చోడవరం,న్యూస్‌లైన్: సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న 104 సేవలు పేదలకు సక్రమంగా అందడం లేదు. ఈ పథకం ద్వారా రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం కొరవడింది. ఒకపక్క సిబ్బంది కొరత, మరోపక్క వైద్య సిబ్బంది అరకొర సేవలతో ఈ పథకం నామాత్రమయింది. జిల్లాలో క్లస్టర్‌కి ఒకటి చొప్పున 20 వాహనాలున్నాయి. 150 మంది పని చేస్తున్నారు.
ప్రారంభంలో ఈ వాహనాలు నిర్ణీత తేదీల్లో గ్రామాలకు వచ్చేవి. ఎల్‌టి, ఫార్మసిస్టు, ఆపరేటర్, ఇద్దరు నర్సులు, మరో ముగ్గురు సిబ్బంది ఒక్కో వాహనంలో ఉండేవారు. మందులతో పాటు వైద్యం కూడా నేరుగా దీర్ఘకాలిక రోగులకు అందేది. ఆ తర్వాత వీటిని పూర్తిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధీనంలోకి నెట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సేవలు కూడా కుంటుపడ్డాయి. ఈ వాహనం అప్పుడప్పుడు గ్రామాల్లోకి రావడం పోవడం మినహా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
పలు పీహెచ్‌సీలకు వైద్యులే లేరు. ఆరోగ్య కేంద్రాల్లోనే అరకొర సేవలు అందిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీటిల్లో సేవలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ఈ పథకం సేవలకు మందుల కొరత ఉంది. బిపి, షుగర్, టీబీ,ఆస్త్మా వంటివాటితో దీర్ఘకాలికంగా బాధపడే వారికి ఈ వాహనాల ద్వారా నెలకు సరిపడే మందులు సరఫరా చేసేవారు. గర్భిణులకు కూడా పూర్తిస్థాయి సేవలు అందడంలేదు.104 ద్వారా అరకొర వైద్యంతో గ్రామాల్లో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఈ వాహనాల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
మూలకు చేరిన వాటిని బాగు చేయించడం లేదు. సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు లేవు. సిబ్బంది కుటుంబాలు పూటగడవడమే కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సిబ్బంది సేవలపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఇలా పలు సమస్యలతో 104 సేవలు నామమాత్రంగా మారాయి. ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించి సేవలు పూర్తిస్థాయిలో అందివ్వాలని రోగులు కోరుతున్నారు.
పడకేసిన సంజీవని
Published Fri, Jan 17 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement