శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు తప్పుకొంటే చాపను సర్దేసుకుని పోవాలని ప్రభుత్వం ప్రయత్నించినా
పక్కకు పోతే చాప సర్దుకుని పోవాలనుకున్న ప్రభుత్వం: జానా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు తప్పుకొంటే చాపను సర్దేసుకుని పోవాలని ప్రభుత్వం ప్రయత్నించినా.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో సహకరించామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డితో కలసి ఆయన బుధవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఒప్పించామని జానారెడ్డి చెప్పారు.
ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలుచేసే విధంగా ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో సఫలమయ్యామ న్నారు. రైతు రుణమాఫీపై, ఫీజు రీయింబర్స్‌మెంట్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు వంటివాటిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని సాధించామని వివరించారు. దళితులకు మూడెకరాల భూమి అని ఇచ్చిన హామీలోని డొల్లతనాన్ని అసెంబ్లీలో ఎండగట్టామన్నారు. 2013 భూసేకరణ చట్టం కన్నా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ లేదా కొత్త చట్టం ఎందుకు మెరుగైందో శాసనసభలో సభ్యులకు, ప్రజలకు చెప్పడంలో ప్రభుత్వం విఫలమైందని జానారెడ్డి విమర్శించారు.
అయితే ప్రభుత్వమే గొప్పతనం ప్రదర్శించాలనుకుందని, మాటల మాయతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ప్రజల సమస్యలను చర్చించి, పరిష్కారం కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నందున కొన్నిసార్లు ఇబ్బం దులు పడినా రెచ్చిపోకుండా, నిస్పృహ చెందకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో సహకరించామని వివరించారు. ప్రభుత్వం కొన్నిసార్లు పారిపోవాలని ప్రయత్నిం చినా, తొందరపడినా వేరే భావన లేకుండా పనిచేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ సహ కారం వల్లనే సభ 18 రోజులపాటు జరిగిందన్నారు. కొత్త రాష్ట్రంలో సభను కొత్త ఒర వడితో నడిపించాలని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించామన్నారు.