చచ్చినా పట్టించుకోరు.. | No Facilities In GGH Guntur | Sakshi
Sakshi News home page

చచ్చినా పట్టించుకోరు..

Published Wed, Jul 3 2019 12:29 PM | Last Updated on Wed, Jul 3 2019 12:33 PM

No Facilities In GGH Guntur - Sakshi

మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం

అర్ధరాత్రి వేళ.. గుంటూరు జీజీహెచ్‌ బయట ప్రాంగణంలో నా శరీరం నిర్జీవంగా పడి ఉంది. పది రోజుల క్రితం రోగంతో మూలుగుతూ వచ్చి ఆస్పత్రిలో పడిన నా శరీరానికి ఆయువు తీరింది. కుటుంబ సభ్యులు నన్ను పట్టుకుని కదిలిస్తూ గుండెలు బాదుకుంటున్నారు. నా శవాన్ని మార్చురీలో పెట్టాలా ? వద్దా ? అంటూ అక్కడ సిబ్బంది నిద్దుర కళ్లతో విసుక్కుంటున్నారు. అప్పటికే నా చుట్టూ ఈగలు రొద చేస్తున్నాయి. బయట అంబులెన్స్‌ల నిర్వాహకులు నా శవాన్ని తీసుకెళ్లడానికి బేరమాడుతున్నారు. పూట గడవని బతుకుల్లో నా చావు కూడా అప్పుల దరువేయిస్తోంది. నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి నా కుటుంబ సభ్యుల వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఇది చూసిన నా బంధువుల్లో ఒకరు.. ‘ఈడి చావు మన చావుకొచ్చిందిరా’ అని విసుక్కుంటుంటే మూతబడిన నా కళ్లలో నీటి చెమ్మ సుడులు తిరిగింది.

ప్రభుత్వాస్పత్రిలో ఉచిత అంబులెన్స్‌ ఉంటదంట.. అని ఎవరో అంటుంటే.. పక్కనే ఉన్న ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్‌ వెకిలిగా నవ్వాడు. ఆ బళ్లు పగలే సరిగా తిరగవు.. ఇక రాత్రి పూట చెప్పే పనే లేదు.. ఈ శవాన్ని మీ దగ్గరే ఉంచుకోండంటూ విసురుగా వెళ్లిపోయాడు. నా నిర్జీవ శరీరం వైపు నా బంధువులు జాలిగా చూశారు. వారి కళ్లలో ఆందోళనతోకూడిన ఆవేదన ఆగిన నా గుండెను బాధతో మెలిపెట్టింది. చివరకు ఓ ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవరొచ్చి బేరం కుదిర్చాడు.. అంతా చందాలు వేసుకుని అంబులెన్స్‌లొ ఆయిల్‌ పోయించి.. నా శరీరాన్ని చాపలో చుట్టి మార్చురీ గేటు దాటించారు. నా ఆత్మ ఒక్కసారి ఘోషించింది.. ఆస్పత్రి అధికారులారా.. బతికున్నప్పుడు పట్టించుకోకపోయినా.. కనీసం చచ్చాకైనా నిరుపేదలమైన మమ్మల్ని మనుషులుగా గుర్తించండయ్యా అంటూ..– జీజీహెచ్‌లో మృతుని ఆత్మఘోష

సాక్షి, గుంటూరు మెడికల్‌: కృష్ణా జిల్లా వెలగలేరుకు చెందిన కోటయ్య( 50) జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం( జూన్‌ 29న) రాత్రి చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారిని ఉచితంగా అంబులెన్స్‌లో తరలించాల్సి ఉంది. కానీ రాత్రి వేళల్లో తరలించబోమని అంబులెన్స్‌ సిబ్బంది చెప్పటంతో మృతుడి బంధువులు రూ.5 వేలుకు ప్రైవేటు అంబులెన్స్‌ మాట్లాడుకుని కోటయ్య భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు.

డబ్బులు వసూలు చేస్తున్నారు....
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన వారిని ఉచితంగా ఇళ్లకు తీసుకెళ్ళేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత అంబులెన్స్‌ల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. మేలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కలకలూరుకు చెందిన దావులూరి శారా( 55)కు తీవ్ర అనారోగ్యంతో జీజీహెచ్‌లో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్‌ డ్రైవర్‌ రూ.2 వేలు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ సీనియర్‌ వైద్యుడికి మృతురాలి బంధులు ఫోన్‌ చేసి విషయం చెప్పగా.. ఆయన వచ్చే వరకు మూడు గంటలపాటు మృతదేహాన్ని అక్కడే ఉంచారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి శవాలను వారి ఇళ్లకు ఉచితంగా ఏసీ అంబులెన్స్‌లో తరలించేలా గత ప్రభుత్వం మహాప్రస్థానం అనే రాష్ట్రంలో మెదటిసారిగా జీజీహెచ్‌లో 2017 జూన్‌ 20న ప్రారంభించారు. అంబులెన్స్‌ డ్రైవర్స్‌ మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లన పిదప ఎంతో కొంత ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేసి వసూలు చేస్తున్నట్లు పలువురు ఆస్పత్రి ఉద్యోగులే వాపోయారు. అంబులెన్స్‌ల సేవలు రాత్రి 9 గంటల తరువాత లేకపోవటంతో మృతుల కుటుంబ సభ్యులకు అనేక ఇబ్బందులకు ఎదురవుతున్నాయి.

టీడీపీ నేతలకు కాంట్రాక్ట్‌...
మహా ప్రస్థానం వాహనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఒక్కో కిలోమీటర్‌కు వాహనానికి ఎంత చెల్లించాలి, టీడీపీ ప్రభుత్వం మహాప్రస్థానం నిర్వాహకులతో ఎలాంటి ఒప్పందం చేసుకుందనే విషయాలను ఆస్పత్రి అధికారులు ఇప్పటి వరకు బయట పెట్టలేదు. టీడీపీ నేతలకు మహా ప్రస్థానం కాంట్రాక్ట్‌ను టీడీపీ ప్రభుత్వం అప్పగించింది. దీంతో మృతదేహాల తరలింపు వ్యవహారం కాంట్రాక్టర్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి నడుస్తుంది. గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారిని ఉచితంగా అంబులెన్స్‌లో తరలించేవారు.

సుమారు ఐదేళ్లపాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించారు. కిలోమీటర్‌కు ఎనిమిది రూపాయల చొప్పున ప్రైవేటు అంబులెన్స్‌ వారికి జీజీహెచ్‌ అధికారులు చెల్లించేవారు. టెండర్‌ లేకుండా టీడీపీ నాయకులకు సంబంధించిన సంస్థకు కాంట్రాక్ట్‌ అప్పగించారు. వీరికి ఆస్పత్రి అధికారులు ఎంత చెల్లిస్తున్నారో కూడా ఎవ్వరికీ చెప్పటం లేదు. వాహనాల్లో మృతదేహాలను తరలించేందకు ఆర్‌ఎంవో సంతకం పెట్టి పంపిస్తారే తప్పా ఆయనకు కాంట్రాక్టర్‌తో ఉన్న ఒప్పందం గురించి ఏ ఒక్క విషయం తెలియదు.

జిల్లాకే పరిమితం చేశారు...
తొలుత రాష్ట్ర వ్యాప్తంగా మృతదేహాలను తరిస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి కేవలం గుంటూరు జిల్లాకే వాహనాలను పరిమితం చేశారు. ఇతర జిల్లాలకు మృతదేహాలను తరలించే సమయంలో డ్రైవర్స్‌ డబ్బులు తీసుకుంటున్నారు. జీజీహెచ్‌కు పలు జిల్లాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఏడు మహాప్రస్థానం అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ వాటి సేవలన్నీ కేవలం పగలు వరకే పరిమితమవుతున్నాయి. రాత్రి వేళల్లో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు ఆస్పత్రిలోనే తిష్టవేసి మృతదేహాల తరలింపునకు అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఈ సమస్యపై  స్పందించి ఉచిత అంబులెన్స్‌ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement