ఏటీఎం
ప్రజల్లో చిన్న అపోహ.. దాన్ని నివృత్తి చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం.. బ్యాంకింగ్ వ్యవస్థ పరపతినే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది! విత్‌డ్రాలు జోరుగా సాగుతుంటే మరోవైపు డిపాజిట్లు, జమలు నీరసించిపోతున్నాయి. దీంతో బ్యాంకుల్లో నగదు కొరత తీరట్లేదు సరికదా... ప్రతినెలా లావాదేవీల కోసం రిజర్వ్‌బ్యాంకు వైపు చూడాల్సిన ఆగత్యం తప్పట్లేదు! దీంతో ప్రజలు ముఖ్యంగా రైతుల నగదు కష్టాలు తారస్థాయికి చేరాయి. ధాన్యం సొమ్ము ఖాతాలో కనిపిస్తున్నా నగదు చేతికి రాక అప్పులు తీర్చుకోలేకపోతున్నారు. ఇవిలా ఉండగానే మళ్లీ ఖరీఫ్ కాలానికి మదుపులు ఎలాగనే భయాందోళనకు గురవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో రైతులు 5.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 130 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీల) ద్వారా విక్రయించారు. ఈ కొనుగోళ్లు మార్చి 31వ తేదీతో ముగిసిపోయాయి. అయితే ఆ ధాన్యంకు సంబంధించిన సొమ్ము చాలావరకూ రైతుల ఖాతాల్లో జమ అయ్యిందని పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ సొమ్ము బ్యాంకుల నుంచి రైతుల చేతుల్లోకి చేరట్లేదు. జిల్లాలో జాతీయ, ప్రైవేట్, సహకార బ్యాంకులు 24 తాలూకు బ్రాంచిలు 260 ఉన్నాయి. వీటికి జిల్లావ్యాప్తంగా 300 వరకూ ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో నిర్వహణ సరిగాలేక 32 ఏటీఎంలు పనిచేయట్లేదు. 268 ఏటీఎంలు వర్కింగ్ కండిషన్‌లో ఉన్నాయి.
వాటిలో రోజుకు సగటున రూ.10 కోట్లు వరకూ నగదు ఉంచాల్సి ఉంది. కానీ వాటిలో 60 వరకూ క్యాష్ రీసైకిల్ ఏటీఎంలే. వాటిలో ఎవ్వరైనా డిపాజిట్ చేస్తే మరెవ్వరికైనా ఆ నగదును విత్‌డ్రా చేసే అవకాశం లభిస్తోంది. చాలా ఏటీఎంలు నగదు లేకుండా దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా అవసరాల కోసం రోజుకు రూ.200 కోట్లు నగదు కావాలి. కానీ ప్రస్తుతం బ్యాంకుల్లో రోజువారీ లావాదేవీలు రూ.8 కోట్లకు పడిపోయాయి. మరోవైపు నగదు ఆధారిత లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నగదురహిత లావాదేవీల విధానాన్ని తెరపైకి తెచ్చినా ఆచరణలో పూర్తిగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు నాలుగు పురపాలక సంఘాలు, సుమారు 2,200 గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీలో పలుచోట్ల బ్యాంకులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. నగదు విత్‌డ్రా కోసం రైతులు గ్రామాల నుంచి కొన్ని కిలోమీటర్లు వ్యయప్రయాసలు ఎదుర్కొని వస్తున్నారు. తీరా బ్యాంకులలో రూ.2 వేలు లేదంటే రూ.3 వేల వరకూ మాత్రమే విత్‌డ్రా చేయడానికి సిబ్బంది అంగీకరిస్తున్నారు. ఎక్కువ మొత్తం కావాలంటే నగదు లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
నగదు కోసం నగుబాటు తప్పదా...
కొత్త రూ.2000 కరెన్సీ నోట్లు చలామణి తగ్గిపోతున్నాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి వస్తున్న నోట్లకు, అవి ప్రజల్లో వెళ్లి మళ్లీ బ్యాంకుకు తిరిగొస్తున్న నోట్ల సంఖ్యకు చాలాచాలా వ్యత్యాసం కనిపిస్తోందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. దీనికితోడు జిల్లా ప్రజలు ఎక్కువమంది కొనుగోళ్లు విశాఖపట్నం, విజయనగరంలోనే చేస్తున్నారు. దీనికి నగదుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో జిల్లా నుంచి నగదు చాలావరకూ పొరుగు జిల్లాలకు వెళ్లిపోతోందని బ్యాంకు సిబ్బంది వాదన. నగదురహిత లావాదేవీలకు అవకాశం ఉన్నా వ్యాపారుల్లో చాలామంది జీఎస్‌టీ భయంతో క్యాష్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదనలు ఉన్నాయి. కార్డుల కన్నా క్యాష్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తుండటం దీనికి నిదర్శనం. దీనివల్ల నగదు వ్యాపారుల చేతుల్లోకి, తర్వాత విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లోని పెద్ద వ్యాపారులు (డిస్ట్రిబ్యూటర్లు), డీలర్ల చేతిలోకి నగదు వెళ్లిపోతోందనేది మరో వాదన.
ఏదేమైనా జిల్లాలో మాత్రం నగదు కొరత తీరట్లేదు. గత ఏడాది చివర్లో వచ్చిన ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు కూడా బ్యాంకుల్లో డిపాజిట్లు, జమలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనిపై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంలో అటు ప్రభుత్వాలు, ఇటు బ్యాంకులు విఫలమయ్యాయి.దీంతో బ్యాంకుల్లో నగదు నిల్వ ప్రతి నెలా తగ్గిపోతోంది. ఆర్‌బీఐ నుంచి నెలనెలా వచ్చే నగదు కోసం బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి. గత నెల రూ.100 కోట్లు కావాలని కోరితే రూ.90 కోట్ల నగదు వచ్చింది. దీనిలో రూ.35 కోట్ల వరకూ పింఛన్లకే పోయింది. మళ్లీ ఈనెలలో మరో రూ.100 కోట్ల నగదు కోసం బ్యాంకర్లు విన్నపాలు చేశారు. దీనిలో మళ్లీ పింఛన్లకు రూ.35 కోట్లు పోతే మిగిలిన సొమ్ము ఖాతాదారుల అవసరాలకు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ప్రతినెలా ఇదే పరిస్థితి ఉండటంతో జిల్లాలో ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే భయమేల?
ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై సందేహాలు తగదు. దానివల్ల ఖాతాదారుల డిపాజిట్‌లకు వచ్చే నష్టమేమీ ఉండదు. సొమ్ము ఇళ్లల్లో కన్నా బ్యాంకుల్లో ఉంటేనే భద్రం కూడా. ప్రస్తుతం బ్యాంకుల నుంచి విత్‌డ్రా అవుతున్న సొమ్ము కన్నా తిరిగి బ్యాంకులకు వచ్చే సొమ్ము చాలా తక్కువగా ఉంటోంది. దీనివల్ల లావాదేవీలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈనెల 25వ తేదీ నాటికి రూ.100 కోట్లు నగదు అవసరమని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా ఆర్‌బీఐకి నివేదించాం. గత నెల ఇలా రూ.100 కోట్లు కోరితే ఈనెల మొదటి వారంలో రూ.90 కోట్లు జిల్లాకు వచ్చింది. పింఛన్ల కోసమే రూ.35 కోట్లు నగదు నెలనెలా అవసరమవుతోంది.
– పి.వెంకటేశ్వరరావు, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజరు, శ్రీకాకుళం
అప్పులు తీరక ఉక్కిరిబిక్కిరి...
నేను ఫిబ్రవరిలో 87 క్వింటాళ్ల ధాన్యం పాలకొండ పీఏసీఎస్‌కు అందించాను. కానీ ఆన్‌లైన్‌లో నా భూమి వివరాలు లేవని నెల రోజులు తిప్పారు. తర్వాత బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. కానీ ఇప్పటికీ మొత్తం డబ్బు చేతికి రావట్లేదు. రోజంతా బ్యాంకు వద్ద లైన్‌లో నిలబడితే రెండు వేలో, మూడో వేలో ఇస్తామంటున్నారు. ఏటీఎంలు పనిచేయట్లేదు. ఏడాది క్రితం పొలం పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరట్లేదు. అప్పు ఇచ్చినోళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ వచ్చే ఖరీఫ్‌కు మదుపు చూసుకోవాలి.
– బలగ నాగేశ్వరరావు, కొండాపురం, పాలకొండ మండలం
చేతకాని ప్రభుత్వం వల్లే అవస్థ
నేటికి నా ధాన్యం సొమ్ము బ్యాంకు నుంచి తీసుకోలేకపోతున్నాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం (పీపీసీ)లోనే ధాన్యం ఇచ్చా. పాస్ పుస్తకాలు, అడంగల్ పత్రాలంటూ తొలుత పీపీసీ వాళ్లు తిప్పారు. ధాన్యం సొమ్ము తీరా ఖాతాలో జమ చేసినా బ్యాంకుల్లో నగదు లేక చేతికి ఇవ్వట్లేదు. రైతులను ఏవిధంగా ఆదుకోవాలో చేతకాని ప్రభుత్వమిది.
– కండాపు ప్రసాదరావు, రుద్రిపేట, పాలకొండ మండలం
ఖాతాలకే పరిమితమైన ధాన్యం డబ్బు
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్మితేనే మా అప్పులు తీరుతాయి. కానీ పీపీసీల్లో అమ్మడానికీ ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు బ్యాంకు ఖాతాలో ఉన్నా అక్కడా ఇప్పటికీ అవసరమైనంత తీసుకోలేకపోతున్నాను. ఇంటి అవసరాలకూ ప్రైవేట్ వ్యాపారులు, తెలిసినవాళ్ల వద్ద చేబదులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో!
– యాబాజి రమేష్, లింగాలపాడు, నరసన్నపేట
ప్రజల్లో చైతన్యం వస్తేనే పరిష్కారం
ప్రజల్లో చైతన్యం రానంతవరకూ బ్యాంకుల్లో నగదు కష్టాలకు పరిష్కారం దొరకదు. ప్రస్తుతం బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరు వల్ల అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. కొబ్బరి వ్యాపారులు రైతులకు ఇవ్వాల్సిన మొత్తాలను ఇవ్వడానికి కూడా బ్యాంకులో నగదు ఇవ్వకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. రైతుల నుంచి కొన్న సరకుకు సకాలంలో నగదు చెల్లించలేకపోతున్నాం.
– నరేష్ గుప్తా, చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు, కంచిలి
Comments
Please login to add a commentAdd a comment