చర్యలకు ఆదేశిస్తే నష్టపోయేది ప్రజలే
ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టుకు నివేదించిన మోహన్‌రెడ్డి
అలా ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నించిన ధర్మాసనం
విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా రాష్ట్రంలో ఆరులక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తీరాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని ఏపీఎన్‌జీవోల తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు ఎందుకు అలా భావిస్తున్నారు..? మేం ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని ఎందుకు అనుకుంటున్నారు..? సమ్మెలో పాల్గొనడం ఏమైనా తీవ్రమైన నేరమా..? మహా అయితే సమ్మె చేస్తున్న వారి వివరాలను వారి సర్వీసు రికార్డుల్లో పొందుపరచడం మినహా ప్రభుత్వం ఏం చేస్తుంది.?’ అని వ్యాఖ్యానించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి బుధవారం నాటి తన వాదనలను కొనసాగించారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టు తన అధికార పరిధిని, న్యాయ పరిధిని ఉపయోగించి ఫలానా విధంగా చర్యలు తీసుకుని తీరాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయగలదని అన్నారు.
ఏపీఎన్‌జీవోల సమ్మెకు సంబంధించి అటువంటి అసాధారణ పరిస్థితులు ఏమీ లేవని, అందువల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు నివేదించారు. సివిల్ సర్వీస్ రూల్స్ ఆధారంగా పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని, ఎస్మా గురించి, ఇతర నిబంధనల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, కాబట్టి ఉద్యోగులపై చర్యలకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేలా పిటిషనర్‌ను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ప్రభుత్వం తను నిర్వర్తించాల్సిన పనిని నిర్వర్తించకపోతే అప్పుడా విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అయినా కూడా స్పందించకుంటే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పారు. ప్రస్తుత కేసులో పిటిషనర్ అటువంటి చర్యలేవీ తీసుకోలేదని ఆయన తెలిపారు. కాబట్టి సమ్మె చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించజాలదని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.