strap
-
ఒంటరి అమ్మ బతుకు పోరు
27 ఏళ్ల చంచల్ శర్మ ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుకు తెస్తోంది. ఝాన్సీ తన బిడ్డను కట్టుకుని శత్రువుతో యుద్ధం చేస్తే చంచల్ తన బిడ్డను కట్టుకుని బతుకుపోరు చేస్తోంది. గర్భంతో ఉండగా భర్త నుంచి విడిపోయిన చంచల్ బిడ్డ పుట్టాక ఏడుస్తూ కూచోలేదు. బతకాలని బిడ్డను బతికించుకోవాలని సంకల్పించింది. ఆమె కథ ఇప్పడు నెట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీ– నోయిడాలో చంచల్ శర్మ నడిపే ఈ ఆటో రిక్షా అందరికీ తెలుసు. దాని డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉండే ఆమెను అందరూ మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా చూస్తు ఉంటారు. గౌరవంగా చూస్తూ ఉంటారు. దాని కారణం ‘కంగారు’లాగా ఆమె కూడా తన ఒక సంవత్సరం కొడుకును పొట్టకు దగ్గరగా కట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉండటమే. పల్లెల్లో బిడ్డను నడుముకు కట్టుకుని కూలి పనులు చేసే తల్లులు మనకు కొత్త కాదు. కాని ఒక ఆటో రిక్షా నడుపుతూ ఇలా నగరంలో ఒక ఒంటరి తల్లి తన బతుకు కోసం సంఘర్షించడం మాత్రం కొత్త. ఇటీవల ఈమె గురించి మీడియాలో వస్తే సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడారు. మెచ్చుకున్నారు. ఎందుకు? జీవితం సవాలు విసిరినప్పుడు చేతనైన జవాబు చెప్పాలని చంచల్ అనుకోవడమే. భర్త నుంచి విడిపోయి... 27 ఏళ్ల చంచల్ శర్మ పెళ్లయ్యి గర్భం వచ్చాక భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆమెకు తల్లి తప్ప ఎవరూ లేరు. బతుకు తెరువు లేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒకవైపు భర్త తోడు లేకపోవడం, మరోవైపు బిడ్డ బాధ్యత ఆమెను సతమతం చేశాయి. జీవితంలో ఓడిపోవడమా? పోరాడి నిలవడమా? రెండో మార్గమే ఎంచుకుంది. కొడుకు నెలల బిడ్డగా ఉండగా తల్లి దగ్గరే వదిలి ఈ ఆటో రిక్షా నడపడం మొదలెట్టింది. కాని ఇప్పుడు వాడికి సంవత్సరం నిండింది. తల్లి కోసం బెంగటిల్లుతుంటాడు. అదీగాక తల్లి ఆ పిల్లాణ్ణి చూసుకోలేకపోతోంది. క్రష్‌లో వేద్దామంటే అందుకు కట్టాల్సినంత డబ్బు తన వద్ద లేదు. పైగా క్రష్‌లు కూడా బాగా చార్జ్ చేస్తున్నాయి ఢిల్లీలో. అందుకే తనతోపాటే కొడుకును నడుముకు కట్టుకుని డ్యూటీ చేయాలని నిశ్చయించుకుంది చంచల్ శర్మ. 600 సంపాదన... ఉదయం ఆరున్నరకు కొడుకుతో పాటు డ్యూటీ ఎక్కుతుంది చంచల్ శర్మ. మధ్యాహ్నం వరకూ ఆటో నడిపి ఇల్లు చేరుతుంది. కొడుక్కు స్నానం చేయించి, తినిపించుకుని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ డ్యూటీ ఎక్కుతుంది కొడుకుతో. రాత్రి ఎనిమిది వరకూ పని చేస్తుంది. మధ్యలో కొడుకు ఆకలికి ఒక పాల సీసా పెట్టుకుంటుంది. ఇంత శ్రమ చేస్తే ఆమెకు రోజుకు 600 మిగులుతున్నాయి. ఒక్కోసారి కొడుకు పొట్ట మీద నిద్రపోతాడు. ఒక్కోసారి మేలుకుని హుషారుగా ఉంటాడు. ఒక్కోసారి మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. కాని పాసింజర్లు విసుక్కోరు. ఆమెను సానుభూతితో అర్థం చేసుకుంటారు. మహిళా పాసింజర్లయితే ఈమె ఆటోనే వెతికి ఎక్కుతారు.. సాయం చేసినట్టు ఉంటుందని. ఎండాకాలం వస్తే మాత్రం బిడ్డను తీసుకుని తిరగడం కష్టం అంటుంది చంచల్. ఆ టైమ్‌లో తల్లి మీద ఆధారపడాల్సి వస్తుంది అంటుంది. ‘నా బిడ్డ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటుంది చంచల్ శర్మ. ఒంటరి స్త్రీ... సింగిల్ మదర్‌గా జీవించడంలో బెంబేలెత్తాల్సిన పని లేదు. సమాజంలో ఇప్పుడు సింగిల్ మదర్‌కు అండ దొరుకుతుంది. వారు కష్టపడి పని చేయాలనుకుంటే సాయం చేసే వారూ ఉన్నారు. కావలసిందల్లా ఎదురొడ్డే తెగువే. చంచల్ శర్మను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతున్నారు. -
బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు
మహబూబాబాద్ : బెల్ట్‌షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ తిరుపతి తెలిపారు. ఆయన కథనం ప్రకా రం.. ఉన్నతాధికారుల అదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, ఎస్టీఎఫ్ ఆద్వర్యంలో మానుకోటలోని భవానినగర్ తండా, మండలంలోని వేంనూర్ దాని శివారు నేతాజీతండా, కేసముద్రంలోని రంగాపురం, నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు, గ్రామాల్లోని బెల్ట్‌షాపులపై దాడులు నిర్వహించారు. 14 కేసులు నమోదు చేశా రు. 223 క్వార్టర్ బాటిళ్లు, 16 ఆఫ్ బాటిళ్లు, 5 పుల్‌బాటిళ్లు, 90 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అలాగే పట్టణంలోని వైన్స్‌లపై కూడా దాడులు నిర్వహించి బాటిళ్ల లేబుల్స్, స్టిక్కర్లను పరిశీలించారు. ఆ మద్యం ఆ షాపులకు చెందినవా లేదా అనే కోణంలో తనీఖీలు చేశారు. అవి సక్రమంగానే ఉన్నట్లు ఆయన వివరించారు. దాడుల్లో ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి, సీఐలు కె.తిరుపతి, చంద్రశేఖర్, ఎసైలు రవికుమార్, మనోహర్, లింగయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
టక్కు చెదరకుండా ‘స్ట్రాప్ గాడ్జెట్’
లండన్: టక్ చేసుకొని తిరిగే వారిని రోజు ఎంతోమందిని చూస్తుంటాం. ఎంత వారికైనా ఏదో సందర్భంలో ప్యాంట్ నుంచి చొక్కా బయటకు రావడం, దాన్ని ఎప్పటికప్పుడు లోపలకి దోపుకోలేక ఇబ్బందులు పడడమూ చూస్తాం. మొహమాటగాళ్లయితే టాయ్‌లెట్ ఎక్కడుందో వెతికి పట్టుకొని మరి అందులో దూరి టక్‌ను సరి చేసుకోవడమూ పరిపాటే. ముఖ్యంగా సేల్స్‌మేన్ జాబులు చేసే వారికి ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువ. అందుకనే ‘ఫ్యాషన్ జిగ్మో’ బ్రాండ్ కంపెనీ ‘సిగ్నేచర్ షర్ట్ స్టేస్’ పేరిట కొత్త గాడ్జెట్‌ను తీసుకొచ్చింది. సుతిమెత్తని ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ ‘పట్టీ’ని ధరిస్తే ఇక ఈ ఇబ్బందులన్నీ పోయినట్లే. చొక్కాకు, కాళ్ల సాక్సులను పట్టి ఉంచే ఈ పట్టీకి అవసరానికి తగ్గట్టు సాగే గుణమూ కూడా ఉంది. టక్ చేసినప్పుడు చొక్కా చెదిరిపోకుండా ఉండడమే కాకుండా దీని వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. వదులుగా ఉన్న సాక్సు కిందకు జారకుండా కూడా ఇది పట్టి ఉంచుతుంది. ఇది ధరించిన వారు కారులోకి ఎన్నిసార్లు ఎక్కినా, దిగినా, మెట్లెక్కినా, స్టూలెక్కి ఎత్తున ఉన్న వస్తువులను తీసినా టక్ చెదరదని కంపెనీ వాళ్లు గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. ఈ స్ట్రాప్స్ ఒకే సైజులో ఉన్నప్పటికీ దానికున్న సాగే గుణం వల్ల పొడుగువారికి, పొట్టి వారికీ సరిపోతుంది. ప్రస్తుతం మూడు రంగుల్లో లభిస్తున్న ఈ పట్టీ ధర 1300 రూపాయలు. కంపెనీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే సౌలభ్యం ఉంది. -
కోల్‌గొట్టారు!
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్: సింగరేణి సంస్థ దళారులకు అక్షయపాత్రగా మారింది. అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు దళారులతో కుమ్మక్కై సింగరేణి సామగ్రిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కార్మికులు చెమటోడ్చి కూడబెట్టిన ఆస్తులను చుక్క చెమట పడకుండా దళారులు దోచుకుంటున్నారు. సింగరేణి నుంచి ఏడాదికి రూ.100 కోట్ల కుపైగా బొగ్గు అక్రమంగా చేతులు మారుతోంది. బొగ్గుతోపాటు ఇనుము, రాగి, బెల్టు కూడా ఏడాది కి రూ.5 కోట్ల వరకు అక్రమంగా అమ్ముకొని దళారు లు సొమ్ము చేసుకుంటున్నారు. సంస్థ ఆస్తులు రక్షించేవారు ఉన్నతాధికారుల కనుసన్నల్లో నడుచుకుంటూ ఉండటంతో సింగరేణి సామగ్రి యథేచ్ఛగా తరలుతున్నాయి. ‘బొగ్గ’వుతున్న ఆస్తులు దేశంలోని వివిధ భారీ పరిశ్రమలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. టెండర్లు నిర్వహించి విక్రయాలు జరుపుతోంది. స్థానిక డీలర్లు టెండర్లు దక్కించుకుని పరిశ్రమలకు గూడ్స్ వ్యాగన్ల ద్వారా బొగ్గును సరఫరా చేస్తారు. ఒక గూడ్స్ రైలులో 59 వ్యాగన్లు ఉంటాయి. దీనిని ఒక ర్యాకు అంటారు. ఒక వ్యాగనులో 80 టన్నుల బొగ్గును నింపాలి. వ్యాగనుకు 15 టన్నుల బొగ్గును తక్కువగా నింపి వే బిల్లు మాత్రం 80 టన్నులు నింపినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం నింపితే ఒక ర్యాకులో 4,720 టన్నులు వెళ్లాలి. 15 టన్నులు తక్కువగా నింపితే ఒక ర్యాకులో 885 టన్నుల బొగ్గు తక్కువగా వెలుతుంది. ఈ విధంగా మిగిలించుకున్న బొగ్గును ఒక ర్యాకుకు సరిపడా తయారు చేసుకుని ఇతర పరిశ్రమలకు టన్నుకు రూ.3,500 చొప్పున రూ.1,65,20,000 అమ్ముకుంటారు. నెలలో ఐదు ర్యాకుల చొప్పున ఏడాదికి 60 ర్యాకుల బొగ్గును అమ్మితే రూ.100 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. కాసులుకురిపిస్తున్న ‘రాగి’ సింగరేణిలోని భారీ యంత్రాలకు కేబుళ్ల ద్వారా విద్యుత్తు సరఫరా అవుతోంది. ఈ కేబుళ్లు అధిక బరువు ఉండటంతోపాటు నాణ్యతగల రాగితో తయారవుతాయి. రాగికి బాగా డిమాండ్ ఉంటుంది. రెండు ఫీట్ల పొడవు కేబుల్‌లో కిలోపైగా రాగి ఉంటుంది. సెలవు రోజుల్లో, యంత్రాలు మరమ్మతు కోసం ఆగినపుడు, విరామ సమయంలో, గనుల ఆవరణలో ఉన్న కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లి కాల్చివేస్తారు. దీంతో కేబుల్‌లో ఉన్న రాగి బయటకు వస్తుంది. ఈ రాగిని దొంగలు కిలో రూ.250 చొప్పున దళారులకు అమ్ముతారు. దళారులు హైదరాబాద్‌లోని బాలానగర్‌లో కిలో రూ.500 అమ్ముకుంటారు. కరిగించని రాగిని మాత్రమే రశీదు లేకుండా బాలానగర్‌లో కొంటారు. దళారులు కనీసం నెలలో పదిహేను సార్లు అయినా హైదరాబాద్‌లో అమ్ముతారు. ఈ విధంగా నెలకు పది క్వింటాళ్ల రాగి అమ్ముతారు. పది క్వింటాళ్లకు కిలో రూ.500 చొప్పున అమ్మితే రూ.5 లక్షలు అవుతాయి. దొంగలకు ఇవ్వగా దళారులకు రూ.2.50 లక్షలు మిగులుతాయి. ఏడాదికి దళారులు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారు. వరంగా మారిన ‘బెల్టు’ భూగర్భ గనులతోపాటు ఓసీపీలలో బొగ్గును బంకర్లలోకి తరలించడానికి బెల్టును ఉపయోగిస్తారు. బెల్టు ఒక ఇంచు మందంతోపాటు రెండున్నర ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఈ బెల్టును దొంగిలించడానికి గోదావరిఖనికి చెందిన ముఠా ఒకటి ఉంది. ఈ ముఠా దొరికి కేసులు గనుక అయితే దళారులే వారిని విడిపించేంత వరకు ఖర్చులు భరిస్తారు. దొంగల వద్ద దళారులు ఒక ఫీటు బెల్టును రూ.250 కొంటారు. ఈ బెల్టును దళారులు తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులోని బియ్యం మిల్లుల యజమానులకు ఒక ఫీటుకు రూ.1000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బెల్టు సైజులుగా కత్తిరించి ట్రాన్సుపోర్టులో గోనె సంచుల ద్వారా పాలకొల్లుకు తరలిస్తారు. కొనుగోలు చేసిన వారు దళారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ట్రాన్సుపోర్టు వారికి రూ.1000 ఇస్తే పాలకొల్లుకు బెల్టు వెలుతుంది. దళారులు నెలకు రూ.10 లక్షలు, ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో వారు కూడా మామూలుగానే తీసుకుంటున్నారు. లక్షణంగా ఇనుము చోరీ బొగ్గు ఉత్పత్తికి ఉపయోగించే ఇనుప సామగ్రిని దొంగలకు కాసులు కురిపిస్తోంది. దొంగలు తస్కరించిన ఇనుమును బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెం ప్రాంతాల్లో కొందరు వ్యాపారస్తులు ఒక కిలోకు రూ.10 చొప్పున కొంటారు. కొనుగోలు చేసిన ఇనుమును హైదరాబాద్‌లో కిలోకు రూ.15 చొప్పున అమ్ముకుంటారు. నెలకు ఈ ప్రాంతాల నుంచి పది లారీల ఇనుము తరలుతోంది. ఏడాదికి రూ.18 లక్షల ఇనుప సామగ్రి దొంగలపాలవుతోంది. ఆస్తుల రక్షణలో అధికారులు విఫలం సింగరేణి ఆస్తులు కాపాడటానికి ఎస్అండ్పీసీ సిబ్బంది సుమారు 2వేల మంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది 800 మంది ఉన్నారు. ఎస్అండ్పీసీ సిబ్బందికి నెలకు సుమారు రూ.6 కోట్లు, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సుమారు రూ.2.50 కోట్లు సింగరేణి వేతనాల రూపంలో చెల్లిస్తోంది. అయినప్పటికీ చోరీలు ఆగడం లేదు. ఇప్పటికైన సింగరేణి రూ.కోట్ల ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది.