తెర్లాం ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కూర్చొన్న ఖాతాదారులు
ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు కాస్తా బ్యాంకు ఖాతాలో జమయింది... కానీ దానిని తీసుకునేందుకు అవకాశం లేకపోతోంది. పిల్లల పెళ్లిళ్లకోసం గతంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన మొత్తం మెచ్యూర్ అయింది... కానీ దానిని చెల్లించేందుకు బ్యాంకులో నగదు కొరతగా ఉందంట. బ్యాంకులో డబ్బు నిల్వ ఉంది కదా అని ఓ చిన్నపాటి స్థలం కొనుక్కుంటే... వారికి చెల్లించేందుకు బ్యాంకు నెంచి తెచ్చుకునే వెసులుబాటు లేదు. జీతం డబ్బు ఖాతాలో ఉంది. కానీ రోజువారీ ఖర్చులకు తీసుకుందామంటే ఏ ఏటీఎం కూడా పనిచేయడం లేదు. ఇదీ జిల్లాలో సగటు జనం క్యాష్‌కష్టాలు.
సాక్షిప్రతినిధి విజయనగరం : పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడ్డ కష్టాలు జిల్లా వాసులను వదలనంటున్నాయి. నగదు కోసం ఏటీఎంల వద్దకెళితే ‘నో క్యాష్’బోర్డులు వెక్కిరిస్తున్నాయి. కొన్ని చోట్లయితే ఏకంగా షట్టర్లు వేసేసి ఉంటున్నాయి. అరకొరగా నగదు ఉన్న ఏటీఎంలవద్ద చాంతాడంత క్యూ కనిపిస్తోంది. జిల్లాలో నగదు కష్టాలు మళ్లీ పెరిగాయనే చెప్పక తప్పదు. జిల్లాలోని ఏటిఎంలలో దాదాపు సగం ఖాళీగా ఉండగా 25 శాతం ఏటిఎంలలో సగానికి కంటే తక్కువ నగదు ఉంది. మిగతా వాటిలో 75 శాతం ఉం డటంతో జనం వాటి వద్ద క్యూ కడుతున్నారు. జిల్లాకు గతంలో ఆర్‌బీఐ నుంచి వచ్చే నగదు కోటా కూడా సగానికిపైగా తగ్గిపోయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిపాజిట్లు కూడా తగ్గాయి. అయితే శుక్రవారా ని కల్లా నగదు కొరత సమస్యను తీరుస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ గురువారం ప్రకటించారు. మిగిలి న బ్యాంకులు మాత్రం ఇంత వరకూ ఈ సమస్యపై స్పందించలేదు.
విడుదలవుతున్న నిధులు ఏ మూలకి?
జిల్లా్లలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, రూరల్ బ్యాంకుల శాఖలన్నీ కలిపి 295 వరకూ ఉన్నాయి. వీటిలో 40.91 లక్షల ఖాతాదారులున్నారు. వీరిలో 40 శాతం మంది ఏటీఎం సేవలను వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 258 ఏటీఎంలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాలు, సామాజిక పింఛన్‌ల సొమ్ములు వంటి ప్రధాన రంగాలను కలుపుకొని జిల్లాకి నెలకు రూ.250 కోట్ల వరకూ అవసరం ఉంది. కానీ నోట్ల రద్దు నేపధ్యలో ఏర్పడిన స్తబ్ధత కారణంగా ఏడాదిగా ప్రతినెలా సగటున రూ.120 కోట్లకు మించిరావడం లేదు. గత నెల రూ.150 కోట్లు, తాజాగా ఈ నెల రూ.81 కోట్లు మాత్ర మే ఆర్‌బీఐ నుంచి వ చ్చింది. ఈ నేపథ్యం లో జిల్లాలో నగదు సమస్య తీవ్రమైంది. మరో వైపు నగదు రహిత లావాదేవీలకు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు నీరుగారాయి.
అవసరానికి తగ్గ పరికరాలేవీ?
అవగాహన ఉన్న 50 శాతం వినియోగదారులకు కూడా అందుబాటులో క్యాష్‌లెస్ ట్రాంజేక్షన్ మెషీన్లు జిల్లాలో లేవు. జిల్లా వ్యాప్తంగా కనీసం 1,500 నగదు రహిత లావాదేవీల పరికరాల డిమాండ్ ఉండగా కేవలం 831 మిషన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో వైపు జిపాజిట్లు కూడా బాగా తగ్గాయి. గతేడాది డిసెంబర్‌నాటికి ముగిసిన ఆరు మాసాల్లో తొలి మూడు మాసాలకు రూ.7,956 కోట్ల మేరకు డిపాజిట్లు రాగా చివరి మూడుమాసాలలో రూ.300 కోట్ల వరకు తగ్గి కేవలం రూ.7,656 కోట్లు మాత్రమే డిపాజిట్లు లభించాయి.
అన్ని విభాగాలవారీకి అవస్థలే
పొలం పనులు మొదలుపెట్టడానికి పెట్టుబడికి డబ్బులు కావాలి. కానీ నగదు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాల్లో డబ్బులున్నప్పటికీ తీసుకోలేని పరిస్థితి రావడంతో శుభకార్యాలు చేసుకునేవారి బాధలు అన్నీ ఇన్నీ కావు. మే నెల మొదటి వారం తర్వాత ఆగస్టు వరకూ సుముహూర్తాలు లేవని పండితులు చెబుతుండటంతో ఈ నెలలోనే పెళ్లి వంటి శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకున్నవారు వాటి నిర్వహణకు డబ్బులు లేక ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంక్ అధికారులను బ్రతిమలాడినా రూ.20 వేలకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. కొంతమంది తమకు దగ్గర్లో ఉన్న ఏటీఎంలో నగదు లేకపోతే పక్క ఊళ్లల్లో, పట్టణాల్లో ఏటీఎంలకు పరుగులు తీస్తున్నారు. తీరా వెళ్లాక అక్కడ చాంతాడంత లైన్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. నోట్లు రద్దు చేసినప్పుడు ఎటువంటి కష్టాలు పడ్డామో ఇప్పుడూ అవే కష్టాలు పడాల్సి వస్తోందని, డబ్బులు బ్యాంక్‌లో దాచుకోవాలంటేనే భయం వేస్తోందని వారు వాపోతున్నారు.
బ్యాంక్‌ల్లో నిల్వ చేయడానికి విముఖత
బ్యాంక్‌ల్లో నిల్వ ఉంచడానికి ఖాతాదారులు ఇష్టపడకపోవడం వల్లే నగదు రొటేషన్ అవ్వడం లేదు. బ్యాంక్‌ల్లో నగదు దాచేందుకు ఖాతా దారులకు ఉత్సాహం చూపే దిశగా చర్యలు మెరుగుపరచాలి. వ్యాపార వర్గాలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉండొచ్చు.
–పి.ఎస్.సి.నాగేశ్వరావు, అధ్యక్షుడు, విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్
Comments
Please login to add a commentAdd a comment