పల్లె వెలుగులేవీ? | peoples are concern on palle velugu buss | Sakshi
Sakshi News home page

పల్లె వెలుగులేవీ?

Published Tue, Dec 30 2014 10:51 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

పల్లె వెలుగులేవీ? - Sakshi

పల్లె వెలుగులేవీ?

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెగబడితే తెలంగాణ వచ్చింది.. నిలబడి ఓటు గుద్దితే కోరుకున్న కేసీఆర్ సర్కారు వచ్చింది.. కానీ ఏళ్లకేళ్లు ఎదురు చూసినా ఎర్ర బస్సు(పల్లె వెలుగు) మాత్రం పల్లె పొలిమేర తొక్కడం లేదు. స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు గడిచినా... తెలంగాణ సిద్ధించి 6...7 నెలలు గడిచినా మెతుకుసీమలో ఇంకా ఎర్రబస్సును చూడని 500 పల్లెలు ఉన్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సు వెళ్లని ఊర్లు అనేకం. ‘ప్రతి డిపోకు కనీసం 20 కొత్త బస్సులు ఇస్తాం.. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతి బస్సు నడిపిస్తాం’ అని సాక్షాత్తు రవాణ శాఖ మంత్రి పట్లోళ్ల మహేందర్‌రెడ్డి ప్రకటించి ఆరు నెలలు దాటినా బస్సు రాలే.. బాధ తీరలే..  
 
మెదక్‌లో ఆర్టీసీ సేవలు అధ్వానంగా మారాయి. జిల్లాలో మొత్తం 1,066 పంచాయతీలతో పాటు మరో 900 తండాలు, మదిర గ్రామాలు ఉన్నాయి. వీటిలో సుమారు 170 గ్రామాలు, 400 తండాలు, మదిర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ పల్లెలకు తారు, మట్టి రోడ్లు ఉన్నప్పటికీ బస్సులు తిప్పేందుకు మాత్రం అధికారులు ముందుకు రావడం లేదు.

దీంతో ఆయా గ్రామాల్లో ఆటోలు, జీపులు నడుస్తున్నాయి.. అనుభవం లేని యువకులు ఉపాధి, తక్షణ ఆర్థిక వెసులుబాటు కోసం వీటిని నడుపుతున్నారు. కిక్కిరిసిన మేర ప్రయాణికులను తరలిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.  
 
100 పల్లెల ‘ఆందోల్’న...
అందోలు నియోజకవర్గంలోని అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, టేక్మాల్, రాయికోడ్ మండలాల్లో దాదాపు 100 గ్రామాలకు బస్ సౌకర్యం లేదు. అందోలు మండలంలో పోసానిపేట, మాసానిపల్లి, దానంపల్లి, రోడ్లపాడ్, ఎర్రారం, సాయిబాన్‌పేట, అల్మాయిపేటలకు ఆర్టీసీ సేవలు అందడం లేదు.

రేగోడ్ మండలంలోని 11 గ్రామాలదీ ఇదే దుస్థితి. టేక్మాల్ మండలంలోని పల్వంచ, ఎలకుర్తి, కోరంపల్లి గ్రామాలకు అల్లాదుర్గం మండలంలోని అప్పాజిపల్లి, తండా, ముప్పారం, బహిరన్‌దిబ్బ, పోతులబొగుడ, మందాపూర్, సీతానగర్, తండాలకు బస్సు సౌకర్యం లేదు. రాయికోడ్ మండలంలో అల్లాపూర్, మాదాపూర్ గ్రామాల ప్రజలు ఇప్పటికీ బస్సు ముఖమే చూడలేదు. 34 గ్రామాల్లో 20 పల్లెలు ఆర్టీసీ రవాణాకు నోచుకోవడం లేదు. మునిపల్లి మండలంలోని 15 ఊర్లకు బస్సు సౌకర్యం లేదు. గొర్రెకట్టు, బొడ్చట్‌పల్లి, మేళసంఘం, లింగంపల్లి, ఐలాపూర్‌వాసులది కూడా ఇదే పరిస్థితి.

‘దుబ్బ’లోనే నడక...
దుబ్బాక నియోజకవర్గంలో 23 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. దుబ్బాక మండలంలోని పర్శరాంనగర్, రామేశ్వరంపల్లి, చిన్ననిజాంపేటకు నేటికి బస్సు సౌకర్యం లేదు. మిరుదొడ్డి మండలం కొండాపూర్, తొగుట మండలంలోని లింగాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి, కాన్గల్, గుడికందుల, చేగుంట మండలంలోని భీంరావుపల్లి, చిట్టోజిపల్లి, నర్సంపల్లి, రాంపూర్, గొల్లపల్లి, కాసాన్‌పల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దౌల్తాబాద్ మండలంలోని చెట్లనర్సంపల్లి, లింగాయపల్లితండా, ముత్యంపేట, వీరానగర్, వీరారెడ్డిపల్లి, శేరిల్లా, చిన్నమాసంపల్లి, చిన్నారెపల్లి, లింగారెడ్డిపల్లికి కూడా ఆర్టీసీ సేవలు అందడం లేదు.  

సిద్దిపేటలోనూ ఇదే సంకటం...
సిద్దిపేట మండలంలోని రాంపల్లి, రాంపూర్, ఇంద్రగూడెం, బట్రాంపల్లి, మర్రికుంట, నంగునూరు మండలంలోని జెర్రిపోతులతండ, లక్ష్మణ్‌నాయక్‌తండా, దర్గపల్లి, అప్పలాయిచెరువు, సంతోష్‌నగర్, చిన్నకోడూరు మండలం మల్యాల, మందపల్లికి బస్సు సేవలు నిల్. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  
 
ఇది ‘నడిసే’పూర్...
నర్సాపూర్ మండలంలో 34 గ్రామాలతో పాటు సుమారు 55తండాలు ఉండగా 40 గిరిజనతండాలతో పాటు అహ్మద్‌నగర్, పెద్దచింతకుంట, రాంచంద్రాపూర్ తదితర పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. వెల్దుర్తి మండలంలో 35 గ్రామాలుండగా 13 పల్లెలకే బస్సులు వస్తాయి. హత్నూర మండలంలో 33 గ్రామాలతో పాటు 12 గిరిజన తండాలు ఉండగా సికింద్లాపూర్, లింగాపూర్, చీక్‌మద్దూర్‌తో పాటు సుమారు 13 పల్లెలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు.

కొల్చారం మండలంలో వరిగుంతం, కోనాపూర్ తదితర గ్రామాలతో పాటు 12 తండాలకు,  శివ్వంపేట మండలంలో 8 గ్రామాలు, 30తండాలకు ఎర్ర బస్సులు రావడం లేదు. కౌడిపల్లి మండలంలో 40 గ్రామాలు, 52 తండాలు ఉండగా వెల్మకన్నె, కూకుట్లపల్లి, భుజరంపేటతో పాటు 16 గ్రామాలకు, సుమారు 40 గిరిజన తండాలకు ఆర్టీసీ అధికారులు ఇంతవరకూ బస్సు సౌకర్యం కల్పించలేకపోయారు.

గజ్వేల్‌లోనూ.. గదే గతి...  
వర్గల్ మండలంలో గోవిందాపూర్, గుంటిపల్లి, రాంసాగర్‌పల్లి, రెడ్యానాయక్‌తండా, గుండ్యా నాయక్‌తండా, లింబ్యానాయక్‌తండా, ఇప్పలగూడ గ్రామాలకు ఆర్టీసీ బస్సు వచ్చిన దాఖలాలు లేవు. గోవిందాపూర్ నుంచి ప్రతినిత్యం నెంటూరు పాఠశాలకు వచ్చేందుకు అక్కడి విద్యార్థులకు కాలినడకే శరణ్యం. జగదేవ్‌పూర్ మండలంలో మొత్తం 23 గ్రామ పంచాచతీలు 9 మదిర గ్రామాలు ఉన్నాయి. అయితే గత రెండు మూడు నెలలకు ముందు గోపాల్‌పూర్, జంగంరెడ్డిపల్లి, బస్వాపూర్, బిజివెంకటాపూర్, కొత్తపేట గ్రామాలకు అసలు ఆర్టీసీ బస్సులే వచ్చేవికావు.

కళాశాలకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు ధర్నా, రాస్తారోకోలు చేశారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్వాపూర్, జంగంరెడ్డిపల్లి, గోపాల్‌పూర్ గ్రామాలకు బస్సులను ప్రారంభించారు. శివారువెంకటాపూర్ గ్రామానికి బడి ఉంటేనే బస్సు లేదంటే తుస్సు. గొల్లపల్లి గ్రామానికి ఇంత వరకు ఎర్రబస్సు పోయిన దాఖలాలు లేవు. మందాపూర్, కొండాపూర్, గోపాలపూర్, జంగంరెడ్డిపల్లి, శివారువెంకటాపూర్ తదితర గ్రామాలకు ఉదయం, సాయంత్రం మాత్రమే బస్సు లేదంటే ఆటోలే దిక్కు.

ములుగు మండలంలోని అన్నసాగర్, వాగునూతి, కమలాబాద్, గంగధార్‌పల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రాక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వీరు బస్సు ప్రయాణం చేయాలనుకుంటే నాలుగు కిలోమీటర్ల దూరాన గల వంటిమామిడి రాజీవ్ రహదారికి కాలినడకన, లేదా ప్రై వేట్ వాహనాల ద్వారా చేరుకోక తప్పదు.

మెత్తుకున్నా.. బస్సురాదు...
మెదక్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. 35 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. మెదక్ మండలం కప్రాయిపల్లికి బస్సు సౌకర్యం లేక యేడాది క్రితం మమత అనే మహిళకు పాముకాటు వేయగా చికిత్స నిమిత్తం ఎడ్లబండిపై మెదక్‌కు తీసుకు వస్తుండగా సమయానికి వైద్యం అందక మార్గం మధ్యలోనే కన్నుమూసింది. గంగాపూర్‌లో కరెంట్‌షాక్‌కు గురైన వారికి కూడా బస్సు సౌకర్యం లేక చికిత్స సమయానికి అందించలేక పోయారు.

చిన్నశంకరంపేట  మండలంలోని దర్పల్లి, ఖాజాపూర్, జంగరాయి, శేరిపల్లి, మిర్జాపల్లి తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.  పాపన్నపేట మండలం రాంతీర్థం, ముద్దాపూర్, మల్లంపేట, కందిపల్లి, బాచారం, ఎంకెపల్లి , రామాయంపేట మండలంలో 9 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. మండలంలోని ఖాసీంపూర్, రజాక్‌పల్లి, చౌకత్‌పల్లి, శివ్వాయిపల్లి, సుతార్‌పల్లి, దామర చెర్వు, గొల్పర్తి, కోమట్‌పల్లి, నగరం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
 
ఖేడ్ తండాలను తట్టని బస్సు...
నారాయణఖేడ్ మండలంలోని పలుగుతండా, మన్యానాయక్ తండా, నాన్యానాయక్ తండా, పీర్లతండా, కిందితండా, మల్పరేగడితండా, కొత్తపల్లి, శేఖాపూర్ తదితర గ్రామాలకు బస్సు సౌకర్యంలేదు. మనూరు మండలంలోని 33 పంచాయతీలు ఉండగా 90కిపైగా తండాలు ఉన్నాయి. ఇందులో 70వరకు తండాలకు బస్సు సౌకర్యం లేదు.  మండలంలోని ఇరక్‌పల్లి, గౌడ్‌గాంజన్‌వాడ, ఔదత్‌పూర్, ఏస్గి, శిఖార్‌కానా, ఉట్‌పల్లి, ఎనక్‌పల్లి, మావినెళ్ళి, రాణాపూర్ తండా, ముగ్దుంపూర్, గట్‌లింగంపల్లి, ధన్వార్, కమలాపూర్, దోసపల్లి, బాదల్‌గావ్, షాపూర్, మాయికోడ్, డోవూర్‌లకు  ఆర్టీసీ బస్సులు వెళ్లవు.కల్హేర్ మండలంలోని రాంరెడ్డి పేట, ఖానపూర్ బి, దామర్‌చెరువు, రాపర్తి, మీర్‌ఖన్‌పేట్, పోచాపూర్, అంతర్‌గాం  గ్రామాలకు బస్సుసౌకర్యం లేదు.

పటాన్‌చెరులోనూ బస్సులు నడవని పల్లెలు...
గ్రేటర్ హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న పటాన్‌చెరు నియోజకవర్గంలో కూడా ఆర్టీసీ వెళ్లని పల్లెలు ఉన్నాయి. జిన్నారం మండలంలో నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్, సురారం. పటాన్‌చెరులో మండలంలో ఐలాపూర్ తండా, రామచంద్రాపురం మండలంలోని వెలిమెల తండా, కొల్లూర్ తండాలకు బస్సులు వెళ్లవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement