
మానవీయతలేని ఉద్యమమది : హరీష్‌రావు
సిద్దిపేట, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో మానవీయతలేదని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత టీ హరీష్‌రావు ఆరోపించారు. మెదక్ జిల్లా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘సీమాంధ్రలో ఆర్టీసీ బస్సుల్ని ఆపేయించారు. సంస్థకు రూ.600 కోట్లు నష్టాన్ని కలిగించారు. జేసీ, కేశినేని, ఎస్‌వీఆర్, కాళేశ్వర్ వంటి ట్రావెల్స్ బస్సులు మాత్రం నడిపిస్తున్నారు. సర్కారు దవాఖానాలను మూసేయించారు. కార్పొరేట్ వైద్యశాలలకు గిరాకీ పెంచారు. పేద విద్యార్థులు చదువుకునే సర్కారు బడులను బందు చేయించారు. కానీ...నారాయణ, చైతన్యలాంటి ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడలేదు.
లగడపాటి ల్యాంకో, చంద్రబాబు హెరిటేజ్‌లు మూసివేయలేదు. రేషన్ షాపులను మాత్రం తెరవనివ్వడంలేదు.. ఆఖరికు సంక్షేమ హాస్టళ్లను కూడా బంద్ చేయించి గరీబు పిల్లల కడుపు కొడతారట.. వారి కృత్రిమ ఉద్యమంలో మానవీయ విలువలు నశించాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి..?’ అంటూ మండిపడ్డారు. సమ్మె పేరిట ఆ ప్రాంత నేతలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్, మంత్రి శైలజానాథ్ అక్కడి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు తమకు రక్షణగా ఉన్న గన్‌మెన్లను కేవలం తెలంగాణ వారనే ఉద్దేశంతో వెనక్కి పంపించారని వెల్లడించారు. తద్వారా ఈ ప్రాంత పోలీసులను అవమానించారన్నారు.