సాక్షి, కొత్తగూడెం : ‘జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సు పట్నాన్ని చూపించింది..’ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ప్రయాణికులు లేరన్న సాకుతో ఈ సర్వీసులను ఆర్టీసీ గత కొన్నేళ్లుగా రద్దు చేస్తూ వస్తోంది. ఆటోల సంఖ్య పెరగడం, ప్రయాణికులకు ఆర్టీసీ తూతూ మంత్రంగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు జిల్లాలోని పలు గ్రామాలకు పల్లెవెలుగు సర్వీసులు నిలిచిపోతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో 274 పల్లెవెలుగు బస్సులున్నాయి. ఇందులో ఖమ్మం డిపో పరిధిలో 85, కొత్తగూడెంలో 41, భద్రాచలంలో 49, మధిరలో 41, మణుగూరులో 14, సత్తుపల్లి డిపోలో 44 బస్సులు ఉన్నాయి. ఈ సర్వీసుల ద్వారా సంస్థకు నెలకు రూ.30 లక్షల ఆదాయం వస్తోంది. పల్లెవెలుగుకు మూరుమూల గ్రామాల్లో ఆదరణ ఉన్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య, వచ్చే ఆదాయాన్ని పోల్చుకుంటున్న అధికారులు.. నష్టం వస్తోందనే సాకుతో ఈ సర్వీసులను రద్దు చేస్తున్నారు. దీంతో మారుమూల ప్రాంతాలకు సైతం ఆటోలు వెళ్తున్నాయి. ఆటోలలో ప్రయాణం ప్రమాదమని తెలిసినా, తప్పని పరిస్థితుల్లో ఎక్కాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గుండాల, పినపాక, వేలేరుపాడు, చింతూరు, దుమ్ముగూడెం, వాజేడు, చర్ల, జూలూరుపాడు, ఏన్కూరు, వెంకటాపురం మండలాల్లోని పలు గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సంటనే తెలియకపోవడం గమనార్హం. ‘ఆటోల్లో ప్రయాణించవద్దు.. ప్రమాదాలు జరుగుతాయి, ఆర్టీసీ ప్రయాణం సురక్షితం’.. అని అధికారులు చేస్తున్న ప్రచారం పల్లెలకు పాకడం లేదు. దీంతో పల్లె ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో వారికి ఆటోలే శరణ్యమవుతున్నాయి. ఆటోల ప్రయాణంతో.. జిల్లాలో నెలకు సగటున ఇరవై వరకు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
అశ్వారావుపేట నియోజకవర్గంలో రోడ్లు బాగానే ఉన్నప్పటికీ పల్లెవెలుగు సర్వీసులు మాత్రం నడవడం లేదు. ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామం అశ్వారావుపేట మండలం సున్నంబట్టి గ్రామానికే బస్ సౌకర్యం లేదు. ఆదాయం లేదనే కారణంతో అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ మండల్లాలోని సున్నంబట్టి, తిరుమలకుంట, కొత్తమామిళ్లవారిగూడెం, రెడ్డిగూడెం, దురదపాడు, గాడ్రాల, మల్కారం, పెద్దగొల్లగూడెం, జగ్గారం, బాలరాజుగూడెం, చెన్నువారిగూడెం, తుంగారం, వెంకటాపురం, సత్యనారాయణపురం గ్రామాల్లో పల్లెవెలుగుకు బ్రేక్ పడింది.
భద్రాచలం డివిజన్‌లోని వెంకటాపురం, వాజేడు, చింతూరు, కూనవరంతో పాటు భద్రాచలం మండల పరిధిలోని చాలా గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు లేవు. రేఖపల్లి-చింతూరు, కూనవరం-చింతూరు, భద్రాచలం మండలం కుసుమపల్లి ,చర్ల మండలం పెదమిడిసిలేరు, జీకొత్తపల్లి, పులిబోయినపల్లి, వెంకటాపురం-వాజేడుల మీదుగా ఏడుచర్లపల్లి గ్రామాలకు పల్లెవెలుగులు లేవు. తమ గ్రామాలకు బస్సు నడపాలని ఆ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
కూసుమంచి మండలం చేగొమ్మ, ముత్యాలగూడెం, నేలపట్ల, కోక్యాతండా, లోక్యాతండా, రాజుపేట, ఈశ్వరమాధారం గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సు అంటే ఏమిటో తెలియదు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు, తీర్దాల, మంగళగూడెం, వెంకటగిరి, గుదిమళ్ల, చింతపల్లి, కామంచిక ల్, దారేడు గ్రామాలకు ఇంత వరకు పల్లె వెలుగు బస్సులు వెళ్లకపోవడం గమనార్హం. నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో కూడా 60 గ్రామ పంచాయతీలు ఉండగా సగానికిపైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
మధిర మండలం వెంకటాపురం, సాయిపురం, నక్కలగరుబు, బోనకల్ మండలం ఆళ్లపాడు, గోవిందాపురం(ఎ), రాపల్లి, రామాపురం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. చింతకాని మండలంలోని మత్కేపల్లి గ్రామానికి గతంలో ఆర్టీసీ బస్సు నడిచేది. ఈ సర్వీసును రద్దు చేసి ఆరేళ్లు అయింది.
ఇల్లెందు మండలంలోని చల్లసముద్రం, దనియాలపాడు, మాణిక్యారం, కొమరారం ఎల్లన్ననగర్‌లకు గతంలో నడిచిన బస్సు సర్వీసులను రద్దు చేశారు. టేకులపల్లి మండలం బోడు నుంచి ఇల్లెందు మండలం మర్రిగూడెం కలుపుతూ పక్కా రోడ్డు నిర్మించారు. అయినా ఇక్కడ పల్లెవెలుగు నడవడం లేదు. కారేపల్లి మండలంలో గేట్ కారేపల్లి, మేకలతండా మీదుగా డోర్నకల్‌కు గతంలో బస్సులు తిరిగేవి. ఇటీవల కాలంలో ఈ బస్సులను రద్దు చేశారు.
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొణిజర్ల మండలంలో సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. ప్రధానంగా పల్లిపాడు నుంచి అంజనాపురం వరకు 15 గ్రామాల ప్రజలు బస్సులు లేక ఆటోలతో ఇబ్బంది పడుతున్నారు. జూలూరుపాడు మండలంలో ఒక్క గిరిజన గ్రామం కూడా ఇంత వరకు పల్లెవెలుగు బస్సు ఎరగదు.
సత్తుపల్లి మండలం రేగళ్లపాడు, కల్లూరు మండలం కప్పలబంధం, బత్తులపల్లి, లోకారం, పుల్లయ్యబంజర, చండ్రుపట్ల, రఘునాథబంజర గ్రామాలకు గతంలో ఉన్న పల్లెవెలుగు సర్వీసులను సరిపడా ఆదాయం లేదన్న కారణంతో రద్దు చేశారు. తల్లాడ మండలం గూడూరు, బిల్లుపాడు, రామచంద్రాపురం, కేశవాపురం, బస్వాపురం, వెంకటాపురం, పినపాక గ్రామాలకు, పెనుబల్లి మండలం భవన్నపాలెం, లింగగూడెం, గంగదేవిపాడు, తాళ్లపెంట, బ్రహ్మాళ్లకుంట గ్రామాలకు గతంలో ఉన్న సర్వీసులు రద్దయ్యాయి.
పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 50 ప్రధాన గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆగ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించలేదు. బూర్గంపాడు మండలంలోని టేకులచెరువు, కృష్ణసాగర్, ఉప్పుసాక, గన్నేగుట్ట, ఒడ్డుగూడెం, నడిగూడెం, బూర్గువాయి, ఇబ్రహీమ్ పట్నం, గణపవరం, దుంపెనపల్లి, చెరువుసింగారం వంటి గ్రామాలకు బస్సు వెళ్లని దుస్థితి నెలకొంది. అశ్వాపురం మండలంలో ఐదు గ్రామాలు, పినపాక, గుండాల మండలాల్లోని కొన్ని పంచాయతీలకు ఇప్పటివరకు బస్సు సౌకర్యమే లేదు.
రఘునాథపాలెం మండలంలో చింతగుర్తి, గణేశ్వరం, రాంక్యాతండా, మల్లేపల్లి గ్రామాలకు గతంలో పల్లెవెలుగు సర్వీసు ఉండేది. ఆదాయం రావడం లేదని ఈ సర్వీసులను రద్దు చేశారు.
కొత్తగూడెం మండలంలోని సర్వారం, నర్సింహాసాగర్, సింగభూపాలెం, గరీబ్‌పేట గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు నడిచేవి. ఈ సర్వీసులను రద్దు చేసి ఏడేళ్లయింది. కారుకొండ, సీతరాంపురం, కె.పెనుబల్లి గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు.
పల్లెవెలుగు లేవి ?
Published Tue, Dec 24 2013 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement