palle velugu buss
-
పల్లెకురాని వెలుగు
కమాన్‌పూర్: గ్రామగ్రామానికి పల్లె వెలుగు... పత్రి గ్రామానికి ఆర్టీసీ సేవలు అందిస్తామని చెబుతున్న ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు సేవలను గ్రామ ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారు. కోట్ల రూపాయాలతో ప్రభుత్వం తారురోడ్లు వేసిన ఆ రూట్లలో ఆర్టీసీ బస్సులు నడవక పోవడంతో ప్రజలు, విద్యార్థులు, చిరువ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం ఆ గ్రామాల నుంచి విద్యార్థులు, చిరువ్యాపారులు, ప్రజలు పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, జిల్లా కేంద్రం పెద్దపల్లికి వివిధ పనుల నిమిత్తం వెళుతుంటారు. గతంలో ఆర్టీసీ బస్సు సౌకర్యాం ఉన్న కొద్ది నెలల నుంచి బస్సు సర్వీస్‌ను నిలిపివేయడంతో ప్రజలు, విద్యార్థులు అధిక చార్జీలతో ప్రయివేటు వాహనాల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. గోదవరిఖని టూ పెద్దపల్లి గోదావరిఖని డిపో నుంచి పెద్దపల్లి వరకు బస్సు సౌకర్యాం ఏర్పాటు చేశారు. గత నెల రోజుల నుంచి ఆ గ్రామాలకు పల్లెవెలుగు సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు, చిరువ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక చార్జీలతో ప్రవేటు వాహనాల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు వాపోతున్నారు.. గతంలో గోదావరిఖని నుంచి పెద్దపల్లి వరకు ప్రవేటు బస్సు సౌకర్యాం ఉండేది. రొంపికుంట మీదుగా పెద్దపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని పలు మార్లు డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. రూట్ సర్వే చేసిన ఆర్టీసీ ఆధికారులు గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎఫ్‌సీఐ, రొంపికుంట, పేరపల్లి గ్రామాల మీదుగా బస్సు నడిపించారు. నాగారం గ్రామంలో పోలీసులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో నాగారం లింగాల మీదుగా ఆర్టీసీ బస్సును నడిపించాలని కోరగా ప్రతి గోదావరిఖని నుంచి వచ్చే బస్సును ఎల్కలపల్లి, రేపల్లెవాడ నాగారం, లింగాల, రొంపికుంట, పేరపల్లి గ్రామాల మీదుగా ప్రతి ,రోజు ఉదయం, సాయంత్రం రోజుకు రెండు ట్రిప్పుల బస్సు సౌకర్యాం కల్పించారు. బస్సు సౌకర్యంతో విద్యార్థులు, చిరు వ్యాపారులకు సైతం ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. పలు కారణాలతో గత నెల రోజుల నుంచి ఆర్టీసీ బస్సును రద్దు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులకు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రవేటు వాహనాలే దిక్కు.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు సౌకర్యం రద్దు కావడంతో విద్యార్థులు, ప్రజలు గోదావరిఖని, పెద్దపల్లి పట్టణాలకు వెళ్లాలంటే వారికి ప్రవేటు వాహనాల్లోను ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రత లేని ప్రవేటు వాహనాల్లో అధిక చార్జీలతో ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన చెందున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పునర్థిరించాలని విద్యార్థులు, ప్రజలు కోరతున్నారు.గోదావరిఖని నుంచి పెద్దపల్లి వరకు నడిచే బస్సు నెల రోజుల నుంచి బందు కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్సు రాకపోవడంతో ప్రజలు కాలినడకన ప్రధాన రహదారి వరకు నడిచి వెళ్లీ అక్కడి నుంచి ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. -
పల్లె వెలుగులేవీ?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెగబడితే తెలంగాణ వచ్చింది.. నిలబడి ఓటు గుద్దితే కోరుకున్న కేసీఆర్ సర్కారు వచ్చింది.. కానీ ఏళ్లకేళ్లు ఎదురు చూసినా ఎర్ర బస్సు(పల్లె వెలుగు) మాత్రం పల్లె పొలిమేర తొక్కడం లేదు. స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు గడిచినా... తెలంగాణ సిద్ధించి 6...7 నెలలు గడిచినా మెతుకుసీమలో ఇంకా ఎర్రబస్సును చూడని 500 పల్లెలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సు వెళ్లని ఊర్లు అనేకం. ‘ప్రతి డిపోకు కనీసం 20 కొత్త బస్సులు ఇస్తాం.. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతి బస్సు నడిపిస్తాం’ అని సాక్షాత్తు రవాణ శాఖ మంత్రి పట్లోళ్ల మహేందర్‌రెడ్డి ప్రకటించి ఆరు నెలలు దాటినా బస్సు రాలే.. బాధ తీరలే.. మెదక్‌లో ఆర్టీసీ సేవలు అధ్వానంగా మారాయి. జిల్లాలో మొత్తం 1,066 పంచాయతీలతో పాటు మరో 900 తండాలు, మదిర గ్రామాలు ఉన్నాయి. వీటిలో సుమారు 170 గ్రామాలు, 400 తండాలు, మదిర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ పల్లెలకు తారు, మట్టి రోడ్లు ఉన్నప్పటికీ బస్సులు తిప్పేందుకు మాత్రం అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో ఆయా గ్రామాల్లో ఆటోలు, జీపులు నడుస్తున్నాయి.. అనుభవం లేని యువకులు ఉపాధి, తక్షణ ఆర్థిక వెసులుబాటు కోసం వీటిని నడుపుతున్నారు. కిక్కిరిసిన మేర ప్రయాణికులను తరలిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 100 పల్లెల ‘ఆందోల్’న... అందోలు నియోజకవర్గంలోని అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, టేక్మాల్, రాయికోడ్ మండలాల్లో దాదాపు 100 గ్రామాలకు బస్ సౌకర్యం లేదు. అందోలు మండలంలో పోసానిపేట, మాసానిపల్లి, దానంపల్లి, రోడ్లపాడ్, ఎర్రారం, సాయిబాన్‌పేట, అల్మాయిపేటలకు ఆర్టీసీ సేవలు అందడం లేదు. రేగోడ్ మండలంలోని 11 గ్రామాలదీ ఇదే దుస్థితి. టేక్మాల్ మండలంలోని పల్వంచ, ఎలకుర్తి, కోరంపల్లి గ్రామాలకు అల్లాదుర్గం మండలంలోని అప్పాజిపల్లి, తండా, ముప్పారం, బహిరన్‌దిబ్బ, పోతులబొగుడ, మందాపూర్, సీతానగర్, తండాలకు బస్సు సౌకర్యం లేదు. రాయికోడ్ మండలంలో అల్లాపూర్, మాదాపూర్ గ్రామాల ప్రజలు ఇప్పటికీ బస్సు ముఖమే చూడలేదు. 34 గ్రామాల్లో 20 పల్లెలు ఆర్టీసీ రవాణాకు నోచుకోవడం లేదు. మునిపల్లి మండలంలోని 15 ఊర్లకు బస్సు సౌకర్యం లేదు. గొర్రెకట్టు, బొడ్చట్‌పల్లి, మేళసంఘం, లింగంపల్లి, ఐలాపూర్వాసులది కూడా ఇదే పరిస్థితి. ‘దుబ్బ’లోనే నడక... దుబ్బాక నియోజకవర్గంలో 23 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. దుబ్బాక మండలంలోని పర్శరాంనగర్, రామేశ్వరంపల్లి, చిన్ననిజాంపేటకు నేటికి బస్సు సౌకర్యం లేదు. మిరుదొడ్డి మండలం కొండాపూర్, తొగుట మండలంలోని లింగాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి, కాన్గల్, గుడికందుల, చేగుంట మండలంలోని భీంరావుపల్లి, చిట్టోజిపల్లి, నర్సంపల్లి, రాంపూర్, గొల్లపల్లి, కాసాన్‌పల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దౌల్తాబాద్ మండలంలోని చెట్లనర్సంపల్లి, లింగాయపల్లితండా, ముత్యంపేట, వీరానగర్, వీరారెడ్డిపల్లి, శేరిల్లా, చిన్నమాసంపల్లి, చిన్నారెపల్లి, లింగారెడ్డిపల్లికి కూడా ఆర్టీసీ సేవలు అందడం లేదు. సిద్దిపేటలోనూ ఇదే సంకటం... సిద్దిపేట మండలంలోని రాంపల్లి, రాంపూర్, ఇంద్రగూడెం, బట్రాంపల్లి, మర్రికుంట, నంగునూరు మండలంలోని జెర్రిపోతులతండ, లక్ష్మణ్‌నాయక్‌తండా, దర్గపల్లి, అప్పలాయిచెరువు, సంతోష్‌నగర్, చిన్నకోడూరు మండలం మల్యాల, మందపల్లికి బస్సు సేవలు నిల్. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ‘నడిసే’పూర్... నర్సాపూర్ మండలంలో 34 గ్రామాలతో పాటు సుమారు 55తండాలు ఉండగా 40 గిరిజనతండాలతో పాటు అహ్మద్‌నగర్, పెద్దచింతకుంట, రాంచంద్రాపూర్ తదితర పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. వెల్దుర్తి మండలంలో 35 గ్రామాలుండగా 13 పల్లెలకే బస్సులు వస్తాయి. హత్నూర మండలంలో 33 గ్రామాలతో పాటు 12 గిరిజన తండాలు ఉండగా సికింద్లాపూర్, లింగాపూర్, చీక్మద్దూర్తో పాటు సుమారు 13 పల్లెలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. కొల్చారం మండలంలో వరిగుంతం, కోనాపూర్ తదితర గ్రామాలతో పాటు 12 తండాలకు, శివ్వంపేట మండలంలో 8 గ్రామాలు, 30తండాలకు ఎర్ర బస్సులు రావడం లేదు. కౌడిపల్లి మండలంలో 40 గ్రామాలు, 52 తండాలు ఉండగా వెల్మకన్నె, కూకుట్లపల్లి, భుజరంపేటతో పాటు 16 గ్రామాలకు, సుమారు 40 గిరిజన తండాలకు ఆర్టీసీ అధికారులు ఇంతవరకూ బస్సు సౌకర్యం కల్పించలేకపోయారు. గజ్వేల్‌లోనూ.. గదే గతి... వర్గల్ మండలంలో గోవిందాపూర్, గుంటిపల్లి, రాంసాగర్‌పల్లి, రెడ్యానాయక్‌తండా, గుండ్యా నాయక్‌తండా, లింబ్యానాయక్తండా, ఇప్పలగూడ గ్రామాలకు ఆర్టీసీ బస్సు వచ్చిన దాఖలాలు లేవు. గోవిందాపూర్ నుంచి ప్రతినిత్యం నెంటూరు పాఠశాలకు వచ్చేందుకు అక్కడి విద్యార్థులకు కాలినడకే శరణ్యం. జగదేవ్‌పూర్ మండలంలో మొత్తం 23 గ్రామ పంచాచతీలు 9 మదిర గ్రామాలు ఉన్నాయి. అయితే గత రెండు మూడు నెలలకు ముందు గోపాల్పూర్, జంగంరెడ్డిపల్లి, బస్వాపూర్, బిజివెంకటాపూర్, కొత్తపేట గ్రామాలకు అసలు ఆర్టీసీ బస్సులే వచ్చేవికావు. కళాశాలకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు ధర్నా, రాస్తారోకోలు చేశారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్వాపూర్, జంగంరెడ్డిపల్లి, గోపాల్పూర్ గ్రామాలకు బస్సులను ప్రారంభించారు. శివారువెంకటాపూర్ గ్రామానికి బడి ఉంటేనే బస్సు లేదంటే తుస్సు. గొల్లపల్లి గ్రామానికి ఇంత వరకు ఎర్రబస్సు పోయిన దాఖలాలు లేవు. మందాపూర్, కొండాపూర్, గోపాలపూర్, జంగంరెడ్డిపల్లి, శివారువెంకటాపూర్ తదితర గ్రామాలకు ఉదయం, సాయంత్రం మాత్రమే బస్సు లేదంటే ఆటోలే దిక్కు. ములుగు మండలంలోని అన్నసాగర్, వాగునూతి, కమలాబాద్, గంగధార్పల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రాక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వీరు బస్సు ప్రయాణం చేయాలనుకుంటే నాలుగు కిలోమీటర్ల దూరాన గల వంటిమామిడి రాజీవ్ రహదారికి కాలినడకన, లేదా ప్రై వేట్ వాహనాల ద్వారా చేరుకోక తప్పదు. మెత్తుకున్నా.. బస్సురాదు... మెదక్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. 35 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. మెదక్ మండలం కప్రాయిపల్లికి బస్సు సౌకర్యం లేక యేడాది క్రితం మమత అనే మహిళకు పాముకాటు వేయగా చికిత్స నిమిత్తం ఎడ్లబండిపై మెదక్‌కు తీసుకు వస్తుండగా సమయానికి వైద్యం అందక మార్గం మధ్యలోనే కన్నుమూసింది. గంగాపూర్‌లో కరెంట్‌షాక్‌కు గురైన వారికి కూడా బస్సు సౌకర్యం లేక చికిత్స సమయానికి అందించలేక పోయారు. చిన్నశంకరంపేట మండలంలోని దర్పల్లి, ఖాజాపూర్, జంగరాయి, శేరిపల్లి, మిర్జాపల్లి తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. పాపన్నపేట మండలం రాంతీర్థం, ముద్దాపూర్, మల్లంపేట, కందిపల్లి, బాచారం, ఎంకెపల్లి , రామాయంపేట మండలంలో 9 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. మండలంలోని ఖాసీంపూర్, రజాక్‌పల్లి, చౌకత్పల్లి, శివ్వాయిపల్లి, సుతార్‌పల్లి, దామర చెర్వు, గొల్పర్తి, కోమట్‌పల్లి, నగరం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఖేడ్ తండాలను తట్టని బస్సు... నారాయణఖేడ్ మండలంలోని పలుగుతండా, మన్యానాయక్ తండా, నాన్యానాయక్ తండా, పీర్లతండా, కిందితండా, మల్పరేగడితండా, కొత్తపల్లి, శేఖాపూర్ తదితర గ్రామాలకు బస్సు సౌకర్యంలేదు. మనూరు మండలంలోని 33 పంచాయతీలు ఉండగా 90కిపైగా తండాలు ఉన్నాయి. ఇందులో 70వరకు తండాలకు బస్సు సౌకర్యం లేదు. మండలంలోని ఇరక్‌పల్లి, గౌడ్‌గాంజన్‌వాడ, ఔదత్పూర్, ఏస్గి, శిఖార్కానా, ఉట్పల్లి, ఎనక్‌పల్లి, మావినెళ్ళి, రాణాపూర్ తండా, ముగ్దుంపూర్, గట్‌లింగంపల్లి, ధన్వార్, కమలాపూర్, దోసపల్లి, బాదల్గావ్, షాపూర్, మాయికోడ్, డోవూర్లకు ఆర్టీసీ బస్సులు వెళ్లవు.కల్హేర్ మండలంలోని రాంరెడ్డి పేట, ఖానపూర్ బి, దామర్‌చెరువు, రాపర్తి, మీర్‌ఖన్‌పేట్, పోచాపూర్, అంతర్గాం గ్రామాలకు బస్సుసౌకర్యం లేదు. పటాన్చెరులోనూ బస్సులు నడవని పల్లెలు... గ్రేటర్ హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో కూడా ఆర్టీసీ వెళ్లని పల్లెలు ఉన్నాయి. జిన్నారం మండలంలో నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్, సురారం. పటాన్చెరులో మండలంలో ఐలాపూర్ తండా, రామచంద్రాపురం మండలంలోని వెలిమెల తండా, కొల్లూర్ తండాలకు బస్సులు వెళ్లవు. -
బస్సెరుగని పల్లెలు
సాక్షి, మంచిర్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) ఆదరణ కోల్పోతోంది. జిల్లా వ్యాప్తంగా వందలాది గ్రామాలకు ‘పల్లె వెలుగు’లు చేరడం లేదు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండి, ఆశించిన విధంగా ఆదాయం రావడంలేదనే సాకుతో చాలా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు రద్దు చేసింది. ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు మొండికేస్తోంది. వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకుంటోంది. మరోపక్క.. నడుస్తున్న బస్సులూ సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతినడంతోనే పలు బస్సుల సమయపాలన లోపించిందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూర్ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లోని బస్సులు వందలాది గ్రామాలకు వెళ్లడం లేదు. దీంతో విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. రహదారులు తెచ్చిన సమస్యలు ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో చాలా గ్రామాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. ముట్టి, సీసీ, తారు రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రయాణికులు, స్థానిక ప్రజాప్రతినిధుల డిమాండ్ దృష్ట్యా రోడ్డు వసతి బాగాలేకున్నా ఈ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడిపిస్తోంది. ఈ రహదారులపై బస్సులు నెమ్మదిగా వెళ్లడంతో సమయం వృథా అవుతుంది. బస్సులు పాడవుతున్నాయి. బస్సులు తక్కువగా తిరగడం.. సమయపాలన లేకపోవడంతోప్రైవేట్ వాహనదారులు తక్కువ చార్జీలు తీసుకుని.. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. కేవలం మంచిర్యాల నుంచి బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ మండలాలకు రోజు 300 ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. 1000 మంది వచ్చి వెళ్తుంటారు. చెన్నూరు నుంచి కోటపల్లి, మంచిర్యాల, జైపూర్, వేమనపల్లి మండలాలకు 200 ఆటోల్లో సుమారు 500 మంది రాకపోకలు సాగిస్తున్నారు. మంచిర్యాల, చెన్నూరు వంటి మండల కేంద్రాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే మారుమూల మండలాలు, గ్రామాల్లో ఇంకెంత మంది ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ప్రయాణించడతో ఏదైన ప్రమాదం జరిగితే మృత్యువాత పడుతున్నారు. ఆటోలు, జీపులు, టాటా ఏసీలు జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేలపైనే ఉన్నాయి. ‘చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆర్టీసీ బస్సులను కాదని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఆశించిన ఆదాయం రాక బస్సులు నిలిపేస్తున్నాం’ అని ఆర్టీసీ రీజినల్ మేనెజర్ వెంకటేశ్వర్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేట్ రవాణాను నియంత్రించి.. సురక్షిత ఆర్టీసీ సేవలందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కోటపల్లి మండలం నుంచి పారుపల్లి గ్రామాల మధ్యలో సర్వాయిపేట, సింగారం, ఎడగడ్డ, ఎసన్వాయి పల్లెలున్నాయి. ఈ గ్రామాల మధ్య నిత్యం 300 మంది రాకపోకలు సాగిస్తుంటారు. మండల కేంద్రం నుంచి పారుపల్లి వరకు 12కి.మీ. బీటీ రోడ్డు ఉంది. కానీ ఈ రోడ్డుపై ఆర్టీసీ బస్సులు నడవవు. దీంతో ప్రయాణికులు జీపులు.. ఆటోలపైనే ఆధారపడతారు. అంతేకాదూ.. మండల పరిధిలోని జనగామ, ఆలుగామా, పుల్లగామా, సిర్సా, ఎదుల్లబందన్, రొయ్యలపల్లి, లింగన్నపేట, దుబ్బాక గ్రామాలకు బస్సులు నడిపిన ఆర్టీసీ 20 రోజుల క్రితమే ఆపేసింది. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ మార్గంలో బస్సు పాసులను రద్దు చేయడంతో విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లలేక ఇంటి వద్దే ఉంటున్నారు. కౌటాల మండల పరిధిలోని గంగాపూర్, రణవెల్లి గ్రామాలకు రోడ్డు వసతి ఉన్నా ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. వీటితో పాటు 20 గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ సేవలు అందడం లేదు. చెన్నూరు మండల పరిధిలోని కన్నెపల్లి, ఊత్కులపల్లి, బుద్దారం, సుద్దారం, గంగారాం, కాచన్‌పల్లి గ్రామాలకు గతంలో బస్సులు నడిపిన ఆర్టీసీ వాగులు పొంగుతున్నాయంటూ నిలిపేసింది. దీంతో ప్రయాణికులు ఆటోలు, జీపులనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం వాగులు పొంగడం లేదు.. రోడ్డు వసతీ ఉంది కాబట్టి బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. రెబ్బెన మండలం గంగాపూర్, తుంగెడ గ్రామాలకు బీటీ రోడ్డు వసతి ఉంది. కానీ ఆర్టీసీ బస్సులు ఆ వైపు వెళ్లవు. మద్యాయిగూడ, తక్కలపల్లి, తోళ్లపాడు గ్రామాలకు రోడ్డు వసతి లేక బస్సులు న డవవు. -
పల్లెవెలుగు లేవి ?
సాక్షి, కొత్తగూడెం : ‘జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సు పట్నాన్ని చూపించింది..’ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ప్రయాణికులు లేరన్న సాకుతో ఈ సర్వీసులను ఆర్టీసీ గత కొన్నేళ్లుగా రద్దు చేస్తూ వస్తోంది. ఆటోల సంఖ్య పెరగడం, ప్రయాణికులకు ఆర్టీసీ తూతూ మంత్రంగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు జిల్లాలోని పలు గ్రామాలకు పల్లెవెలుగు సర్వీసులు నిలిచిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో 274 పల్లెవెలుగు బస్సులున్నాయి. ఇందులో ఖమ్మం డిపో పరిధిలో 85, కొత్తగూడెంలో 41, భద్రాచలంలో 49, మధిరలో 41, మణుగూరులో 14, సత్తుపల్లి డిపోలో 44 బస్సులు ఉన్నాయి. ఈ సర్వీసుల ద్వారా సంస్థకు నెలకు రూ.30 లక్షల ఆదాయం వస్తోంది. పల్లెవెలుగుకు మూరుమూల గ్రామాల్లో ఆదరణ ఉన్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య, వచ్చే ఆదాయాన్ని పోల్చుకుంటున్న అధికారులు.. నష్టం వస్తోందనే సాకుతో ఈ సర్వీసులను రద్దు చేస్తున్నారు. దీంతో మారుమూల ప్రాంతాలకు సైతం ఆటోలు వెళ్తున్నాయి. ఆటోలలో ప్రయాణం ప్రమాదమని తెలిసినా, తప్పని పరిస్థితుల్లో ఎక్కాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గుండాల, పినపాక, వేలేరుపాడు, చింతూరు, దుమ్ముగూడెం, వాజేడు, చర్ల, జూలూరుపాడు, ఏన్కూరు, వెంకటాపురం మండలాల్లోని పలు గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సంటనే తెలియకపోవడం గమనార్హం. ‘ఆటోల్లో ప్రయాణించవద్దు.. ప్రమాదాలు జరుగుతాయి, ఆర్టీసీ ప్రయాణం సురక్షితం’.. అని అధికారులు చేస్తున్న ప్రచారం పల్లెలకు పాకడం లేదు. దీంతో పల్లె ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో వారికి ఆటోలే శరణ్యమవుతున్నాయి. ఆటోల ప్రయాణంతో.. జిల్లాలో నెలకు సగటున ఇరవై వరకు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలో రోడ్లు బాగానే ఉన్నప్పటికీ పల్లెవెలుగు సర్వీసులు మాత్రం నడవడం లేదు. ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామం అశ్వారావుపేట మండలం సున్నంబట్టి గ్రామానికే బస్ సౌకర్యం లేదు. ఆదాయం లేదనే కారణంతో అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ మండల్లాలోని సున్నంబట్టి, తిరుమలకుంట, కొత్తమామిళ్లవారిగూడెం, రెడ్డిగూడెం, దురదపాడు, గాడ్రాల, మల్కారం, పెద్దగొల్లగూడెం, జగ్గారం, బాలరాజుగూడెం, చెన్నువారిగూడెం, తుంగారం, వెంకటాపురం, సత్యనారాయణపురం గ్రామాల్లో పల్లెవెలుగుకు బ్రేక్ పడింది. భద్రాచలం డివిజన్లోని వెంకటాపురం, వాజేడు, చింతూరు, కూనవరంతో పాటు భద్రాచలం మండల పరిధిలోని చాలా గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు లేవు. రేఖపల్లి-చింతూరు, కూనవరం-చింతూరు, భద్రాచలం మండలం కుసుమపల్లి ,చర్ల మండలం పెదమిడిసిలేరు, జీకొత్తపల్లి, పులిబోయినపల్లి, వెంకటాపురం-వాజేడుల మీదుగా ఏడుచర్లపల్లి గ్రామాలకు పల్లెవెలుగులు లేవు. తమ గ్రామాలకు బస్సు నడపాలని ఆ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కూసుమంచి మండలం చేగొమ్మ, ముత్యాలగూడెం, నేలపట్ల, కోక్యాతండా, లోక్యాతండా, రాజుపేట, ఈశ్వరమాధారం గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సు అంటే ఏమిటో తెలియదు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు, తీర్దాల, మంగళగూడెం, వెంకటగిరి, గుదిమళ్ల, చింతపల్లి, కామంచిక ల్, దారేడు గ్రామాలకు ఇంత వరకు పల్లె వెలుగు బస్సులు వెళ్లకపోవడం గమనార్హం. నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో కూడా 60 గ్రామ పంచాయతీలు ఉండగా సగానికిపైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. మధిర మండలం వెంకటాపురం, సాయిపురం, నక్కలగరుబు, బోనకల్ మండలం ఆళ్లపాడు, గోవిందాపురం(ఎ), రాపల్లి, రామాపురం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. చింతకాని మండలంలోని మత్కేపల్లి గ్రామానికి గతంలో ఆర్టీసీ బస్సు నడిచేది. ఈ సర్వీసును రద్దు చేసి ఆరేళ్లు అయింది. ఇల్లెందు మండలంలోని చల్లసముద్రం, దనియాలపాడు, మాణిక్యారం, కొమరారం ఎల్లన్ననగర్లకు గతంలో నడిచిన బస్సు సర్వీసులను రద్దు చేశారు. టేకులపల్లి మండలం బోడు నుంచి ఇల్లెందు మండలం మర్రిగూడెం కలుపుతూ పక్కా రోడ్డు నిర్మించారు. అయినా ఇక్కడ పల్లెవెలుగు నడవడం లేదు. కారేపల్లి మండలంలో గేట్ కారేపల్లి, మేకలతండా మీదుగా డోర్నకల్‌కు గతంలో బస్సులు తిరిగేవి. ఇటీవల కాలంలో ఈ బస్సులను రద్దు చేశారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొణిజర్ల మండలంలో సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. ప్రధానంగా పల్లిపాడు నుంచి అంజనాపురం వరకు 15 గ్రామాల ప్రజలు బస్సులు లేక ఆటోలతో ఇబ్బంది పడుతున్నారు. జూలూరుపాడు మండలంలో ఒక్క గిరిజన గ్రామం కూడా ఇంత వరకు పల్లెవెలుగు బస్సు ఎరగదు. సత్తుపల్లి మండలం రేగళ్లపాడు, కల్లూరు మండలం కప్పలబంధం, బత్తులపల్లి, లోకారం, పుల్లయ్యబంజర, చండ్రుపట్ల, రఘునాథబంజర గ్రామాలకు గతంలో ఉన్న పల్లెవెలుగు సర్వీసులను సరిపడా ఆదాయం లేదన్న కారణంతో రద్దు చేశారు. తల్లాడ మండలం గూడూరు, బిల్లుపాడు, రామచంద్రాపురం, కేశవాపురం, బస్వాపురం, వెంకటాపురం, పినపాక గ్రామాలకు, పెనుబల్లి మండలం భవన్నపాలెం, లింగగూడెం, గంగదేవిపాడు, తాళ్లపెంట, బ్రహ్మాళ్లకుంట గ్రామాలకు గతంలో ఉన్న సర్వీసులు రద్దయ్యాయి. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 50 ప్రధాన గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆగ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించలేదు. బూర్గంపాడు మండలంలోని టేకులచెరువు, కృష్ణసాగర్, ఉప్పుసాక, గన్నేగుట్ట, ఒడ్డుగూడెం, నడిగూడెం, బూర్గువాయి, ఇబ్రహీమ్ పట్నం, గణపవరం, దుంపెనపల్లి, చెరువుసింగారం వంటి గ్రామాలకు బస్సు వెళ్లని దుస్థితి నెలకొంది. అశ్వాపురం మండలంలో ఐదు గ్రామాలు, పినపాక, గుండాల మండలాల్లోని కొన్ని పంచాయతీలకు ఇప్పటివరకు బస్సు సౌకర్యమే లేదు. రఘునాథపాలెం మండలంలో చింతగుర్తి, గణేశ్వరం, రాంక్యాతండా, మల్లేపల్లి గ్రామాలకు గతంలో పల్లెవెలుగు సర్వీసు ఉండేది. ఆదాయం రావడం లేదని ఈ సర్వీసులను రద్దు చేశారు. కొత్తగూడెం మండలంలోని సర్వారం, నర్సింహాసాగర్, సింగభూపాలెం, గరీబ్‌పేట గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు నడిచేవి. ఈ సర్వీసులను రద్దు చేసి ఏడేళ్లయింది. కారుకొండ, సీతరాంపురం, కె.పెనుబల్లి గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు.