విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఆత్మకూరు: ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని పోలింగ్ సరళిని బట్టి ప్రస్పుటంగా అర్థమైందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎనలేని అభిమానంతో ప్రజలు ఎప్పుడో ఆయనకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. ప్రజలు తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించారన్నారు. టీడీపీ నాయకులు ఓటమి భయంతో బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు.
దీనికి ఉదాహరణే తనపై చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లిలో దాడి జరిగిందన్నారు. ఓ వైపు రిగ్గింగు చేసుకుంటూ ప్రశ్నించినందుకు కొమ్మి, ఆయన అనుచరులు దాడులు చేశారన్నారు. ఇలాంటి దాడులకు తాను భయపడబోనని పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలే తనకు శ్రీరామ రక్ష అన్నారు. టీడీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తూ మర్రిపాడు మండలంలో ఓట్ల పోలింగ్‌లో మోసం జరుగుతోందని పుకార్లు పుట్టించి అధికారులను ఆ మండలానికి పంపారన్నారు. అదే అదునుగా చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తాను ఆ మండలానికి వెళ్లానన్నారు. టీడీపీ అభ్యర్థి బొల్లినేని తమ గ్రామానికి వస్తే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చామన్నారు.
అదే క్రమంలో తాను చేజర్ల మండలానికి వెళితే అక్రమాలకు పాల్పడటంతో పాటు తనపై భౌతిక దాడులకు పాల్పడ్డారని ఇది టీడీపీ నీచ రాజకీయమని ఆయన విమర్శించారు. పోలింగ్ సమయంలో కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ఓటర్లు ఓపిగ్గా కేంద్రాల్లో వేచి ఉండి తమ ఓట్టు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా రానున్నది జగనన్న పాలనేనని ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు జి.బాలఅంకయ్య, కొప్పోలు చిన్నపురెడ్డి ఉన్నారు.
జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో ప్రస్తుతం జరిగిన ఓటింగ్‌ను చూస్తుంటే 10 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంటు సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని కొండాపాళెంగేటు సమీపంలో గురువారం ఓటు వేసిన ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునేందుకు ఉదయం నుంచి ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశామని చెబుతుంటే మే 23వ తేదీన తప్పకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపారన్నారు. ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీదే విజయం
నెల్లూరు(సెంట్రల్): జిల్లాతో పాటు రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలుస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఓటు వేయాలనే ఉత్సాహంతో ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి సామాజిక హక్కు అన్నారు. మన బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవడం మంచిదన్నారు. ప్రస్తుతం జరిగిన తీరు చూస్తుంటే ప్రజల మనిషికే రూరల్ ప్రజలు పట్టం కట్టారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. తనను ఆశీర్వదిస్తున్న రూరల్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికృ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment