⇒ జెండాలు మోసి ఏం ప్రయోజనం
⇒ పదవులు లేవు-నిధులు రావు
⇒ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదు
⇒ కార్యకర్తలు,ప్రజల తిట్లు తప్పడంలేదు
సాక్షి, చిత్తూరు: ఎనిమిది నెలల పాలన ముగిసినా పైసా నిధులు లేవు-చేద్దామంటే పనులు లేవు. నామినేటెడ్ పోస్టులైనా భర్తీ చేస్తారనుకుంటే .. అదీ లేదు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజల చీత్కారం ఎదుర్కోవాల్సి వస్తోంది...అంటూ టీడీపీ కేడర్‌లో అంతర్మథనం మొదలైంది. ఆది నుంచి పార్టీ జెండాలు మోసి, ఆరోగ్యం క్షీణించి, ఆర్థికంగా నష్టపోయినా అధిష్ఠానం కనికరించలేదని తెలుగుతమ్ముళ్లలో అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. గ్రామ స్థాయిలో కార్యక ర్తలు, ఓట్లేసిన ప్రజలు కనపడ్డప్పుడల్లా పార్టీని,ముఖ్యమంత్రిని బహిరంగంగానే తిడుతుండడంతో ఆ పార్టీ నేతలు తలెత్తుకుని తిరగలేకున్నారు. సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందంటూ కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నికల్లో పాపం బాబు గెలుపు కోసం టీడీపీ నేతలు నానా పాట్లు పడ్డారు. చెన్నై,బెంగళూరు,హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో స్థిరపడ్డ నేతలు సైతం చంద్రబాబు పిలుపుతో జిల్లాకు తరలివచ్చారు. ఆయన అధికారంలోకి వస్తే పదవులు,పనులు వస్తాయని లెక్కలు వేసుకున్నారు. కోట్లు గుమ్మరించి ఎన్నికల్లో పనిచేశారు. బాబు గద్దెనెక్కి 8 నెలలు పూర్తయింది. నేతల సంగతి పట్టించుకునేవారు లేరు. పైసా రాబడిలేదు,పదవులూ రాలేదు. బాబు వైఖరి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలనిస్తుందని, భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసేవారు ఉండరని నేతలు మదనపడుతున్నారు.
మరో వైపు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చక పోయామన్న భావన ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. డ్వాక్రా రుణమాఫీ హామీపై మాట మార్చడం, రైతు రుణమాఫీ 20 శాతం మందికి కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. జిల్లా కరువుతో అల్లాడుతున్నా చర్యలు లేవు. కొత్త నిధుల సంగతి దేవుడెరుగు పాత బకాయిలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లా ప్రధాన సమస్య తాగునీటి పరిష్కారానికి హంద్రీ-నీవా,కండలేరు నీటిపథకాలను పూర్తి చేయాల్సి ఉంది.
ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూపకల్పన చేశారన్న అక్కసుతో కండలేరు పథకాన్ని బాబు పక్కన పెట్టారు. కరువు పుణ్యమాని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. జిల్లా మొత్తం కరువున్నా 42 మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. దీనిపై సహాయక చర్యలు లేవు. వేరుశెనగ రైతులకు 110 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అయినా పైసా ఇచ్చే పరిస్థితి కానరావడంలేదు. గత ఏడాది సైతం 33 మండలాలను కరువు కింద ప్రకటించారు.
దీనికి సంబంధించి 90 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. పండ్ల తోటల రైతులకు 10 వేల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీ గాలిలో కలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు సవాలక్ష. ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్న భావన దేశం నేతల్లో నెలకొంది. ఇప్పటికే చంద్రబాబును జిల్లా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేకుండా పోయిందని,తప్పు చేశామన్న భావనతో ఉన్నారని ఆ పార్టీ ముఖ్యనేత ‘సాక్షి’తో వాపోయారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు మరింత ఆగ్రహంతో ఉన్నారని, టీడీపీ నేతలు గ్రామాల్లో వెళ్లలేని పరిస్థితి నెలకొందని మరి కొందరు టీడీపీ నేతలు పేర్కొన్నారు.
‘దేశం’లో అంతర్మథనం
Published Mon, Feb 16 2015 3:13 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement