మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్: సింగరేణి సంస్థ దళారులకు అక్షయపాత్రగా మారింది. అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు దళారులతో కుమ్మక్కై సింగరేణి సామగ్రిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కార్మికులు చెమటోడ్చి కూడబెట్టిన ఆస్తులను చుక్క చెమట పడకుండా దళారులు దోచుకుంటున్నారు. సింగరేణి నుంచి ఏడాదికి రూ.100 కోట్ల కుపైగా బొగ్గు అక్రమంగా చేతులు మారుతోంది.
బొగ్గుతోపాటు ఇనుము, రాగి, బెల్టు కూడా ఏడాది కి రూ.5 కోట్ల వరకు అక్రమంగా అమ్ముకొని దళారు లు సొమ్ము చేసుకుంటున్నారు. సంస్థ ఆస్తులు రక్షించేవారు ఉన్నతాధికారుల కనుసన్నల్లో నడుచుకుంటూ ఉండటంతో సింగరేణి సామగ్రి యథేచ్ఛగా తరలుతున్నాయి.
‘బొగ్గ’వుతున్న ఆస్తులు
దేశంలోని వివిధ భారీ పరిశ్రమలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. టెండర్లు నిర్వహించి విక్రయాలు జరుపుతోంది. స్థానిక డీలర్లు టెండర్లు దక్కించుకుని పరిశ్రమలకు గూడ్స్ వ్యాగన్ల ద్వారా బొగ్గును సరఫరా చేస్తారు. ఒక గూడ్స్ రైలులో 59 వ్యాగన్లు ఉంటాయి. దీనిని ఒక ర్యాకు అంటారు. ఒక వ్యాగనులో 80 టన్నుల బొగ్గును నింపాలి. వ్యాగనుకు 15 టన్నుల బొగ్గును తక్కువగా నింపి వే బిల్లు మాత్రం 80 టన్నులు నింపినట్టుగా చూపిస్తున్నారు.
నిబంధనల ప్రకారం నింపితే ఒక ర్యాకులో 4,720 టన్నులు వెళ్లాలి. 15 టన్నులు తక్కువగా నింపితే ఒక ర్యాకులో 885 టన్నుల బొగ్గు తక్కువగా వెలుతుంది. ఈ విధంగా మిగిలించుకున్న బొగ్గును ఒక ర్యాకుకు సరిపడా తయారు చేసుకుని ఇతర పరిశ్రమలకు టన్నుకు రూ.3,500 చొప్పున రూ.1,65,20,000 అమ్ముకుంటారు. నెలలో ఐదు ర్యాకుల చొప్పున ఏడాదికి 60 ర్యాకుల బొగ్గును అమ్మితే రూ.100 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.
కాసులుకురిపిస్తున్న ‘రాగి’
సింగరేణిలోని భారీ యంత్రాలకు కేబుళ్ల ద్వారా విద్యుత్తు సరఫరా అవుతోంది. ఈ కేబుళ్లు అధిక బరువు ఉండటంతోపాటు నాణ్యతగల రాగితో తయారవుతాయి. రాగికి బాగా డిమాండ్ ఉంటుంది. రెండు ఫీట్ల పొడవు కేబుల్‌లో కిలోపైగా రాగి ఉంటుంది. సెలవు రోజుల్లో, యంత్రాలు మరమ్మతు కోసం ఆగినపుడు, విరామ సమయంలో, గనుల ఆవరణలో ఉన్న కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లి కాల్చివేస్తారు. దీంతో కేబుల్‌లో ఉన్న రాగి బయటకు వస్తుంది. ఈ రాగిని దొంగలు కిలో రూ.250 చొప్పున దళారులకు అమ్ముతారు.
దళారులు హైదరాబాద్‌లోని బాలానగర్‌లో కిలో రూ.500 అమ్ముకుంటారు. కరిగించని రాగిని మాత్రమే రశీదు లేకుండా బాలానగర్‌లో కొంటారు. దళారులు కనీసం నెలలో పదిహేను సార్లు అయినా హైదరాబాద్‌లో అమ్ముతారు. ఈ విధంగా నెలకు పది క్వింటాళ్ల రాగి అమ్ముతారు. పది క్వింటాళ్లకు కిలో రూ.500 చొప్పున అమ్మితే రూ.5 లక్షలు అవుతాయి. దొంగలకు ఇవ్వగా దళారులకు రూ.2.50 లక్షలు మిగులుతాయి. ఏడాదికి దళారులు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారు.
వరంగా మారిన ‘బెల్టు’
భూగర్భ గనులతోపాటు ఓసీపీలలో బొగ్గును బంకర్లలోకి తరలించడానికి బెల్టును ఉపయోగిస్తారు. బెల్టు ఒక ఇంచు మందంతోపాటు రెండున్నర ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఈ బెల్టును దొంగిలించడానికి గోదావరిఖనికి చెందిన ముఠా ఒకటి ఉంది. ఈ ముఠా దొరికి కేసులు గనుక అయితే దళారులే వారిని విడిపించేంత వరకు ఖర్చులు భరిస్తారు. దొంగల వద్ద దళారులు ఒక ఫీటు బెల్టును రూ.250 కొంటారు.
ఈ బెల్టును దళారులు తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులోని బియ్యం మిల్లుల యజమానులకు ఒక ఫీటుకు రూ.1000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బెల్టు సైజులుగా కత్తిరించి ట్రాన్సుపోర్టులో గోనె సంచుల ద్వారా పాలకొల్లుకు తరలిస్తారు. కొనుగోలు చేసిన వారు దళారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ట్రాన్సుపోర్టు వారికి రూ.1000 ఇస్తే పాలకొల్లుకు బెల్టు వెలుతుంది. దళారులు నెలకు రూ.10 లక్షలు, ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో వారు కూడా మామూలుగానే తీసుకుంటున్నారు.
లక్షణంగా ఇనుము చోరీ
బొగ్గు ఉత్పత్తికి ఉపయోగించే ఇనుప సామగ్రిని దొంగలకు కాసులు కురిపిస్తోంది. దొంగలు తస్కరించిన ఇనుమును బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెం ప్రాంతాల్లో కొందరు వ్యాపారస్తులు ఒక కిలోకు రూ.10 చొప్పున కొంటారు. కొనుగోలు చేసిన ఇనుమును హైదరాబాద్‌లో కిలోకు రూ.15 చొప్పున అమ్ముకుంటారు. నెలకు ఈ ప్రాంతాల నుంచి పది లారీల ఇనుము తరలుతోంది. ఏడాదికి రూ.18 లక్షల ఇనుప సామగ్రి దొంగలపాలవుతోంది.
ఆస్తుల రక్షణలో అధికారులు విఫలం
సింగరేణి ఆస్తులు కాపాడటానికి ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది సుమారు 2వేల మంది, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది 800 మంది ఉన్నారు. ఎస్‌అండ్‌పీసీ సిబ్బందికి నెలకు సుమారు రూ.6 కోట్లు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సుమారు రూ.2.50 కోట్లు సింగరేణి వేతనాల రూపంలో చెల్లిస్తోంది. అయినప్పటికీ చోరీలు ఆగడం లేదు. ఇప్పటికైన సింగరేణి రూ.కోట్ల ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది.
కోల్‌గొట్టారు!
Published Tue, Jan 21 2014 5:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement