బీఆర్‌ఏయూ విద్యార్థులకు అందని ఉపకార వేతనాలు
రూ.3 కోట్లకు చేరిన బకాయిలు
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : విద్యార్థుల సంక్షేమానికి ఎంతో చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వాస్తవానికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను సకాలంలో చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తోంది. ప్రభుత్వ వైఖరి కారణంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వీరికి చెల్లించాల్సి స్కాలర్‌షిప్ బకాయిల మొత్తం రూ.3 కోట్లకు చేరటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
మెస్ చార్జీల భారం..
ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్ మొత్తాలు ఇంతవరకు రాకపోవటంతో మెస్‌చార్జీలను విద్యార్థులే చెల్లించాల్సి వస్తోంది. సాధారణంగా స్కాలర్‌షిప్ మొత్తాన్ని వర్సిటీ అధికారులు మెస్ చార్జీలకు సర్దుబాటు చేస్తారు. స్కాలర్‌షిప్ చాలకపోతే అదనపు మొత్తాన్ని విద్యార్థి నుంచి వసూలు చేస్తారు. నిత్యావసర సరుకులు, వంటగ్యాస్, కూరగాయల ధరలు విపరీతంగా పెరగటంతో విద్యార్థులపై ఇప్పటికే అదనపు భారం పడుతోంది.
అమలు కాని కొత్త రేట్లు
ఉపకార వేతనాల మొత్తాన్ని పెంచుతున్నట్టు 2012 నవంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేట్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ.820కి బదులు రూ.1050, బీసీలకు రూ.682కు బదులు రూ.850 చొప్పున అందజేయాలి. కానీ కొత్త రేట్లను ఇంతవరకు అమలు చేయలేదు. వర్సిటీలో ఎస్సీ విద్యార్థులు 123 మంది, ఎస్టీలు 42 మంది, బీసీలు 55 మంది, ఈబీసీలు 42 మంది, మైనారిటీ విద్యార్థి ఒకరు ఉన్నారు. రెండో సెమిస్టర్ పూర్తి కావస్తున్నా ఉపకార వేతనం అందకపోవటంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యమే..
స్కాలర్‌షిప్ మొత్తం ఇంతవరకు చెల్లించకపోవటం ప్రభుత్వ వైఫల్యమే. ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ వర్సిటీ విద్యార్థులపై లేదు. ఇలాగైతే మాలాంటి వారు మెస్ చార్జీలు చెల్లించటం ఎలా సాధ్యమవుతుంది?
-కె.ధనరాజ్, ఎల్‌ఎల్‌బీ తృతీయ సంవత్సరం విద్యార్థి.
పెరిగిన రేట్లు వర్తింపజేయాలి
మెస్‌చార్జీలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. 2012 నవంబర్‌లో ప్రభుత్వం కొత్త రేట్లను ప్రకటించింది. అయినా ఇప్పటివరకు అమలు చేయలేదు. వెంటనే వీటిని వర్తింపజేయాలి. లేకపోతే ఇబ్బందులు పడతాం.
-కె.విజయ్‌రాజ్, ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి
స్కాలర్‌షిప్ పరేషాన్
Published Sat, Feb 8 2014 2:05 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement