సాక్షి, ఒంగోలు: ‘ఇటీవల గుడ్లూరు మండలం శాలిపేట గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై సుబ్బారావు అనే కామాంధుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు.
హనుమంతునిపాడు మండలం లింగంగుంటలో ఎనిమిదేళ్ల చిన్నారిపై బ్రహ్మనాయుడు అనే రాక్షసుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
పొదిలి మండలం జువ్వలేరు గ్రామంలో ఇటీవల మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిపై ఇద్దరు లైంగికదాడి చేశారు.
పొదిలి పట్టణం విశ్వనాథపురంలో పట్టపగలే ఇంట్లో ఉన్న ఒక మహిళను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యచేసి ఆమె మెడలో ఉన్న ఆభరణాలు, చేతి గాజులు అపహరించుకెళ్లాడు.
ఒంగోలు నగరంలోని త్రోవగుంట వద్ద బిహ ర్భూమికి వెళ్లిన సుశీలమ్మ అనే మహిళను దారుణంగా హతమార్చారు.’
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి దారుణాలు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఊహ తెలియని చిన్నారులపై సైతం కామాంధులు లైంగికదాడులకు పాల్పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ప్రేమ పేరుతో వేధింపులు నిత్యకృత్యం.
నిర్భయ వంటి చట్టాలు ఎన్ని వచ్చినా ‘మేమింతే..మారమంతే’ అంటూ కొన్ని మానవ మృగాలు బరితెగిస్తున్నాయి. నిత్యం ఎక్కడోచోట మహిళల మెడల్లో గొలుసుల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పసిబిడ్డకు అన్నం పెడుతున్నా... ఇంటి ముంగిట ముగ్గు వేస్తున్నా.... చిన్నారులను బడి నుంచి తీసుకువెళుతున్నా.. చైన్‌స్నాచింగ్ దొంగలు కళ్లు మూసి తెరిచే లోగా బంగారు గొలుసులు తెంపుకుని మాయమవుతున్నారు.
ఉద్యోగినులకూ తప్పని వేధింపులు: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇక గృహ హింసకు కొదవే లేదు. వరకట్న వేధింపులు తాళలేక ఎంతోమంది యువతులు విగతజీవులవుతున్నారు. మరోవైపు అనుమానపు మృగాళ్లతో సంసారాలు ఛిద్రమవడమేకాక పిల్లలు అనాథలవుతున్నారు.
తల్లి, తండ్రి తరువాత స్థానంలో ఉండే గురువులు సైతం కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన చిన్నారులపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాలు చట్టుబండలవుతున్నాయే తప్ప వారికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు.
జిల్లాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు తదితర కేసులు పోలీసు రికార్డుల్లో నమోదయ్యేవి కొన్నే. పరువు మర్యాదల సమస్యతో వెలుగులోకి రానివి కోకొల్లలు. గతేడాది 72 మంది మహిళలపై లైంగికదాడులకు పాల్పడిన వారు జిల్లా జైలులో రిమాండ్‌కు వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రక్షక భటులే భక్షకులైతే..?
మహిళలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షకులుగా మారుతున్నారు. తెనాలి రైల్వే పోలీసుగా పనిచేస్తున్న నగరానికి చెందిన ఓ ప్రబుద్ధుడు సౌత్‌బైపాస్ రోడ్డు సమీపంలో తన స్నేహితుడితో మాట్లాడుతున్న ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిని ఇంటి వద్ద దింపుతానంటూ నమ్మకంగా మోటార్ బైక్ ఎక్కించుకుని జన సంచారం లేని ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఇటీవల నాగులుప్పలపాడు పోలీసుస్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీమన్నారాయణ అనే హోంగార్డు తన సహచర హోంగార్డుతో ఐదేళ్లపాటు సహజీవనం చేస్తూ తాను మరో పెళ్లి చేసుకునేందుకు అడ్డుతగులుందనే కారణంగా నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు నులిమి చంపాడు.
‘నిర్భయ’మేదీ..?
Published Wed, Jan 29 2014 4:11 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement