రైతులందరికి ఏదీ ఇన్‌పుట్ సబ్సిడీ | No input subsidy to farmers | Sakshi
Sakshi News home page

రైతులందరికి ఏదీ ఇన్‌పుట్ సబ్సిడీ

Published Fri, Aug 23 2013 4:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

No input subsidy to farmers

 సాక్షి, నల్లగొండ: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా ఉంది అధికారుల పరిస్థితి. ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసినా అధికారుల తప్పిదాల వల్ల రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. ఫలితంగా రెండేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అకౌంట్ నంబర్లలో తప్పులు, బ్యాంకు బ్రాంచ్‌ల పేర్లలో పొరపాట్లు దొర్లడం తదితర కారణాల వల్ల ఇప్పటికీ వేల సంఖ్యలో రైతులు ఇన్‌పుట్ సబ్సిడీకి నోచుకోలేదు. వీటిని సరిచేయాల్సిన అధికారులు మొద్దునిద్ర వీడడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ బాధ్యత తమది కాదంటే కాదు అని చేతులెత్తేస్తున్నారు.
 
 ఇదీ పరిస్థితి....
 2011 ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 3.82 వేల మంది రైతులకు సంబంధించి 2.40 లక్షల హెక్టార్లలో వరి, పత్తి తదితర పంటల నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే నల్లగొండను కరువు జిల్లాగా ప్రకటిం చారు.  రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.129.75 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు రూ.118 కోట్లు మాత్రమే రైతులకు అందాయి. మిగిలిన దాదాపు రూ.12 కోట్లు మరికొందరు రైతులకు అందాల్సి ఉంది. వీటికోసం నెలలుగా తిరుగుతున్నా వారి ఖాతాల్లో జమ కావడం లేదు. గతేడాది ఖరీఫ్‌లో మళ్లీ సంభవించిన కరువు కారణంగా పంటలు ఎండిపోయాయి. ముఖ్యంగా కొన్ని మండలాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. 11 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 52,689 హెక్టార్లలో వివిధ పంటలు చేతికి రాకుండాపోయాయి. దాదాపు రూ.89 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకిగాను ఇప్పటివరకు రూ.55 కోట్లను మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు.
 
 పట్టించుకోని అధికారులు..
 ఇన్‌పుట్ సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. పంటనష్టం జరిగిన రైతుల ఖాతానంబర్లను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. అయితే చాలామంది రైతులకు సంబంధించి బ్యాం కు ఖాతా నంబర్లు తప్పుగా నమోదు చేసుకున్నారు. అంతేగాక బ్యాంకు బ్రాంచ్ పేర్లుగా సరిగా పేర్కొనలేదు. ఒక బ్రాంచ్‌కు బదు లు ఇంకో బ్రాంచ్ పేరు రికార్డుల్లో నమోదైంది. దీనికితోడు పదేళ్ల క్రితం కొందరు రైతులకు బ్యాంకులో ఖాతాలున్నాయి. ఈ ఖాతాలకు సంబంధించిన నంబర్లు ఇప్పటికీ ఆన్‌లైన్ కాలేదని సమాచారం. ఇది కూడా ఇన్‌పుట్ సబ్సిడీ అందకపోవడానికి ఒక కారణమని తెలిసింది. ఇలాంటి తప్పిదాల వల్ల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందకుండా పోతోంది. వీటిని సరిచేయాలని రైతులు బ్యాంకర్లు, అధికారుల చుట్టూ తిరుగుతు న్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.ఒకరి పేరు చెప్పి మరొకరు తప్పించుకుంటున్నారని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తమకు పెట్టుబడి రాయితీ అం దేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
 ఏడాది నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా..
 నాకు మంజూరైన ఇన్‌పుట్ సబ్సిడీ తీసుకునేందుకు ఏడాది నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. అయినా బ్యాంకోళ్లు నా ఖాతాలో డబ్బు జమ కాలేదని చెబుతున్నారు. గతేడాది వేసిన పంటా నష్టపోయా. నాకు ఆ పోయినేడు రూ.8 వేలు, గతేడు రూ.10 వేలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. కానీ బ్యాంకులో జమ కావడం లేదు. బ్యాంకు వారు మాత్రం ఎందుకు రావడం లేదో చెప్పడం లేదు. దీంతో రెండేళ్లు కలపి రూ.18 వేలు అందకుండా పోతున్నాయి. అవి వస్తే పంట సాగుకు చేసిన అప్పు తీర్చుకుంటా.  
 - వనం శ్రీశైలం, చొల్లేడు, మునుగోడు
 
 అకౌంట్ నంబర్ తప్పుగా నమోదు చేసుకున్నారు..
 వర్షాలు కురవక 3 ఎకరాల 10 గుంటల భూమిలో పత్తి పంట దిగుబడి రాలేదు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంట సాగుచేసిన. అయితే నష్టపోయిన నాకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు వీఆర్‌ఓ భూమి వివరాలు, బ్యాంకు ఆకౌంట్ నంబర్ రాసుకోని పోయాడు. నాకు రూ. 10 వేల పరిహారం మంజూరు అయినట్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో పెట్టారు. కానీ నేటికి ఆ డబ్బులు నా బ్యాంకు ఖాతాలో జమకాలేదు. అదేంటని స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లి అడిగితే అకౌంట్ నంబర్ తప్పుగా ఉందని చెప్పుతున్నారు. అధికారులు చేసిన తప్పుకు నాకు డబ్బులు రాకుండా పోయాయి. ఇప్పటికైనా తిరిగి నా అకౌంట్ నంబర్ సరిగా రాసుకొని  డబ్బులు ఇస్తే బాగుండు.
 - కట్టెకుంట్ల సైదులు, గుండ్లోరిగూడెం, మునుగోడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement