తెలంగాణపై మళ్లీ కమిటీలు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు కేంద్రాన్ని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా ఆలస్యం జరిగితే తెలంగాణ ప్రాంతంలో ప్రశాంతత కొరవడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటుపై భారతీయ జనతాపార్టీ అనుసరిస్తున్న వైఖరి పలు అనుమానాలకు తావిస్తుందని హరీష్ రావు సందేహాం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై హరీష్ రావు ఈ సందర్భంగా ఘాటుగా స్పందించారు. సొంత సోదరుడు బాలకృష్ణ తో కలిసి ఉండలేని హరికృష్ణ తెలుగు ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు.
తెలుగు ప్రజలకు బహిరంగలేఖ రాసే బదులు తెలుగుదేశం పార్టీ అధినేత, బావ చంద్రబాబుకు లేఖ రాస్తే మంచిదని హరీష్రావు ఈ సందర్భంగా హరికృష్ణకు సూచించారు. కన్న తండ్రి ఎన్టీఆర్పై సొంత బావ చంద్రబాబు కోసం చెప్పులు వేయించిన ఘనత హరికృష్ణ సొంతమని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి హరికృష్ణ ఇప్పడు తన తండ్రి ఆశయాలు అంటూ మాట్లాడుతున్నారని హరీష్రావు ఎద్దేవా చేశారు.