ఎన్నికల పండగ చేసుకున్నారు..! | Full Percentage Polling Recorded In Nellore | Sakshi
Sakshi News home page

ఎన్నికల పండగ చేసుకున్నారు..!

Published Fri, Apr 12 2019 11:18 AM | Last Updated on Fri, Apr 12 2019 11:23 AM

Full  Percentage Polling Recorded In Nellore - Sakshi

నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ఆనందంలో యువతులు

సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు. తుది సమాచారం మేరకు సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 68.75 శాతం పోలింగ్‌ జరిగింది. పలు నియోజక వర్గాల్లో సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో రాత్రి 12 గంటల వరకూ ఓటు వేశారు. మొత్తం మీద 75 శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు సిటీలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైనట్టు తెలిసింది. మొత్తంగా ఎండల తీవ్రత ఉన్నా.. ఈ దఫా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓట్ల పండగ వాతావరణం కనిపించింది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. 

నెల్లూరు(పొగతోట):   సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో పోలింగ్‌ కేంద్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. అయితే పోలింగ్‌ ప్రక్రియలో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడడంతో అక్కడక్కడ పోలింగ్‌ మందకొడిగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 2,833 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి, సూళ్లూరుపేట ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి నిరీక్షించారు. సుమారు 400 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయకపోవడంతో పోలింగ్‌ ప్రక్రియ రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది.

రాత్రి 8 గంటల వరకు ఓటర్లు క్యూలైన్లలోనే ఉన్నారు. నెల్లూరు నగరం, రూరల్, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, కోవూరు, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడం, మరమ్మతులకు గురి కావడంతో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కూడా 7.83 శాతం పోలింగ్‌ దాటలేదు. 

6 కేంద్రాల్లో రీపోలింగ్‌?
పోలింగ్‌ ప్రారంభానికి ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. 6 పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ వివరాలు నమోదు చేయకపోవడం, డిలిట్‌ చేయకుండానే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్‌కు జిల్లా అధికారులు నివేదికలు పంపించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశిస్తే రెండు రోజుల తర్వాత రీపోలింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 
ఓటింగ్‌ శాతం సేకరణలో జాప్యం
జిల్లాలో 23,92210 మంది ఓటర్లు ఉన్నారు. 2,833 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ శాతం సేకరించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రతి రెండు గంటలకు ఒక పర్యాయం పోలింగ్‌ శాతం వివరాలు ప్రకటించాల్సి ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు అందజేయాల్సిన పోలింగ్‌ వివరాలు 11 గంటలు దాటిన ప్రకటించలేదు. రెండు గంటల ఆలస్యంగా పోలింగ్‌ వివరాలు ప్రకటించారు. పోలింగ్‌ వివరాలు సేకరించే యాప్‌ విఫలమైంది. దీంతో రిజర్వ్‌లో ఉండే ఎన్నికల ఉద్యోగులను కలెక్టరేట్‌కు పిలిపించి మాన్యువల్‌గా వివరాలు సేకరించారు.

దీంతో పోలింగ్‌ శాతం సేకరణలో జాప్యం జరిగింది. పోలింగ్‌ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల రాత్రి వరకు ఓటర్లు క్యూలైన్‌లో ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల విధుల్లో ఉన్న మైక్రో అబ్జర్వర్‌ (సిండికేట్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌) జావెద్‌ పొదలకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, సిబ్బంది ఆకలితో అలమటించారు. ఆహారం సరిగా లేదని వాసన వస్తుందని దింతో ఇబ్బందులు పడ్డామని నెల్లూరు నగరంలోని ఏసీనగర్‌లో ఏర్పాటు చేసిన  పోలింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్‌ దంపతులు
నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు, ఆయన భార్య సింధూర ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం దర్గామిట్టలోని సెయింట్‌జోసెఫ్‌ హైస్కూల్‌లో కలెక్టర్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.    

సాయుధ బలగాల బందోబస్తులో ఈవీఎంలు
కౌంటింగ్‌ తేదీ వరకు ఈవీఎంల్లో అభ్యర్థుల భవిత
నెల్లూరు(క్రైమ్‌): సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల పరిధిలో 2,833 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. కొన్ని కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. అభ్యర్థుల గెలుపోటములు ఈవీఎం మిషన్లలో 42 రోజులు భద్రపరచనున్నాయి. నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాలు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజకవర్గాల  శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు భారీ భద్రత నడుమ గురువారం అర్ధరాత్రి నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరుకున్నాయి.

తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన శాసనసభ, పార్లమెంటు పోలింగ్‌లకు సంబంధించిన ఈవీఎంలతో పాటు తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చే సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లోని ఎంపీ పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసు అధికారులు నెల్లూరు రూరల్‌ మండల పరిధిలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. కౌంటింగ్‌ రోజు వరకు రెండు స్ట్రాంగ్‌ రూమ్‌లకు కేంద్ర సాయుధ బలగాలు భద్రత కల్పించనున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement