C.v. Mohanreddy
-
అనుమతి నిరాకరణ అన్యాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో తాము నిర్వహించతలపెట్టిన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ అడ్వొకేట్స్ యాక్షన్ కమిటీ ఫర్ సమైక్యాంధ్రప్రదేశ్ కన్వీనర్ సి.వి.మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తన ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించేందుకు ఈ నెల 28న సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సమావేశం కావాలని నిర్ణయించారు, ఈమేరకు స్టేడియం నిర్వహకులైన శాప్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, సమావేశానికి వారు అనుమతినిచ్చారని, అయితే పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరని చెప్పడంతో, తాము ఈ విషయాన్ని సైబరాబాద్ కమిషనర్, మాదాపూర్ డీసీపీల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరామని వివరించారు. అయితే తమ అభ్యర్ధనను పోలీసులు తిరస్కరించారని, గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండటం వల్ల అక్కడ సమావేశాలకు అనుమతినివ్వలేమని చెప్పారని, ఈ కారణం ఎంత మాత్రం సరైనది కాదని ఆయన తెలిపారు. సమావేశం కావాలనుకుంటున్నది న్యాయవాదులు మాత్రమేనని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమావేశం నిర్వహించుకుంటామంటే అనుమతినివ్వకపోవడం అన్యాయమని ఆయన కోర్టుకు నివేదించారు. అదే ప్రాంతంలో సమావేశం నిర్వహించుకునేందుకు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సైతం దరఖాస్తు చేసిందని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి తమకు తెలిసి అటువంటి దరఖాస్తు ఏదీ లేదని ఆయన తెలిపారు. తమ సమావేశం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పోస్టర్లు విడుదల జరిగిందని, సీమాంధ్రలోని అన్ని బార్ అసోసియేషన్లకు సమాచారం వెళ్లిందని, సమావేశంలో పాల్గొనేందుకు న్యాయవాదులంతా తగిన ఏర్పాట్లు చేస్తున్నారని అశోక్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సమావేశం నిర్వహిస్తాం: మోహన్‌రెడ్డి శనివారం తాము నిర్వహించతలపెట్టిన సమావేశం యధాతధంగా జరుగుతుందని మోహన్‌రెడ్డి తెలిపారు. తమ సమావేశానికి అనుమతివ్వపోవడానికి పోలీసులు చెప్పిన కారణాలు ఎంత మాత్రం సహేతుకంగా లేవని చెప్పారు. కేసు విచారణ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శాంతియుతంగా తాము సమావేశం నిర్వహించుకుంటామని, ఈ విషయంలో కోర్టు తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. గతంలో కోర్టు ఇటువంటి సమావేశాలకు పలుమార్లు అనుమతులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. -
చర్యలకు ఆదేశిస్తే నష్టపోయేది ప్రజలే
ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టుకు నివేదించిన మోహన్‌రెడ్డి అలా ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నించిన ధర్మాసనం విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా రాష్ట్రంలో ఆరులక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తీరాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని ఏపీఎన్జీవోల తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు ఎందుకు అలా భావిస్తున్నారు..? మేం ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని ఎందుకు అనుకుంటున్నారు..? సమ్మెలో పాల్గొనడం ఏమైనా తీవ్రమైన నేరమా..? మహా అయితే సమ్మె చేస్తున్న వారి వివరాలను వారి సర్వీసు రికార్డుల్లో పొందుపరచడం మినహా ప్రభుత్వం ఏం చేస్తుంది.?’ అని వ్యాఖ్యానించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి బుధవారం నాటి తన వాదనలను కొనసాగించారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టు తన అధికార పరిధిని, న్యాయ పరిధిని ఉపయోగించి ఫలానా విధంగా చర్యలు తీసుకుని తీరాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయగలదని అన్నారు. ఏపీఎన్జీవోల సమ్మెకు సంబంధించి అటువంటి అసాధారణ పరిస్థితులు ఏమీ లేవని, అందువల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు నివేదించారు. సివిల్ సర్వీస్ రూల్స్ ఆధారంగా పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని, ఎస్మా గురించి, ఇతర నిబంధనల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, కాబట్టి ఉద్యోగులపై చర్యలకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేలా పిటిషనర్‌ను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ప్రభుత్వం తను నిర్వర్తించాల్సిన పనిని నిర్వర్తించకపోతే అప్పుడా విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అయినా కూడా స్పందించకుంటే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పారు. ప్రస్తుత కేసులో పిటిషనర్ అటువంటి చర్యలేవీ తీసుకోలేదని ఆయన తెలిపారు. కాబట్టి సమ్మె చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించజాలదని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.