సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కృషి కారణంగానే భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలకు సంక్రమించిన అనేక హక్కులు రాజ్యాంగ ఫలితమే అని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత, విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్ అండ్ బి మంత్రి శంకర నారాయణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, జెల్లీ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు నారుమల్లి పద్మజ, నారాయణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(చదవండి: గురుపూరబ్ ఉత్సవాలకు రండి)
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ చిత్తశుద్ధితో బాధ్యతలు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వాలు రాజ్యాంగానికి ఎలా తూట్లు పొడిచాయో మనం చూశాం. చివరికి ప్రతిపక్ష పార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లారు. కొన్ని వ్యవస్థలు, కొంత మంది వ్యక్తులు రాజ్యాంగాన్ని వేరే విధంగా వినియోగించుకుంటున్నాయి’’ అని గత టీడీపీ ప్రభుత్వ తీరును వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నాం: ఆదిమూలపు
అంబేడ్కర్ భావజాలంతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అమరావతిలో జరిగిన అవకతవకలు చూశాం.. ఇప్పుడు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలించాలని ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అడ్డుకోవాలని చూడటం సరికాదు.- ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి
ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: హోం మంత్రి
అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో అంటరానితనం పెద్ద రుగ్మత. దాన్ని నిర్మూలించడానికి అంబేడ్కర్ కృషి చేశారు. ఆయన కృషివ ల్లే నేడు మనకు మంచి రాజ్యాంగం అందుబాటులో ఉంది. రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం జగన్ ముందుడుగు వేసి, అన్ని వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదే విధంగా 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళకు స్థానం కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందాలని అనేక సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇతర రాష్ట్రాలకు మన ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది.- హోం మంత్రి మేకతోటి సుచరిత
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి: మంత్రి శంకర నారాయణ
సమ సమాజ స్థాపన కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిది. ఆయన స్పూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు.
రాజకీయాలకు అతీతంగా పాలన: వెల్లంపల్లి శ్రీనివాస్
ప్రాథమిక హక్కులను గత ప్రభుత్వం కాలరాసింది. దళితులకు, అణగారిన వర్గాలకు అందించాల్సిన పథకాలు గతంలో అందించలేదు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment