సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో తాము నిర్వహించతలపెట్టిన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ అడ్వొకేట్స్ యాక్షన్ కమిటీ ఫర్ సమైక్యాంధ్రప్రదేశ్ కన్వీనర్ సి.వి.మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తన ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించేందుకు ఈ నెల 28న సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సమావేశం కావాలని నిర్ణయించారు, ఈమేరకు స్టేడియం నిర్వహకులైన శాప్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, సమావేశానికి వారు అనుమతినిచ్చారని, అయితే పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరని చెప్పడంతో, తాము ఈ విషయాన్ని సైబరాబాద్ కమిషనర్, మాదాపూర్ డీసీపీల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరామని వివరించారు.
అయితే తమ అభ్యర్ధనను పోలీసులు తిరస్కరించారని, గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండటం వల్ల అక్కడ సమావేశాలకు అనుమతినివ్వలేమని చెప్పారని, ఈ కారణం ఎంత మాత్రం సరైనది కాదని ఆయన తెలిపారు. సమావేశం కావాలనుకుంటున్నది న్యాయవాదులు మాత్రమేనని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమావేశం నిర్వహించుకుంటామంటే అనుమతినివ్వకపోవడం అన్యాయమని ఆయన కోర్టుకు నివేదించారు. అదే ప్రాంతంలో సమావేశం నిర్వహించుకునేందుకు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సైతం దరఖాస్తు చేసిందని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి తమకు తెలిసి అటువంటి దరఖాస్తు ఏదీ లేదని ఆయన తెలిపారు. తమ సమావేశం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పోస్టర్లు విడుదల జరిగిందని, సీమాంధ్రలోని అన్ని బార్ అసోసియేషన్లకు సమాచారం వెళ్లిందని, సమావేశంలో పాల్గొనేందుకు న్యాయవాదులంతా తగిన ఏర్పాట్లు చేస్తున్నారని అశోక్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
సమావేశం నిర్వహిస్తాం: మోహన్‌రెడ్డి
శనివారం తాము నిర్వహించతలపెట్టిన సమావేశం యధాతధంగా జరుగుతుందని మోహన్‌రెడ్డి తెలిపారు. తమ సమావేశానికి అనుమతివ్వపోవడానికి పోలీసులు చెప్పిన కారణాలు ఎంత మాత్రం సహేతుకంగా లేవని చెప్పారు. కేసు విచారణ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శాంతియుతంగా తాము సమావేశం నిర్వహించుకుంటామని, ఈ విషయంలో కోర్టు తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. గతంలో కోర్టు ఇటువంటి సమావేశాలకు పలుమార్లు అనుమతులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
అనుమతి నిరాకరణ అన్యాయం
Published Fri, Sep 27 2013 3:08 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement