ఆపద్బంధుకు ఆపద | no proper facilities in 108 ambulance | Sakshi
Sakshi News home page

ఆపద్బంధుకు ఆపద

Published Mon, Jan 20 2014 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

ఆపద్బంధుకు ఆపద

ఆపద్బంధుకు ఆపద

 సాక్షి, సిటీబ్యూరో:  ఆపద్బంధుకు ఆపదొచ్చింది. ఇలా పిలవగానే అలా కుయ్.. కుయ్.. మంటూ ఆగమేఘాల మీద పరుగెత్తుకొచ్చే 108 అంబులెన్సుల ఆయుష్షు నిర్వహణ లోపం వల్ల రోజురోజుకూ మరింత క్షీణిస్తోంది. నెలల తరబడి మరమ్మతులకు నోచుకోక పోవడంతో వాహనాల్లో తరచూ సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. కారణాలేవైనప్పటికీ ఆస్పత్రికి తరలిం చడంలో జరుగుతున్న జాప్యం వల్ల క్షతగాత్రులు, నిండు గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం 108కి పదేపదే కాల్ చేసినా రావడం ఆలస్యం కావడమో లేక ఎంగేజ్ రావడమో జరుగుతోంది. గతంలోలా ఘటనా స్థలానికి సకాలంలో చేరుకోలేక పోతోంది. అంతేకాదు అంబులెన్స్‌లో 108 రకాల మందులు, సర్జికల్ ఐటమ్స్ ఉండాల్సి ఉండగా... చాలా వాహనాల్లో ఉండాల్సిన స్థాయిలో అవి ఉండటం లేదు.


 వివిధ ప్రాంతాల్లో అంబులెన్స్‌ల పరిస్థితి ఇదీ...
     ఎల్‌బీనగర్ సర్వీసులో సెక్షన్ ఆపరేటర్, ఫల్స్ ఆక్సోమీటర్, ఫెడిబోర్డు, వీల్‌చైర్స్ లేవు. మందుల స్టాక్ తక్కువగా ఉంది. వాహనం అతి కష్టమ్మీద స్టార్ట్ అవుతోంది.
     సరూర్‌నగర్‌లోని వాహనంలో ఆగిపోయిన గుండెను కరెంట్ తరంగాల ద్వారా యథాతథ స్థితిలోకి తీసుకొచ్చే హార్ట్‌స్ట్రోక్ యంత్రం, నెబులైజర్ లేదు. 20 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉండాల్సి ఉండగా ఐదే ఉన్నాయి. వాహనం తరచూ మొరాయిస్తోంది.
     గచ్చిబౌలి, కొండాపూర్ నుంచి ప్రతి నెలా ఒకటిన మెడికల్ ఇండెక్స్ పంపుతుండగా..13న అంబులెన్స్‌కు చేరుతున్నాయి.
     మల్కాజ్‌గిరిలో ఎలక్ట్రిక్ బ్యాండేజ్ లేదు.
 
     జంగమ్మెట్ కేంద్రానికి కొత్తగా ఇచ్చిన అంబులెన్స్ టైర్లు పూర్తిగా అరిగి పోయాయి.
     మియాపూర్ లోని వాహనం టైర్లు మార్చాల్సి ఉంది. కెమెరా, సైన్‌బోర్డు, టార్చ్‌లైట్, ఫ్రీకాలర్, ప్రింటర్, కిడ్నీ ట్రీలు లేవు. స్ట్రక్చర్ కూడా పాడైపోయింది. రోజుకు పది నుంచి 30 కాల్స్ వస్తే, 8 కాల్స్ మాత్రమే అటెండ్ చేస్తున్నారు.
 
     ఉప్పల్ వాహనంలో పల్స్‌రేట్‌ను చెక్ చేయాల్సిన పరికరం లేదు. వాహనం ఇప్పటివరకు 2.40 లక్షల కి.మీ. తిరిగింది. పాతది కావడం వల్ల పికప్ అందుకోలేక పోతుంది. గతంలో నెలకు 300 వరకు కేసులు వస్తే.. ఇప్పుడు 110 వరకు కేసులు వస్తున్నాయి.
 జాప్యానికి పెలైట్లు చెబుతున్న కారణాలు
     ట్రాఫిక్ రద్దీ, వాహనానికి దారి ఇవ్వకపోవడం
     ఒకే సమయంలో రెండు మూడు ప్రమాదాలు జరగడం
     వాహనం మరో కేసులో బిజీగా ఉండటం
     ఘటనా స్థలంపై సరైన సమాచారం ఇవ్వక పోవడం
 
 వాస్తవం ఇదీ...
     గ్రేటర్‌లో 48 సర్వీసులుండగా.. వీటిలో చాలావరకు పాతవే.
     వాహనం 60 వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత టైర్లు మార్చాలి.
     ప్రతి ఆరు లక్షల కిలోమీటర్లకు వాహనాన్ని మార్చాలి.
     ఈ నిబంధనలు అమలుకాక చాలా వాహనాల కండిషన్ బాగోలేదు.
     చాలావాటికి టైర్లు అరిగిపోయి, తరచూ ఫంక్చర్ అవుతున్నాయి.
     నిర్వహణ లోపం వల్ల ఇంజన్ నుంచి ఆయిల్ లీక్ అవుతోంది.
     10 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకోవాల్సిన ఈ సర్వీసులు అరగంటైనా రావడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement