కరీంనగర్: సింగరేణి రామగుండం రీజియన్ ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని ఓసీపీల్లో ఉన్న కాపర్ కేబుళ్లే లక్ష్యంగా దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. గతంలో స్క్రాప్ యార్డులపై కన్నేసిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లి, అక్రమ మార్గాన విక్రయించి, సొమ్ము చేసుకునేవారు.
చోరీలను నివారించేందుకు యాజమాన్యం స్క్రాప్ యార్డులు, గనుల వద్ద సెక్క్యూరిటీ పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. స్క్రాప్ నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఈ చోరీలు తగ్గిపోయాయి. అంతేకాకుండా స్క్రాప్ చోరీలవల్ల ప్రయాస ఎక్కువగా ఉండటం, లాభాలు కూడా తక్కువగా ఉండటంతో దొంగలు తమ రూట్ మార్చారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వచ్చే కాపర్ కేబుళ్లపై కన్నేశారు.
భారీ యంత్రాల పవర్ కేబుళ్లు చోరీ
వర్షాకాలం కావడంతో ఓసీపీ క్వారీలోని పనిస్థలాల వద్దకు సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి అధికారులు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇదు అదనుగా దొంగలు రెచ్చి పోతున్నారు. విద్యుత్‌తో నడిచే భారీ యంత్రాలకు ఉన్న పెద్ద కాపర్ కేబుళ్లను కట్ చేసుకొని, ఎత్తుకెళ్తున్నారు.
కొన్ని సందర్భాల్లో హెచ్‌టీ లైన్ విద్యుత్ సరఫరా ఉండగానే పెద్ద గొడ్డళ్లతో కేబుళ్లను నరికి, క్షణాల్లో వాహనంలో వేసుకొని, పరారవుతున్నారు. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టంతోపాటు యంత్రానికి విద్యుత్ లేక పని నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
దొరికినా చర్యలు లేవు
దొంగతనాలు జరిగిన కొన్ని సందర్భాల్లో దొంగలు రెడ్‌హ్యాండెడ్‌గా సెక్యూరిటీ సిబ్బందికి దొరికినా సరైన చర్యలు లేకపోవడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సింగరేణి సంస్థకు, పోలీసు శాఖకు మధ్య సరైన సమన్వయం లేక దొంగలు తిరిగి అదే పనికి అలవాటు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
స్క్రాప్, కాపర్ కేబుళ్ల ముఠాల వివరాలు, విషయాలు తెలిసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడంతో సింగరేణిలో చోరీలకు అడ్డుకట్ట పడటం లేదన్న ఆరోపణలున్నాయి.
ఇంటి దొంగల అండతోనే!
ఇంటి దొంగల అండతో కాపర్ కేబుళ్ల చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో కొంత ముట్టజెప్పి, చోరీ సమయంలో సహకరించాలని కోరడంతో కొందరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే స్టోర్స్‌లోని 600 మీటర్ల కాపర్ కేబుల్ దొంగతనం జరిగిందని పలువురు అంటున్నారు. దీనిపై కొందరికి సస్పెండ్ కమ్ పెండింగ్ ఎంకై ్వరీ పెట్టి, విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment