విత్‌డ్రా కష్టాలు ఉంటాయా.. పోతాయా?
విత్‌డ్రా కష్టాలు ఉంటాయా.. పోతాయా?
Published Sun, Dec 25 2016 2:47 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
ఈ నెలాఖరు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల నుంచి కరెన్సీ విత్‌డ్రా చేయడానికి పరిమితులు చాలావరకు ఉండబోవని, ఎంచక్కా వెళ్లి కావల్సినంత మొత్తం తీసుకోవచ్చని నిన్నమొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ, ఇదంతా ఇప్పట్లో జరిగేలా లేదు. డిసెంబర్ 30 తర్వాత కూడా నోట్ల విత్‌డ్రా మీద పరిమితులు కొనసాగుతాయని ఆర్థికశాఖ వర్గాలు అంటున్నాయి. బ్యాంకులలో పని సక్రమంగా నడవాలంటే, ఈ పరిమితి కొన్నాళ్లు కొనసాగించక తప్పదని బ్యాంకర్లు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం కరెన్సీ ఇంకా అంతగా అందుబాటులోకి రాలేదు. దాంతో వారానికి 24వేల రూపాయల చొప్పున కూడా చాలావరకు బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయి. వచ్చిన కస్టమర్లకు 5-10 వేలు ఇచ్చి సర్దుకుపొమ్మని చెబుతున్నాయి. నాసిక్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో 500 రూపాయల నోట్ల ముద్రణను మూడురెట్లు పెంచామని చెబుతున్నా, ఆ డబ్బులు ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నింటికీ, ఏటీఎంలలోకి వచ్చి.. తగినంత క్యాష్ అందుబాటులోకి రావాలంటే ఇంకా సమయం పడుతుందంటున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన 50 రోజుల గడువు ఏమాత్రం సరిపోవడం లేదని, మరి కొంత కాలం పాటు ఈ కష్టాలు తప్పవని తెగేసి చెబుతున్నారు. ఏటీఎంల నుంచి కూడా ఎంత కావాలంటే అంత విత్‌డ్రా చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకులకు మరింత మొత్తంలో నగదు అందుబాటులోకి వస్తే తప్ప పరిమితి ఎత్తేయడం సాధ్యం కాదని ఈమధ్యే ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా చెప్పారు. నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు మొత్తం 5.92 లక్షల కోట్ల కొత్త నోట్లను రిజర్వు బ్యాంకు విడుదల చేసింది. అయితే, రద్దు చేసిన నోట్ల విలువ మాత్రం 15.4 లక్షల కోట్లు కావడంతో.. ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. ఈనెల పదో తేదీ వరకు రద్దు చేసిన పెద్దనోట్లు రూ. 12.4 లక్షల కోట్ల మేర బ్యాంకులకు వచ్చినట్లు రిజర్వు బ్యాంకు చెబుతోంది.
Advertisement
Advertisement