
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అనూహ్య తీర్పునిచ్చారని, 16 సీట్లు గెలుస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ను సింగిల్ డిజిట్‌కు పరిమి తం చేశారని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్ వైపునకు మళ్లారనేందుకు ఈ ఎన్నికలే సంకేతమన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని కూడా గుర్తించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం గా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పూర్తి మెజార్టీ వచ్చి న తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు.
నాకు టికెట్ ఇప్పిస్తారా?
తాను హుజూర్‌నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని వస్తున్న వార్తలను జానారెడ్డి ఖండించారు. తనకు అక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనే లేదని, అయినా తనకు ఒకరు టికెట్ ఇప్పించే పరిస్థితి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన దాఖలాలు తనకు ఎప్పుడూ లేవని, సోనియాగాంధీ పిలిచి పోటీ చేయమని చెప్పినా తాను సైలెం ట్‌గా ఉన్నానని, తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెనక్కు తగ్గి ఉండేవాడని అన్నారు. తాను 2024లో కూడా పోటీ చేయాలో లేదోనని ఆలోచిస్తున్నానని, తనకు విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
పార్టీ నిర్మాణం తగ్గిపోతోంది
అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పార్టీ నిర్మాణం తగ్గిపోతోందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు పడిపోయినప్పుడు పార్టీలు దెబ్బతింటాయని చెప్పారు. మోదీని ఓడించాలని జట్టు కట్టిన కూటమిలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉండాల్సిందని, అఖిలేష్–మాయావతిలు కాంగ్రెస్‌తో కలిసి ఉంటే బాగుండేదని అన్నారు. ఎవరికి వాళ్లు ప్రధాని కావాలనే కోరిక ఉండటం కూటమిలోని ప్రధాన లోపమని చెప్పారు. రాహుల్ రాజీనామా సహజమని, అయితే రాజీనామాపై పునరాలోచించుకుంటే మంచిదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి జానా అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment