తాత్సారంతో విద్వేషాలు పెరుగుతాయి | no proper understanding means problems may raise | Sakshi
Sakshi News home page

తాత్సారంతో విద్వేషాలు పెరుగుతాయి

Published Mon, Sep 30 2013 1:15 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

తాత్సారంతో విద్వేషాలు పెరుగుతాయి - Sakshi

తాత్సారంతో విద్వేషాలు పెరుగుతాయి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నకొద్దీ తెలంగాణ వ్యతిరేక కుట్రలు, రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అసత్యాలు, అర్థసత్యాలతో తెలంగాణ పోరాటంపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటైతే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రా ప్రాంతంలో అభివృద్ధి, సమానత్వం, వికాసం, వ్యాపారం, ఉపాధి సంబంధిత అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో ఆదివారం జరిగిన సకల జనభేరిలో కోదండరాం అధ్యక్షోపన్యాసం చేశారు. సీమాంధ్ర దోపిడీ నుండి విముక్తి కోసం, సమానత్వం కోసం తెలంగాణ ఉద్యమం జరుగుతోందన్నారు. బతుకు కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని, తెలంగాణ ఏర్పాటును ప్రపంచంలో ఎవరూ ఆపలేరన్నారు. తెలంగాణ వచ్చేదాకా కొట్లాటకు సిద్ధంగా ఉన్నామన్నారు.
 
  తెలంగాణ ప్రజల ఓర్పును, సహనాన్ని తక్కువగా చూడొద్దని హెచ్చరించారు. తెలంగాణలో 50 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి పడావుగా పడిఉందని, సగం భూమి బోర్లు, బావుల కిందనే సాగవుతున్నదని తెలిపారు. సాగుకు అనువైన భూములు ఇలా పడావు పడటం తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో 75 శాతం తెలంగాణలో జరిగాయని వివరించారు. ఆంధ్రా నుండి వలసలు 3.5 శాతమేనని, అందులో తెలంగాణకు వలస వస్తున్నది ఒక్క శాతమేనని పేర్కొన్నారు. మొత్తం వలసపోతున్న వారి లో విద్యావసరాల కోసం వస్తున్నది కేవలం 15 శాతమేనని చెప్పారు. కేంద్రీయ, ఇతర జాతీయ యూనివర్సిటీల్లో దేశంలో ఎక్కడివారైనా చదువుకోవచ్చునని, మిగిలినవాటిలో అన్ని వర్సిటీలకు ఉన్నట్టుగా 15 శాతం ఓపెన్ పోటీ ఉంటుందన్నారు. ఇవన్నీ చెప్పకుండా విద్యా, ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు పెట్టుబడిగా వ్యాపారాలు చేస్తున్న వారే సీమాంధ్ర ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. సీమాంధ్రలో ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా వ్యాపార, రాజకీయ సమస్యల గురించి మాత్రమే సీమాంధ్ర నేతలు ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.
 
 ఆ మీడియాపై ప్రతిక్రియ తప్పదు
 మీడియాలోని ఒక వర్గం తెలంగాణ ఉద్యమంపై అనుసరించిన వైఖరిని, ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమాలపై అనుసరిస్తున్న విధానాలను గుర్తించామని కోదండరాం చెప్పారు. సీమాంధ్ర పాలకులకు తొత్తుగా ఆ వర్గం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అయితే మీడియానే రాజకీయ వేదిక అయినప్పుడు అందుకు ప్రతిక్రియ తప్పదని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు ఆంధ్రావారి పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అణచివేయడం మీడియాకు మంచిది కాదన్నారు. నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యాసంస్థలు తెలంగాణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పాత్రను గమనిస్తున్నామని ఆయన హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement