No protection
-
పాదగయ గోశాలకు రక్షణ కరువు
పిఠాపురం : స్థానిక పాదగయ కుక్కుటేశ్వరస్వామి దేవస్థానంలో గోశాలలో అప్పుడే పుట్టిన లేగదూడలు కుక్కల బారిన పడి ప్రాణాలు వదులుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాదగయ పుష్కరిణికి తూర్పు వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో గోశాల నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 16 గోవులు ఉన్నాయి. వీటి పోషణకు భక్తులు రూ.లక్షల్లో విరాళాలు సమర్పిస్తుంటారు. పలు పర్వదినాలలో సైతం ఈ గోవులకు పూజలు చేస్తుంటారు. రాత్రిళ్లు కాపలా ఉండేవారు నిర్లక్ష్యం వహిస్తుండడంతో కుక్కలు ఆలయ పరిసరాలు, గోశాలలోకి ప్రవేశించి లేగదూడలను పీక్కు తీనేస్తున్నాయి. ఇప్పటివరకూ మూడు దూడలు చనిపోయినట్టు గోసంరక్షణ సమితి సభ్యులు గుర్తించారు. ఈ విషయంపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గోదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు లేగదూడల మరణాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని గోవులకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇది వాస్తవమే... ఈ విషయంపై ఆలయ ఈఓ చందక దారబాబును వివరణ కోరగా లేగదూడలను కుక్కలు పీక్కుతినడం వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
పరిశ్రమల్లో..కార్మికుల భద్రత డొల్ల
పటాన్చెరు/పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్: పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రతే కాదు ప్రాణాలకు రక్షణా కరువైంది. రోజూ ఎక్కడోచోట కార్మికులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో గాయాల పాలైతే మరికొన్ని ఘటనల్లో ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. పరిశ్రమల్లో కనీస సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. భద్రతా చర్యలను పాటించకపోవడం.. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కార్మికులు గాయపడినా సరైన వైద్యం అందడం లేదని, మరణించినా యాజమాన్యాల నుంచి బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందడంలేదనే ఆరోపణలున్నాయి. కార్మికులకు కనీసం ఈఎస్ఐ సౌకర్యం కూడా లేకపోవడంతో గమనార్హం. కార్మికుడు మరణిస్తే బాధితులకు మొక్కుబడిగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. అదీ కూడా స్థానిక నాయకులు ఆందోళనలకు దిగితేనే యాజమాన్యాలు స్పందిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పలు యాజమాన్యాలు శవాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించిన ఘటనలు ఉన్నాయి. పరిశ్రమల్లో కార్మికులకు ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కార్మిక శాఖ పరిశీలించకపోవడంతో వేలాదిమంది కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వలస కార్మికులూ అధికమే.. పటాన్చెరు పారిశ్రామిక వాడలో వందలాది మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే కావడం పలు యాజమాన్యాలు వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. వారు అప్పగించిన పని చేయడం తప్ప నోరువిప్పి ఏదీ అడగక పోవడం యాజమాన్యాలకు కలిసొస్తుంది. వారిని పరిశ్రమల ఆవరణలోనే చిన్న చిన్న గదుల్లో ఉంచి 24 గంటలూ పనిచేయించుకుంటున్నట్టు సమాచారం. కాగా రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా రియాక్టర్లు పేలుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనించడమే గాకుండా శుభ్రపరుస్తూ ఉండాలి. వాటికయ్యే ఖర్చు దృష్ట్యా రియాక్టర్ల నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా చాలాచోట్ల అవి పేలుతున్నాయి. ఇటీవలే జిన్నారం మండలం ఐడీఏ బొల్లాంలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలిన విషయం తెల్సిందే. ఇందులో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. -
‘నిర్భయ’మేదీ..?
సాక్షి, ఒంగోలు: ‘ఇటీవల గుడ్లూరు మండలం శాలిపేట గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై సుబ్బారావు అనే కామాంధుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. హనుమంతునిపాడు మండలం లింగంగుంటలో ఎనిమిదేళ్ల చిన్నారిపై బ్రహ్మనాయుడు అనే రాక్షసుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొదిలి మండలం జువ్వలేరు గ్రామంలో ఇటీవల మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిపై ఇద్దరు లైంగికదాడి చేశారు. పొదిలి పట్టణం విశ్వనాథపురంలో పట్టపగలే ఇంట్లో ఉన్న ఒక మహిళను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యచేసి ఆమె మెడలో ఉన్న ఆభరణాలు, చేతి గాజులు అపహరించుకెళ్లాడు. ఒంగోలు నగరంలోని త్రోవగుంట వద్ద బిహ ర్భూమికి వెళ్లిన సుశీలమ్మ అనే మహిళను దారుణంగా హతమార్చారు.’ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి దారుణాలు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఊహ తెలియని చిన్నారులపై సైతం కామాంధులు లైంగికదాడులకు పాల్పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ప్రేమ పేరుతో వేధింపులు నిత్యకృత్యం. నిర్భయ వంటి చట్టాలు ఎన్ని వచ్చినా ‘మేమింతే..మారమంతే’ అంటూ కొన్ని మానవ మృగాలు బరితెగిస్తున్నాయి. నిత్యం ఎక్కడోచోట మహిళల మెడల్లో గొలుసుల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పసిబిడ్డకు అన్నం పెడుతున్నా... ఇంటి ముంగిట ముగ్గు వేస్తున్నా.... చిన్నారులను బడి నుంచి తీసుకువెళుతున్నా.. చైన్‌స్నాచింగ్ దొంగలు కళ్లు మూసి తెరిచే లోగా బంగారు గొలుసులు తెంపుకుని మాయమవుతున్నారు. ఉద్యోగినులకూ తప్పని వేధింపులు: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇక గృహ హింసకు కొదవే లేదు. వరకట్న వేధింపులు తాళలేక ఎంతోమంది యువతులు విగతజీవులవుతున్నారు. మరోవైపు అనుమానపు మృగాళ్లతో సంసారాలు ఛిద్రమవడమేకాక పిల్లలు అనాథలవుతున్నారు. తల్లి, తండ్రి తరువాత స్థానంలో ఉండే గురువులు సైతం కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన చిన్నారులపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాలు చట్టుబండలవుతున్నాయే తప్ప వారికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు తదితర కేసులు పోలీసు రికార్డుల్లో నమోదయ్యేవి కొన్నే. పరువు మర్యాదల సమస్యతో వెలుగులోకి రానివి కోకొల్లలు. గతేడాది 72 మంది మహిళలపై లైంగికదాడులకు పాల్పడిన వారు జిల్లా జైలులో రిమాండ్‌కు వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్షక భటులే భక్షకులైతే..? మహిళలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షకులుగా మారుతున్నారు. తెనాలి రైల్వే పోలీసుగా పనిచేస్తున్న నగరానికి చెందిన ఓ ప్రబుద్ధుడు సౌత్‌బైపాస్ రోడ్డు సమీపంలో తన స్నేహితుడితో మాట్లాడుతున్న ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిని ఇంటి వద్ద దింపుతానంటూ నమ్మకంగా మోటార్ బైక్ ఎక్కించుకుని జన సంచారం లేని ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల నాగులుప్పలపాడు పోలీసుస్టేషన్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీమన్నారాయణ అనే హోంగార్డు తన సహచర హోంగార్డుతో ఐదేళ్లపాటు సహజీవనం చేస్తూ తాను మరో పెళ్లి చేసుకునేందుకు అడ్డుతగులుందనే కారణంగా నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు నులిమి చంపాడు. -
కోల్‌గొట్టారు!
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్: సింగరేణి సంస్థ దళారులకు అక్షయపాత్రగా మారింది. అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు దళారులతో కుమ్మక్కై సింగరేణి సామగ్రిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కార్మికులు చెమటోడ్చి కూడబెట్టిన ఆస్తులను చుక్క చెమట పడకుండా దళారులు దోచుకుంటున్నారు. సింగరేణి నుంచి ఏడాదికి రూ.100 కోట్ల కుపైగా బొగ్గు అక్రమంగా చేతులు మారుతోంది. బొగ్గుతోపాటు ఇనుము, రాగి, బెల్టు కూడా ఏడాది కి రూ.5 కోట్ల వరకు అక్రమంగా అమ్ముకొని దళారు లు సొమ్ము చేసుకుంటున్నారు. సంస్థ ఆస్తులు రక్షించేవారు ఉన్నతాధికారుల కనుసన్నల్లో నడుచుకుంటూ ఉండటంతో సింగరేణి సామగ్రి యథేచ్ఛగా తరలుతున్నాయి. ‘బొగ్గ’వుతున్న ఆస్తులు దేశంలోని వివిధ భారీ పరిశ్రమలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. టెండర్లు నిర్వహించి విక్రయాలు జరుపుతోంది. స్థానిక డీలర్లు టెండర్లు దక్కించుకుని పరిశ్రమలకు గూడ్స్ వ్యాగన్ల ద్వారా బొగ్గును సరఫరా చేస్తారు. ఒక గూడ్స్ రైలులో 59 వ్యాగన్లు ఉంటాయి. దీనిని ఒక ర్యాకు అంటారు. ఒక వ్యాగనులో 80 టన్నుల బొగ్గును నింపాలి. వ్యాగనుకు 15 టన్నుల బొగ్గును తక్కువగా నింపి వే బిల్లు మాత్రం 80 టన్నులు నింపినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం నింపితే ఒక ర్యాకులో 4,720 టన్నులు వెళ్లాలి. 15 టన్నులు తక్కువగా నింపితే ఒక ర్యాకులో 885 టన్నుల బొగ్గు తక్కువగా వెలుతుంది. ఈ విధంగా మిగిలించుకున్న బొగ్గును ఒక ర్యాకుకు సరిపడా తయారు చేసుకుని ఇతర పరిశ్రమలకు టన్నుకు రూ.3,500 చొప్పున రూ.1,65,20,000 అమ్ముకుంటారు. నెలలో ఐదు ర్యాకుల చొప్పున ఏడాదికి 60 ర్యాకుల బొగ్గును అమ్మితే రూ.100 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. కాసులుకురిపిస్తున్న ‘రాగి’ సింగరేణిలోని భారీ యంత్రాలకు కేబుళ్ల ద్వారా విద్యుత్తు సరఫరా అవుతోంది. ఈ కేబుళ్లు అధిక బరువు ఉండటంతోపాటు నాణ్యతగల రాగితో తయారవుతాయి. రాగికి బాగా డిమాండ్ ఉంటుంది. రెండు ఫీట్ల పొడవు కేబుల్‌లో కిలోపైగా రాగి ఉంటుంది. సెలవు రోజుల్లో, యంత్రాలు మరమ్మతు కోసం ఆగినపుడు, విరామ సమయంలో, గనుల ఆవరణలో ఉన్న కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లి కాల్చివేస్తారు. దీంతో కేబుల్‌లో ఉన్న రాగి బయటకు వస్తుంది. ఈ రాగిని దొంగలు కిలో రూ.250 చొప్పున దళారులకు అమ్ముతారు. దళారులు హైదరాబాద్‌లోని బాలానగర్‌లో కిలో రూ.500 అమ్ముకుంటారు. కరిగించని రాగిని మాత్రమే రశీదు లేకుండా బాలానగర్‌లో కొంటారు. దళారులు కనీసం నెలలో పదిహేను సార్లు అయినా హైదరాబాద్‌లో అమ్ముతారు. ఈ విధంగా నెలకు పది క్వింటాళ్ల రాగి అమ్ముతారు. పది క్వింటాళ్లకు కిలో రూ.500 చొప్పున అమ్మితే రూ.5 లక్షలు అవుతాయి. దొంగలకు ఇవ్వగా దళారులకు రూ.2.50 లక్షలు మిగులుతాయి. ఏడాదికి దళారులు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారు. వరంగా మారిన ‘బెల్టు’ భూగర్భ గనులతోపాటు ఓసీపీలలో బొగ్గును బంకర్లలోకి తరలించడానికి బెల్టును ఉపయోగిస్తారు. బెల్టు ఒక ఇంచు మందంతోపాటు రెండున్నర ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఈ బెల్టును దొంగిలించడానికి గోదావరిఖనికి చెందిన ముఠా ఒకటి ఉంది. ఈ ముఠా దొరికి కేసులు గనుక అయితే దళారులే వారిని విడిపించేంత వరకు ఖర్చులు భరిస్తారు. దొంగల వద్ద దళారులు ఒక ఫీటు బెల్టును రూ.250 కొంటారు. ఈ బెల్టును దళారులు తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులోని బియ్యం మిల్లుల యజమానులకు ఒక ఫీటుకు రూ.1000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బెల్టు సైజులుగా కత్తిరించి ట్రాన్సుపోర్టులో గోనె సంచుల ద్వారా పాలకొల్లుకు తరలిస్తారు. కొనుగోలు చేసిన వారు దళారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ట్రాన్సుపోర్టు వారికి రూ.1000 ఇస్తే పాలకొల్లుకు బెల్టు వెలుతుంది. దళారులు నెలకు రూ.10 లక్షలు, ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో వారు కూడా మామూలుగానే తీసుకుంటున్నారు. లక్షణంగా ఇనుము చోరీ బొగ్గు ఉత్పత్తికి ఉపయోగించే ఇనుప సామగ్రిని దొంగలకు కాసులు కురిపిస్తోంది. దొంగలు తస్కరించిన ఇనుమును బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెం ప్రాంతాల్లో కొందరు వ్యాపారస్తులు ఒక కిలోకు రూ.10 చొప్పున కొంటారు. కొనుగోలు చేసిన ఇనుమును హైదరాబాద్‌లో కిలోకు రూ.15 చొప్పున అమ్ముకుంటారు. నెలకు ఈ ప్రాంతాల నుంచి పది లారీల ఇనుము తరలుతోంది. ఏడాదికి రూ.18 లక్షల ఇనుప సామగ్రి దొంగలపాలవుతోంది. ఆస్తుల రక్షణలో అధికారులు విఫలం సింగరేణి ఆస్తులు కాపాడటానికి ఎస్అండ్పీసీ సిబ్బంది సుమారు 2వేల మంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది 800 మంది ఉన్నారు. ఎస్అండ్పీసీ సిబ్బందికి నెలకు సుమారు రూ.6 కోట్లు, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సుమారు రూ.2.50 కోట్లు సింగరేణి వేతనాల రూపంలో చెల్లిస్తోంది. అయినప్పటికీ చోరీలు ఆగడం లేదు. ఇప్పటికైన సింగరేణి రూ.కోట్ల ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది. -
ఎనీ టైంభయమే..
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఏటీఎం.. ఎనీ టైం మనీ. వీటి సేవలు బాగానే ఉన్నా.. డబ్బులు డ్రా చేసుకునే వేళ భద్రత మాత్రం కానరావడం లేదు. మహానగరమైన బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ మహిళపై అగంతకుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ముఖం, తలపై తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన జిల్లా వాసులనూ భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని ఏటీఎంల వద్ద ఎంతవరకు భద్రత ఉందనేది వారిలో ప్రశ్న తలెత్తుతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్, రూరల్ బ్యాంకులన్నీ కలిపి 237 ఉన్నాయి. రూరల్ బ్యాంకులకు ఏటీఎం సదుపాయం లేదు. మిగతా బ్యాంకులకు సంబంధించి 112 ఏటీఎం జిల్లాలో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 53, ఆంధ్రాబ్యాంక్ 16, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 8, ఐసీఐసీఐ 7, హెచ్డీఎఫ్సీ 6, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4, యాక్సెస్ 2, కరూర్‌వైశ్య, లక్ష్మివిలాస్ రెండేసి, మిగతా బ్యాంకులు ఒక్కో ఏటీఎంలు కలిగి ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ ఏటీఎం కేంద్రాల వద్దే బ్యాంక్ యాజమాన్యాలు సెక్యూరిటీ గార్డులను నియమిం చింది. వివిధ ఏజెన్సీల నుంచి సదరు సెక్యూరిటీ గార్డులను బ్యాంక్‌లు నియమించుకున్నాయి. ప్రభుత్వ ఏటీఎం కేంద్రా ల వద్ద సెక్యూరిటీ గార్డులు ప్రస్తుతం కనిపించడంలేదు. గతంలో సెక్యూరిటీ గార్డులను నియమించినా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో వారిని తొలగించారు. ఏటీఎం కార్డు వినియోగంపై అవగాహనలేని వినియోగదారు లను సెక్యూరిటీగార్డు బోల్తా కొట్టించి డబ్బులు డ్రా చేయడం వంటి సంఘటనలు గతంలో జరిగిన నేపథ్యంలో పలు ప్రభు త్వ బ్యాంకులు సెక్యూరిటీగార్డులను తొలగించారు. ఏటీఎం కేంద్రాల్లో ఏసీ మిషన్లు మూలనపడ్డాయి. సీసీ కెమెరాలు కూ డా సరిగా పనిచేయడం లేదు. కేంద్రాలకు గ్లాస్ డోర్ ఆటోమెటిక్‌గా మూసుకునే పరిస్థితి లేక ఎప్పుడూ తెరిచే ఉంటున్నా యి. ఈ నేపథ్యంలో అగంతకులు నేరుగా చొచ్చుకు వచ్చే ప్ర మాదమూ లేకపోలేదు. రూ.కోట్ల లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు ఏటీఎం పరంగా మాత్రం సెక్యూరిటీగార్డులను నియమించకపోవడం, కనీస వసతులు కల్పించకపోవడంపై వినియోగదారుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో వైద్య విద్యార్థినులు అక్కడి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుంటారు. ఆ పరిసరాల్లో రా త్రివేళ చీకటి ఆవహించి ఉంటుంది. అక్కడ కూడా సెక్యూరిటీగార్డులు లేకపోవడం భద్రత తేటతెల్లమవుతోంది. అనేక ఏటీఎంలలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాగా సీసీ కెమెరాలకు సంబంధించి అలర్ట్ సిస్టమ్ కూడా లేకపోవడం దొం గల పనికి సులువవుతోంది. పోలీస్ పెట్రోలింగ్ పార్టీలు ఏటీఎంలపై కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మచ్చుకు కొన్ని.. ఆదిలాబాద్‌లోని శివాజీచౌక్ ఏటీఎం కేంద్రం వద్దకు ఆరు నెలల కిందట జైనథ్‌కు చెందిన ఓ వృద్ధుడు తన మనుమడుతో కలిసి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చాడు. ఆయనకు డబ్బులు తీయరాకపోవడం, మనుమడికి కూడా అవగాహన లేకపోవడంతో సమీపంలోని మరో వ్యక్తి వారికి డబ్బులు డ్రా చేసి ఇచ్చాడు. ఆ క్రమంలోనే వారి కార్డును మార్చేసి తన దగ్గరున్న మరో కార్డును వారికిచ్చి అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత ఆర్మూర్ బ్రాంచ్‌లో ఆ అకౌంట్ నంబర్ నుంచి తన బినామీ అకౌంట్‌కు రూ.40 వేల డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, బ్యాంక్ సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజ్ అందజేశారు. అయితే ఇప్పటివరకు కేసు మిస్టరీ వీడలేదు. నేరస్తుడు పట్టుబడలేదు. ఈ నేపథ్యంలో ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీగార్డు ఆవశ్యకత ఎంతగానో అవసరం కానుంది.