జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం
విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్య శాఖలో నెలకొన్న ముసలం ముదురుతుందే తప్ప చల్లారడం లేదు. మిగిలిన ఉన్నతాధికారులందరూ ఒక్క అధికారినే టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన వాహనానికి డీజిల్ గాని లేదంటే అద్దె ప్రాతిపదికన వాహనమైనా సమకూర్చాలని గుమస్తాల దగ్గర నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు అందరినీ వేడుకున్నా ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కర్నూల్‌లో డీఎంహెచ్‌ఓ, అడిషనల్ డీఎంహెచ్‌ఓలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా వివాదం ముదురుతుందో ఏమోనని కొంతమంది ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పరిస్థితి చూస్తే ఆ స్థాయిలోనే ఉందని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖాధికారిని కొంతమంది ఉద్యోగులు తప్పుదోవ పట్టిస్తున్నరనే ఆరోపణులు కూడా వినిపిస్తున్నాయి.
డీజిల్ ఇవ్వడం లేదు..
వైద్యారోగ్యశాఖలో అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారిగా సి.పద్మజ పనిచేస్తున్నారు. ఈమె గతంలో డీఎంహెచ్‌ఓగా కూడా ఇక్కడ పనిచేశారు. అయితే ఈమెకు కేటాయించిన వాహనం పాతది కావడంతో తరచూ మోరాయిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆ వాహనంలోనే విధులకు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నెల నుంచి అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి వాహనానికి డీజీల్ కేటాయించడం లేదు. దీంతో తన సొంత వాహనంలోనే విధులకు హాజరుతున్నారు. డీజీల్ గాని, అద్దె ప్రాతిపదికన వాహనాన్ని గాని కేటాయించాలని ఆమె పలుమార్లు డీఎంహెచ్‌ఓకు, జాయింట్ కలెక్టర్‌కు, వైద్యారోగ్య శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌కు రెండు సార్లు లేఖల ద్వారా మొరపెట్టుకున్నారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.దీంతో చేసేది లేక సొంతవాహనంలోనే విధులకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క అదనపు డీఎంహెచ్‌ఓ పద్మజకు మినహా మిగిలిన అధికారులందరికీ అద్దె ప్రాతిపదికన అధునాతన వాహనాలు సమకూర్చుకోవడం విశేషం.
అదనపు వైద్యారోగ్యశాఖాధికారి విధులు..
నెలలో 12 నుంచి 18 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను పరిశీలించాలి. అదేవిధంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించడం.. మాతా,శిశు మరణాలపై సమీక్షలు.. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల పర్యవేక్షణ వంటి విధులు చేపట్టాల్సి ఉంటుంది.
రెండుసార్లు చెప్పాను..
జూలై నెలలో డీజీల్ కాని, అద్దె ప్రాతిపదికన వాహనం కాని ఇవ్వాలని లెటర్ ద్వారా డీఎంహెచ్‌ఓను అడిగాను. మరలా రెండోసారి కూడా లేఖ రాశాను. ఆరు నెలలుగా సొంత వాహనంలోనే విధులకు హాజరవుతున్నాను. – డాక్టర్ సి.పద్మజ, జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి
బడ్జెట్ లేదు..
డీజీల్ వేసే పెట్రోల్ బంక్ యాజమానికి రూ.లక్ష వరకు బకాయి ఉంది. అందుకే ఆయన డీజిల్ వేయడం లేదు. ప్రస్తుతం రూ.36 వేల బడ్జెట్ వచ్చింది. అది చెల్లించాం. మిగతా బకాయిలు ఎన్‌హెచ్‌ఎం నిధుల నుంచి చెల్లించేందకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ అనుమతి కోరాం. అనుమతి రాగానే బకాయి చెల్లించి, కొత్త డీజీల్ కూపన్ బుక్ తీసుకుని అడిషనల్ డీఎంహెచ్‌ఓకు ఇస్తాం. పాత వాహనం తిరగడానికి పనికిరాదని ఎస్‌టీఓ ధృవీకరిస్తే తప్ప అద్దె ప్రాతిపదికన వాహనం సమకూర్చలేం. – డాక్టర్ కె.విజయలక్ష్మి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment