
సాక్షి, తిరుపతి: తిరుమలలో అనువంశిక అర్చకులకు పదవీ విరమణ లేదని హంపి పీఠాధిపతి స్వామి విద్యానంద భారతి స్పష్టం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైందవ ధార్మిక సంస్థ తిరుమల–తిరుపతి దేవస్థానంతో పాటు ఇతర ఆలయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై పలువురు పీఠాధిపతులు స్పందించారు. తిరుమల–తిరుపతి సంరక్షణ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు. పలు ధార్మిక మండలి సభ్యుల సలహాలు సూచనలు స్వీకరించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో హంపి పీఠాధిపతి స్వామి విద్యానంద భారతి, లలితా పీఠాధిపతి స్వస్వరూపానంద స్వామి, శివశక్తి పీఠం శివచైతన్యస్వామి, శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద, హిందూ ఆలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు స్వామి కమలానంద భారతి తదితరులు మాట్లాడారు. హైందవ ధార్మిక ఆలయాల పరిరక్షణే లక్ష్యంగా పీఠాధిపతుల సమాచాలోచన సాగుతోందన్నారు.
అందులో భాగంగానే తొలిసారిగా ఆధ్యాత్మిక నగరంలో సమావేశమై పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవారి ఆలయంలో చోటు చేసుకుంటున్న వివాదాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో నెలకొన్న సమస్యలపైన చర్చించి పలువురి సలహాలు స్వీకరించామన్నారు. శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి నుంచి ఏడు పర్యాయాలు తిరుమలకు పాదయాత్ర చేసి స్వామి వారికి కానుకలు సమర్పించారని వివరించారు. నిజానిజాలు తెలియాలంటే శ్రీవారి బంగారు ఆభరణాలపై జస్టిస్ జగన్నాథరావు, వాద్వా కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు సిట్టింగ్ జడ్జితో తక్షణం విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ధార్మిక సంస్థల్లో రాజకీయ జోక్యం తగదు
ఆలయాల నిధులు కేవలం హైందవ ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలన్నారు. ఆలయాల అభివృద్ధికి, విద్య, వైద్యం కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. ఆలయాల నిధులను ప్రభుత్వం మరే కార్యక్రమాలకు వినియోగించటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఇకపోతే ఆలయాల్లో హైందవేతర ఉద్యోగులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. తమ సమావేశాలు రాజకీయాలకు, ప్రభుత్వానికి సంబంధించినవి కాదని, కేవలం హైందవ ధర్మ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా ధార్మిక మండలిని ఏర్పాటు చేసి ప్రతినిధుల ద్వారా హైందవ ధర్మ పరిరక్షణకు తీసుకోవాల్సిన విషయాలపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. వివాదాలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా సమస్యల పరిష్కారం దిశగా తమ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అవసరమైతే మరింత మంది పీఠాధిపతులతో సమావేశమై చర్చించి తర్వాత అమరావతిలో అందరం సమావేశమై చర్చిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment