల్‌ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎంయాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ద్వారా నిరంతరం పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నాం. 

  • దీంతోపాటు ఆర్బీకే స్థాయిలోనే ఇ– క్రాప్‌ బుకింగ్‌ కూడా చేస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతగా అమలు చేయడానికి ఇ–క్రాప్‌ బుకింగ్‌ దోహదపడుతోంది. 
  • ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టాం. రైతులకు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్లైన్లో ఆర్డర్‌ చేయవచ్చు. వారి చెంతకే అవన్నీ కూడా చేరవేస్తున్నాం. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌సెంటర్‌నుకూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఆర్బీకేల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లనుకూడా ప్రారంభిస్తున్నాం. పంటల మార్పిడి, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులవైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నాం.
  •  ఇక విద్యా రంగం విషయానికొస్తే బడికెళ్లడం, చదువుకోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశాం. స్కూళ్లుమానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు జీఈఆర్‌ నిష్పత్తిని పెంచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్‌ నిష్పత్తి 99.21 శాతంకాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యాశాఖ విడుదలచేసిన గణాంకాల్లో విద్యారంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైంది. అందుకే విద్యారంగంలో కీలక అంశాలపై దృష్టిపెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకు వచ్చాం. 

  • తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15వేల రూపాయల చొప్పున పిల్లల తల్లులకు అందిస్తోంది. 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను కూడా పరిగణలోకి తీసుకున్నాం. అంతేకాదు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిషు టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నాం. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్‌ యాప్‌కూడా అందిస్తున్నాం. 8 వ తరగతి విదార్థులకు ట్యాబ్‌ కూడా ఇవ్వబోతున్నాం. 
  • పిల్లలు మంచి వాతావరణంలో విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన బడి నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగునీరు, పెయింటింగ్, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, పిల్లలకు, టీచర్లకు ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ఇంగ్లిషు ల్యాబ్, కాంపౌండ్‌ వాల్, కిచెన్‌ షెడ్, అదనపు తరగతి గదులు, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్, కావాల్సిన మరమ్మతులు అన్నీ చేపడుతున్నాం. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దాం. ఇందులో డిజిటల్‌ తరగతుల ఏర్పాటు కూడా పూర్తిచేస్తాం. 

  • ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషు భాషకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి సబ్జెక్టు వారీగా టీచర్లను 3వ తరగతి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. 
  •  ఉన్నత విద్యా స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేవలం విద్య ద్వారానే పేదిరికం నుంచి బయటపడతారని గట్టిగా విశ్వసిస్తూ విద్యాదీవెన పథకం ద్వారా 100శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు దీనిద్వారా లబ్ధిపొందారు. విద్యార్థులు భోజనం, హాస్టల్‌ ఖర్చుకోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. 
  • ఇక అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో సంప్రదాయ కోర్సులను ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదద్దాం. నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. 1.6 లక్షలమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే ముందుకు వచ్చింది. కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. 2018–19లో క్యాంపస్‌ల ద్వారా 37వేలమందికి ఉద్యోగాలు వస్తే, 2020–21లో 69వేలు వచ్చాయి. 

  • పౌరుల గడపవద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ.. చివరి వరకూ అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తున్నాం. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ప్రతి 50–100 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను కూడా నియమించాం. దీనివల్ల ఉపాధి కల్పించడమేకాదు, అవినీతి లేకుండా, పారదర్శకంగా సేవలను ప్రజలకు అందిస్తున్నాం. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాం. వివక్షకు, అవినీతికి తావులేకుండా అర్హులైన వారి అందరికీ అన్ని అందాలన్నదే లక్ష్యం. 
  •  దీనికి సంబంధించి ఒక నోట్‌ను కూడా సమర్పించిన సీఎం జగన్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 


చదవండి: ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement