పరిశ్రమలకు చీకట్‌లు
రోజుకు నాలుగు గంటలు
10,400 పరిశ్రమలపై ప్రభావం
4 లక్షల మంది కార్మికులకు ఇబ్బందులు
సాక్షి, విజయవాడ :
విద్యుత్ కోతల నిర్ణయం పరిశ్రమలకు షాకిస్తోంది. రోజుకు నాలుగు గంటల చొప్పున పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కోతల వల్ల జిల్లాలో అనేక పరిశ్రమలు ఆర్థికంగా నష్టపోనున్నాయి. వీటిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదముంది. వేసవి సమీపించేకొద్దీ కోతల వేళలు మరింత పెరిగే అవకాశముంది. పైగా విద్యుత్ విరామ (పవర్ హాలిడే) దినాలనూ ప్రకటించే పరిస్థితి రానుంది. గత ఏడాదీ ఇలాగే పరిశ్రమలకు కోత విధించడంతో అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు. ఈసారీ ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
10,400 పరిశ్రమలపై ప్రభావం...
జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు ఆరువేలు, భారీ మధ్య తరహా పరిశ్రమలు రెండు వేలు ఉన్నాయి. విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న ఆటోమొబైల్ రంగం, ప్రింటింగ్ ప్రెస్‌లు సహా మరో 2,400 వరకు ఉంటాయని పరిశ్రమల అధికారులు చెబుతున్నారు. అన్నీ కలిపి 10 వేల 400 పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల్లో సుమారు 4 లక్షల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరి ఉపాధిపై కోతల ప్రభావం పడనుంది.
కార్మికుల సంఖ్య తగ్గించే యోచన...
విద్యుత్ కోతల నేపథ్యంలో రాబోయే కాలంలో ఆర్థిక నష్టాలు పెరుగుతాయని యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీంతో అనేకమంది కార్మికులను తగ్గించేందుకు అవి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాదిమంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తనుంది.
4 గంటలు కోత
పరిశ్రమలకు రోజుకు నాలుగు గంటలు కరెంటు కోతలు ఉంటాయని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి.రాజేంద్ర ప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల జిల్లాలో ఉన్న 10,400 పరిశ్రమలకు కోత విధిస్తారన్నారు. ఏ సమయంలో కోతలు ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
- జి.రాజేంద్రప్రసాద్,
జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ