సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రామాయణ కాలంలో వానర సేనకు సుగ్రీవుడు రాజు. ఆయన మాటే వారికి వేదవాక్కు. ఆయన అనుజ్ఞ ఇస్తే చాలు దేనికైనా సిద్ధపడతారు. అనుజ్ఞ లేనిదే ఒక్క అడుగు కూడా కదపరు. అందుకే సుగ్రీవాజ్ఞ అనే నానుడి వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు మన జిల్లాలోనూ ఒక సుగ్రీవుడు ఉన్నారు. ఆయన పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. లక్షమందికిపైగా ఓటర్లకు ప్రతినిధి. నాడు సుగ్రీవాజ్ఞకు వానరులు బద్ధులైతే.. నేడు మన సుగ్రీవులు వేరొకరి ఆజ్ఞకు బద్ధులు కావడం విశేషం. ఆయనే కేంద్ర మంత్రి, సుగ్రీవులవారి రాజకీయ గురువు కిశోర్‌చంద్ర దేవ్. కిశోర్ ఆజ్ఞ లేనిదే సుగ్రీవులు ఏ పనీ చేయరు.. అసలేమీ మాట్లాడరు!ఏటీ.. నమ్మకం కలగడం లేదా!.. ప్రస్తుతం జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్నే చూడండి.. ఉద్యమకారుల ఒత్తిడికి తలొగ్గి మంత్రులు మినహా జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసినా సుగ్రీ వులు ఆ ఊసే ఎత్తడం లేదు.
ఉద్యమం వైపే కన్నెత్తి చూడటం లేదు. కారణం.. గురువాజ్ఞ లేకపోవడమే!..
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదన్నట్లు.. ఉద్యమం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే గురువుగారు ఎలా చెబితే అలా చేస్తానంటూ దాట వేస్తున్నారు. విలేకరులు అడిగే ప్రశ్నలకు ఆయన చెప్పే సమాధానం ఒక్కటే. ‘మీకు తెలుసు కదా..
మా గురువుగారు చెప్పినట్లు చేస్తున్నా.. అంతకు మించి ఏమీ చెప్పలేనంటూనే.. నా గురించి అంతకు మించి ఏమీ రాయొద్దు అని కూడా కోరుతున్నారు. సుగ్రీవులు రాజకీయాలకు కొత్త. అరకు లోక్‌సభ సభ్యుడు, కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఈయనకు రాజకీయ గురువు. ఆయన ప్రోత్సాహంతోనే 2009లో ఉద్యోగానికి రాజీనామా చేసి పాలకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఈ నియోజకవర్గం అరకు లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. దీంతో కిశోర్ చెప్పినట్లు చేయడం, ఏదైనా సమస్య ఉందని ప్రజలు వస్తే మంత్రి ద్వారా పనులు చేయించడమే ఆయనకు తెలుసు. రాష్ట్ర విభజన, సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కిశోర్‌చంద్రదేవ్ సుగ్రీవులుకు గురుబోధ చేసినట్లు తెలిసింది. ‘పదవికి రాజీనామా చేయొద్దు. చేస్తే.. ఇక అధికార పార్టీ నీ గురించి పట్టించుకోదు.
అప్పుడు నేను కూడా ఏమీ మాట్లాడలేను’.. అన్నదే గురుబోధ సారాంశం. ఇది సుగ్రీవులు మనసులో బాగా నాటుకుపోయింది. దాంతో రాజీనామా గురించి అసలు ఆలోచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందో రాదోనన్న అనుమానం కూడా ఉంది. అందుకే ఉన్న నాలుగు రోజులు అధికారాన్ని అంటిపెట్టుకొని ఉండాలన్న ఆలోచన ఆయనది. మంత్రి చాటు బిడ్డగా ఉన్న సుగ్రీవులును జనం కూడా పట్టించుకోవడం మానేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నియోజకవర్గమంతటా ఎవరికి వారు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు వీరికి నాయకత్వం వహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. రోజురోజుకూ ఉద్యమం ఉద్ధృతమవుతున్నా ఎమ్మెల్యే సుగ్రీవులు మాత్రం నిమ్మళంగా ఉంటున్నారు.
గురువాజ్ఞ లేదట!
Published Mon, Aug 12 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement