పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్, న్యూస్‌లైన్: పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రతే కాదు ప్రాణాలకు రక్షణా కరువైంది. రోజూ ఎక్కడోచోట కార్మికులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో గాయాల పాలైతే మరికొన్ని ఘటనల్లో ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. పరిశ్రమల్లో కనీస సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. భద్రతా చర్యలను పాటించకపోవడం.. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కార్మికులు గాయపడినా సరైన వైద్యం అందడం లేదని, మరణించినా యాజమాన్యాల నుంచి బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందడంలేదనే ఆరోపణలున్నాయి. కార్మికులకు కనీసం ఈఎస్‌ఐ సౌకర్యం కూడా లేకపోవడంతో గమనార్హం.
కార్మికుడు మరణిస్తే బాధితులకు మొక్కుబడిగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. అదీ కూడా స్థానిక నాయకులు ఆందోళనలకు దిగితేనే యాజమాన్యాలు స్పందిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పలు యాజమాన్యాలు శవాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించిన ఘటనలు ఉన్నాయి. పరిశ్రమల్లో కార్మికులకు ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కార్మిక శాఖ పరిశీలించకపోవడంతో వేలాదిమంది కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.
వలస కార్మికులూ అధికమే..
పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో వందలాది మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే కావడం పలు యాజమాన్యాలు వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. వారు అప్పగించిన పని చేయడం తప్ప నోరువిప్పి ఏదీ అడగక పోవడం యాజమాన్యాలకు కలిసొస్తుంది. వారిని పరిశ్రమల ఆవరణలోనే చిన్న చిన్న గదుల్లో ఉంచి 24 గంటలూ పనిచేయించుకుంటున్నట్టు సమాచారం.
కాగా రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా రియాక్టర్లు పేలుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనించడమే గాకుండా శుభ్రపరుస్తూ ఉండాలి. వాటికయ్యే ఖర్చు దృష్ట్యా రియాక్టర్ల నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా చాలాచోట్ల అవి పేలుతున్నాయి. ఇటీవలే జిన్నారం మండలం ఐడీఏ బొల్లాంలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలిన విషయం తెల్సిందే. ఇందులో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.
పరిశ్రమల్లో..కార్మికుల భద్రత డొల్ల
Published Wed, Feb 19 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement