సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మధ్యలో చదువు మానేసిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన కస్తూరిబా పాఠశాలలు ఆచరణలో చతికిలపడుతున్నాయి. పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో విద్యార్థినుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొందరు ప్రత్యేకాధికారులు మెనూ పాటించకుండా డబ్బులు నొక్కేసి నాసిరకం భోజనం పెడుతున్న దాఖలాలున్నాయి.
చాలాచోట్ల విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించిన నోట్ బుక్‌లు, ట్రంకు పెట్టెలతోపాటు యూనిఫాంలు కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దుప్పట్లు లేకపోవడంతో రాత్రి వేళ దోమలతో ఇబ్బందులు పడడమేకాదు చలికి వణికిపోతున్నారు. ఈ ఇక్కట్లపై ‘సాక్షి’ విజిట్ చేయగా పాఠశాలల డొల్లతనం బట్టబయలైంది.
చినగంజాంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో మొత్తం 200 మంది బాలికలున్నారు. పాఠశాల చుట్టూ గోడ లేకపోవడంతో వారికి రక్షణ కరువైంది.
మర్రిపూడి మండలం రావిళ్లవారిపాలెం శివారులోని పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు మథనపడుతున్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బేస్తవారిపేట పాఠశాల పక్కనే శ్మశానవాటిక ఉండటంతో విద్యార్థినులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. శవాలను తీసుకెళ్లేటప్పుడు పాఠశాల ముందు భాగంలో శవాన్ని దింపే కార్యక్రమం నిర్వహిస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
పొన్నలూరు మండలం కె.అగ్రహారంలోని కస్తూరిబా పాఠశాలలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. పాఠశాలను పెద్ద గోడౌన్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు సామాన్లు పెట్టుకోవడంతోపాటు పాఠాలు కూడా అక్కడే వినాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం 104 మంది ఉండగా మరుగుదొడ్లు రెండు మాత్రమే ఉన్నాయి.
పీసీపల్లి కస్తూరిబా పాఠశాలకు ప్రహరీ లేక బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
వెలిగండ్ల పాఠశాలలో లైట్లు వెలగక, ఫ్యాన్లు తిరగక రాత్రి పూట అనేక ఇక్కట్లు పడుతున్నారు. చాలాచోట్ల బాలికలకు బోరింగ్ నీరే దిక్కు. బోర్లలోని ఫ్లోరైడ్ నీరు తాగలేక నానా అవస్థలు పడుతున్నారు.
హనుమంతునిపాడు కస్తూరిబాలో బోరింగ్ నీరు తాగుతుండటంతో ఇటీవల కొందరు దురద, ఇతర చర్మవ్యాధులతో ఇబ్బందులు పడ్డారు.
మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలోని ఆట స్థలం కొండలు, గుట్టలతో నిండిపోయింది. తరగతి గదుల్లోనే రాత్రి సమయంలో నిద్రిస్తున్నారు.
=
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు విద్యార్థినులకు ఫ్లోరైడ్ నీరే దిక్కు. పాఠశాల చుట్టూ ముళ్లపొదలు, చెత్తచెదారం ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బాలికలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఊరికి దూరంగా బీడు భూముల్లో పాఠశాల ఉండటం, ప్రహరీ మధ్యలో ఆగిపోవడంతో రాత్రి పూట బాలికలు నానా అవస్థలు పడుతున్నారు.
కొనకనమిట్ల మండలం గొట్లగట్టు కస్తూరిబా పాఠశాలలో ఉడికీ ఉడకని అన్నంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు.
తాళ్లూరు, కురిచేడు, దొనకొండ పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో తరచూ విష సర్పాలు లోపలికి వస్తున్నాయి. తాళ్లూరు పాఠశాలలో సరిపడినన్ని బెంచీలు లేకపోవడంతో బాలికలు నేలపై కూర్చొంటున్నారు. డార్మేటరీ పూర్తి కాకపోవడంతో డైనింగ్ హాల్, పెట్టెల మధ్యనే నిద్రిస్తున్నారు.
కురిచేడు విద్యాలయానికి కంప్యూటర్లు అందజేసిన అధికారులు ఇన్‌స్ట్ట్రక్టర్‌ను నియమించకపోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగావున్నాయి.
రాచర్లలో అసంపూర్తిగా నిలిచిన భవనంలో విద్యార్థినులు ఆరు బయట నిద్రించాల్సి వస్తోంది. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కస్తూర్బా పాఠశాలల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
‘కస్తూరిబా’
Published Mon, Sep 29 2014 5:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement