నిర్మాణ దశలో ఉన్న నెక్లెస్‌రోడ్డు
నెల్లూరు సిటీ: నెక్లెస్ రోడ్డు పనులు 40 శాతం కూడా పూర్తి కాకుండానే మంత్రి నారాయణ ఎన్నికలు సమీపిస్తున్నాయని హడావుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. రాత్రికిరాత్రి టైల్స్ ఏర్పాటు, రోడ్డు నిర్మాణ పనులు చేయడంతో రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఘాట్ వద్ద వేసినæ టైల్స్ ఊడి బయటకు వచ్చేస్తున్నాయి. మరోవైపు రోడ్డు నిర్మాణంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
నిరాశతో వెనుదిరుగుతున్న నగర ప్రజలు
మంత్రి నారాయణ నెక్లెస్ రోడ్డును ఘనంగా నిర్మించానని ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. నెక్లెస్‌రోడ్డు నిర్మాణం పూర్తయిందనే ఉద్దేశంతో నగర ప్రజలు నెక్లెస్‌రోడ్డును చూసేందుకు దూరప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే ప్రకటనల్లో చెబుతున్నట్లు నెక్లెస్‌రోడ్డు నిర్మాణం 50 శాతం కూడా పూర్తికాకపోవడంతో ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అమరావతి గ్రాఫిక్స్‌లా నెక్లెస్‌రోడ్డు కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టెండర్ దశ నుంచే దోపిడీ
నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(నుడా) ఆధ్వర్యంలో నెల్లూరు చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. ఇందుకుగాను రూ.25.85 కోట్లతో సుందరీకరణ పనులకు టెండర్‌లు పిలిచారు. ఇక్కడే మొత్తం వ్యవహారం అవినీతిమయంగా మారింది. అధికారపార్టీ నేతల ధనదాహం, అవినీతి కారణంగా అనర్హుడికి ఈ కాంట్రాక్ట్ దక్కింది. ఈ పనులకు సంబంధించిన టెండర్‌ను గతేడాది అక్టోబర్ 8వ తేదీన పిలిచారు. 24వ తేదీన అంటే కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆర్‌ఎమ్‌ఎన్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కంపెనీతో నుడా ఒప్పందం కుదుర్చుకుంది.
అర్హత లేని కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు టీడీపీ నేతలు భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెక్లెస్‌రోడ్డు పనులను చేపట్టేందుకు ఆర్‌ఎమ్‌ఎన్ కంపెనీకి అర్హత లేనప్పటికీ పనులు అప్పగించేందుకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చక్రం తిప్పారని సమాచారం. సదరు కాంట్రాక్ట్ సంస్థ టెండర్ వేసే సమయంలో 50 పనులు చేస్తున్నట్లు చూపారు. అయితే కేవలం రూ.36. 59 కోట్ల పనులు చేపట్టేందుకు మాత్రమే అర్హత కలిగి ఉంది. ఇదే సంస్థ హైదరాబాద్‌లో ఇప్పటికే రూ.44 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌లు చేస్తుండగా ఆ పనులను టెండర్‌లో చూపలేదు.
అంటే అర్హతకు మించి పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థకు నెల్లూరు నెక్లెస్‌రోడ్డు పనులు అప్పగించడం వెనుక అధికారపార్టీ నేతల జోక్యం, మతలబు ఉందని స్పష్టమవుతోంది. దీనికి సం బంధించి ఒక కాంట్రాక్టర్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించడంతో అసలు విషయం వెలుగుచూసింది. నెక్లెస్‌రోడ్డు పనుల్లో సుమారు రూ.2.50 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మాణం చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
నెక్లెస్‌రోడ్డు నెల్లూరు నగరానికి మణిహారంగా ఉంటుందంటూ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఆర్భాటంగా ప్రకటనలు చేయగా నిర్మాణం పూర్తికాక ముందే రోడ్డుకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. నగరంలోని ఇరుకళల అమ్మవారి ఆలయం నుంచి బారాషాహిద్ దర్గా వరకు నిర్మించిన నెక్లెస్‌రోడ్డును కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణం హెచ్చుతగ్గులుగా ఉంది. మరోవైపు ఇరుకళల అమ్మవారి ఆలయం వద్ద ఘాట్ నిర్మాణంలో టైల్స్ ఊడిపోయాయి. అయినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కేవలం కాంట్రాక్టర్‌కు నిధులు ఫలహారంగా ఇచ్చేందుకే ఈ పనులు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment