‘మా’లో విభేదాలు లేవు
మాచవరం (రాయవరం) : సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావాలన్నది తన కోరిక అని సినీ నటి హేమ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జిల్లాలో స్టూడియో నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నానని ఆమె తెలిపారు. శుక్రవారం రాయవరం మండలం మాచవరంలోని ద్వారంపూడి చౌదరారెడ్డి ఇంటికి వచ్చిన హేమ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే..
స్థల సేకరణ పనిలో..
రాజమండ్రి- రాజోలు మధ్యలో స్టూడియో నిర్మాణానికి అనుకూలమైన స్థలం సేకరించే పనిలో ఉన్నాను. జిల్లాలో సినిమా షూటింగ్స్‌కు అనుకూలమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సినీపరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలంటే స్థానికులు సినీపరిశ్రమలోని వ్యక్తుల విషయంలో మరింత గౌరవప్రదంగా ప్రవర్తించాలి. సినిమా పరిశ్రమ అభివృద్ధితో చాలామందికి ఉపాధి దొరుకుతుంది.
25 సంవత్సరాలు పూర్తయింది..
సినీ రంగంలో ప్రవేశించి ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తయింది. ఇన్నేళ్లుగా విరామం లేకుండా నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఏడో తరగతి చదువుతుండగా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. భలేదొంగలు సినిమాలో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డాను.
465 చిత్రాల్లో నటించా..
ఇంతవరకూ 465 సినిమాల్లో నటించాను. ప్రస్తుతం పది సినిమాలతో బిజీగా ఉన్నాను. శ్రీను దర్శకత్వంలో రాజోలులో చిత్రీకరణ జరుగుతున్న సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాను. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమాలో కామెడీ పాత్రలో, కరెంట్ చిత్ర దర్శకుడు ప్రతాప్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో సెంటిమెంట్ టచ్ ఉన్న ‘అమ్మ’ పాత్రలోనూ నటిస్తున్నాను.
పోలీసాఫీసర్‌గా నటించాలని ఉంది
నాకు చిన్నప్పటి నుంచి పోలీసాఫీసర్ అవ్వాలని ఉండేది. చదువు ఆపేసి మధ్యలో నటనలోకి వచ్చేశాను. కనీసం పోలీసాఫీసర్ పాత్రలో నటించి ఆ ముచ్చట తీర్చుకోవాలని ఉంది. ఏడాది క్రితం వరకు హాస్య పాత్రల్లోనే నటించాను. ఆ తర్వాత విభిన్న తరహా అవకాశాలు వస్తున్నాయి. అతడు, అష్టాచమ్మా, మల్లీశ్వరి, నువ్వునాకునచ్చావ్ చిత్రాలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
‘మా’లో విభేదాలు లేవు
‘మా’ ఎన్నికల్లో పోటాపోటీ వాతావరణం నెలకొన్న విషయం వాస్తవమే. కానీ అది ఎన్నికల వరకే. ఇతర విషయాల్లో అందరం ఒకటిగానే ఉంటున్నాం.