ఉత్తర్వుల వక్రీకరణలో.. ఆంతర్యమేమిటి రామచంద్రా..! | No - Register little degree sup-Books | Sakshi
Sakshi News home page

ఉత్తర్వుల వక్రీకరణలో.. ఆంతర్యమేమిటి రామచంద్రా..!

Published Thu, Jul 17 2014 3:13 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

ఉత్తర్వుల వక్రీకరణలో.. ఆంతర్యమేమిటి రామచంద్రా..! - Sakshi

ఉత్తర్వుల వక్రీకరణలో.. ఆంతర్యమేమిటి రామచంద్రా..!

  •      ఓటేరు చెరువును దారాదత్తం చేయడంలో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం
  •      ఏ-రిజిష్టర్ మేరకే పట్టా పాసుపుస్తకాలు
  •      ఇవ్వాలన్న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ
  •      ఉత్తర్వులను వక్రీకరించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలకు కట్టబెట్టిన వైనం
  •      సీఎంవో ఒత్తిడి మేరకే దుస్సాహసానికి పాల్పడ్డారంటోన్న అధికారవర్గాలు
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి : చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకుని తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పరిధిలో సర్వే నెంబరు 377లో 17.18 ఎకరాల ఓటేరు చెరువు శిఖం భూమిని కొట్టేయడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు పథకం వేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆ మాజీ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయన పంచన చేరి ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేలా ఉత్తర్వులు ఇప్పించుకున్నారు.

    ఎన్నికలకు ముందు సైకిలెక్కి చంద్రబాబుతో జతకట్టి కిరణ్ సర్కారు జారీచేసిన ఉత్తర్వులను ఇప్పుడు అమలు చేయించుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పును తుంగలో తొక్కుతూ రూ.350 కోట్ల విలువైన 17.18 ఎకరాల చెరువు శిఖం భూమిని సొంతం చేసుకోవడాన్ని ‘భూదోపిడీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ వెలికితీసిన విషయం విదితమే. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ సిద్ధార్థ జైన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి శేషయ్యను విచారణ అధికారిగా నియమించారు.

    టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలైన డి.వెంకట్రామనాయుడు మరో 12 మంది ఈ ఏడాది జనవరి 4న సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌లు ఇప్పించాలని అప్పటి రెవెన్యూమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని పరిశీలించాలని అప్పటి కలెక్టర్ కె.రాంగోపాల్‌కు జనవరి 10న రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్.మీనా పంపారు. ఆ వినతిపత్రంపై తిరుపతి రూరల్ తహశీల్దార్ జనవరి 24న, తిరుపతి ఆర్డీవో జనవరి 30న క్షేత్రస్థాయిలో విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక పంపారు. నివేదిక ప్రకారం 377 సర్వే నెంబరు పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం అని తేల్చి ప్రభుత్వానికి నివేదిక పంపారు.
     
    ఇంతలోనే అంత తేడానా..!

     
    రెవెన్యూశాఖకు ఏ-రిజిష్టరే ప్రామాణికం. బ్రిటీషు అధికారులు 1886లో తొలిసారి భూములను సర్వే చేసి ఏ-రిజిష్టర్ రూపొందించారు. దీని ప్రకారం 377 సర్వే నెంబరు పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం. 1916లో సర్వే చేసినప్పుడు ఆ భూమిని ప్రభుత్వ బంజరుగా తప్పుగా పేర్కొనడాన్ని పసిగట్టిన అప్పటి చంద్రగిరి సబ్ కలెక్టర్ రీ-సర్వే చేసి 1925లో చెరువు శిఖంగానే తేల్చి ఏ-రిజిష్టర్‌లో పొందుపరిచారు.

    అది చెరువు శిఖం భూమేనని సాక్షాత్తూ తిరుపతి ఆర్డీవోనే హైకోర్టుకు పలు కేసుల్లో నివేదించారు. కలెక్టర్ రాంగోపాల్ ఫిబ్రవరి 12న పంపిన నివేదికపై రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా స్పందిస్తూ.. ‘భూమి రికార్డులకు తక్కిన రికార్డులకన్నా ఏ-రిజిష్టరే ప్రామాణికం. ఏ-రిజిష్టర్‌లో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేయండి’ అని ఆదేశిస్తూ మే 22న ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది.

    బీఆర్ మీనా జారీచేసిన ఉత్తర్వులను వక్రీకరించి అమలు చేసేలా ప్రభుత్వంలో కీలకనేతపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన కీలకనేత సీఎంవోను ప్రభావితం చేసి.. రెవెన్యూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే భారీ ఎత్తున పచ్చనోట్లను వెదజల్లినట్లు రెవెన్యూ వర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. సీఎంవో ఒత్తిళ్లు.. పచ్చనోట్ల ప్రభావానికి లొంగిన రెవెన్యూ అధికారులు ఏ-రిజిష్టర్‌ను (రీక్లాసిఫై)పునః వర్గీకరించారు.
     
    అప్పుడొకటి.. ఇప్పుడొకటి..
     
    ఫిబ్రవరి 12న కలెక్టర్ రాంగోపాల్ ప్రభుత్వానికి నివేదించిన ప్రకారం సర్వే నెంబరు 377లోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖమే. ఇందుకు 1886, 1925 ఏ-రిజిష్టర్‌లను ప్రామాణికంగా తీసుకున్నారు. దాని ప్రకారం ఆ భూమి ఏ ప్రైవేటు వ్యక్తులకు చెందినది కాదు.

    సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెరువు భూముల్లో పట్టాలు ఇవ్వకూడదు. దామినేడు చెరువు భూములను ఇందిరమ్మ ఇళ్లకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయడానికి అప్పటి కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నిరాకరించడమే అందుకు తార్కాణం. కానీ.. పచ్చ నోట్లకు, సీఎంవో ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు 1916లో ఏ-రిజిష్టర్‌లో చేసిన తప్పుడు మార్పునే ప్రామాణికంగా తీసుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీకి రూ.350 కోట్ల విలువైన చెరువు శిఖం భూమిని దారాదత్తం చేయడం గమనార్హం.

    ఇదే అంశంపై తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు మాత్రమే చేశామని సెలవిచ్చారు. ఆ ఉత్తర్వులను వక్రీకరించారు కదా అని ప్రశ్నిస్తే.. చంద్రగిరి, తిరుపతి రూరల్ తహశీల్దార్ కార్యాలయాల్లో ఏ-రిజిష్టర్‌లు అందుబాటులో లేవన్నారు. ఈ భూమిపై నడిచిన వివాదాల్లో హైకోర్టుకు రెవెన్యూ అధికారవర్గాలే ఏ-రిజిష్టర్ మేరకు ఆ భూమి చెరువు శిఖమేనని నిర్ధారించారు కదా అని ప్రశ్నిస్తే ఎలాంటి రికార్డుల్లేవని సమాధానం దాటవేశారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement