సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ పూర్తిగా ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఒంగోలు నియోజకవర్గంలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీ, మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, వివిధ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. తాజాగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా మాచర్లలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
దీంతో ఈ రెండు నియోజకవర్గాల నుంచి దాదాపు 90 శాతం మంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరినట్లవుతుంది. మార్కాపురానికి చెందిన మాజీ మునిసిపల్ చైర్మన్ నుంచి సర్పంచ్‌ల వరకు, యర్రగొండపాలెం నియోజకవర్గంలో మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లతో సహా వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరడంతో తృతీయ శ్రేణి నాయకులు కూడా కాంగ్రెస్‌లో మిగిలే పరిస్థితి లేదు. లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదించగానే ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆయన ఇటీవల కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎక్కువ మంది వైఎస్సార్ సీపీ వైపు మొగ్గుచూపడంతో బాలినేని శ్రీనివాసరెడ్డిని సంప్రదించారని, ఆయన నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించగానే పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం మార్కాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. బాలినేని ఆశీస్సులతో పాటు పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని తెలిపారు. అలాగే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మరికొందరు ముఖ్యనేతలు త్వరలో పార్టీలో చేరే అవకాశం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ ఖాళీ
Published Sat, Mar 8 2014 2:59 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement