సాక్షి, మంచిర్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) ఆదరణ కోల్పోతోంది. జిల్లా వ్యాప్తంగా వందలాది గ్రామాలకు ‘పల్లె వెలుగు’లు చేరడం లేదు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండి, ఆశించిన విధంగా ఆదాయం రావడంలేదనే సాకుతో చాలా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు రద్దు చేసింది. ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు మొండికేస్తోంది. వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకుంటోంది. మరోపక్క.. నడుస్తున్న బస్సులూ సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతినడంతోనే పలు బస్సుల సమయపాలన లోపించిందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూర్ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లోని బస్సులు వందలాది గ్రామాలకు వెళ్లడం లేదు. దీంతో విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు.
రహదారులు తెచ్చిన సమస్యలు
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో చాలా గ్రామాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. ముట్టి, సీసీ, తారు రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రయాణికులు, స్థానిక ప్రజాప్రతినిధుల డిమాండ్ దృష్ట్యా రోడ్డు వసతి బాగాలేకున్నా ఈ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడిపిస్తోంది. ఈ రహదారులపై బస్సులు నెమ్మదిగా వెళ్లడంతో సమయం వృథా అవుతుంది. బస్సులు పాడవుతున్నాయి. బస్సులు తక్కువగా తిరగడం.. సమయపాలన లేకపోవడంతోప్రైవేట్ వాహనదారులు తక్కువ చార్జీలు తీసుకుని.. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. కేవలం మంచిర్యాల నుంచి బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ మండలాలకు రోజు 300 ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. 1000 మంది వచ్చి వెళ్తుంటారు. చెన్నూరు నుంచి కోటపల్లి, మంచిర్యాల, జైపూర్, వేమనపల్లి మండలాలకు 200 ఆటోల్లో సుమారు 500 మంది రాకపోకలు సాగిస్తున్నారు. మంచిర్యాల, చెన్నూరు వంటి మండల కేంద్రాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే మారుమూల మండలాలు, గ్రామాల్లో ఇంకెంత మంది ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ప్రయాణించడతో ఏదైన ప్రమాదం జరిగితే మృత్యువాత పడుతున్నారు. ఆటోలు, జీపులు, టాటా ఏసీలు జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేలపైనే ఉన్నాయి. ‘చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆర్టీసీ బస్సులను కాదని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఆశించిన ఆదాయం రాక బస్సులు నిలిపేస్తున్నాం’ అని ఆర్టీసీ రీజినల్ మేనెజర్ వెంకటేశ్వర్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేట్ రవాణాను నియంత్రించి.. సురక్షిత ఆర్టీసీ సేవలందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కోటపల్లి మండలం నుంచి పారుపల్లి గ్రామాల మధ్యలో సర్వాయిపేట, సింగారం, ఎడగడ్డ, ఎసన్‌వాయి పల్లెలున్నాయి. ఈ గ్రామాల మధ్య నిత్యం 300 మంది రాకపోకలు సాగిస్తుంటారు. మండల కేంద్రం నుంచి పారుపల్లి వరకు 12కి.మీ. బీటీ రోడ్డు ఉంది. కానీ ఈ రోడ్డుపై ఆర్టీసీ బస్సులు నడవవు. దీంతో ప్రయాణికులు జీపులు.. ఆటోలపైనే ఆధారపడతారు. అంతేకాదూ.. మండల పరిధిలోని జనగామ, ఆలుగామా, పుల్లగామా, సిర్సా, ఎదుల్లబందన్, రొయ్యలపల్లి, లింగన్నపేట, దుబ్బాక గ్రామాలకు బస్సులు నడిపిన ఆర్టీసీ 20 రోజుల క్రితమే ఆపేసింది. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ మార్గంలో బస్సు పాసులను రద్దు చేయడంతో విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లలేక ఇంటి వద్దే ఉంటున్నారు.
కౌటాల మండల పరిధిలోని గంగాపూర్, రణవెల్లి గ్రామాలకు రోడ్డు వసతి ఉన్నా ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. వీటితో పాటు 20 గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ సేవలు అందడం లేదు.
చెన్నూరు మండల పరిధిలోని కన్నెపల్లి, ఊత్కులపల్లి, బుద్దారం, సుద్దారం, గంగారాం, కాచన్‌పల్లి గ్రామాలకు గతంలో బస్సులు నడిపిన ఆర్టీసీ వాగులు పొంగుతున్నాయంటూ నిలిపేసింది. దీంతో ప్రయాణికులు ఆటోలు, జీపులనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం వాగులు పొంగడం లేదు.. రోడ్డు వసతీ ఉంది కాబట్టి బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రెబ్బెన మండలం గంగాపూర్, తుంగెడ గ్రామాలకు బీటీ రోడ్డు వసతి ఉంది. కానీ ఆర్టీసీ బస్సులు ఆ వైపు వెళ్లవు. మద్యాయిగూడ, తక్కలపల్లి, తోళ్లపాడు గ్రామాలకు రోడ్డు వసతి లేక బస్సులు న డవవు.
బస్సెరుగని పల్లెలు
Published Mon, Dec 30 2013 6:03 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement