నాక్ గుర్తింపు తప్పనిసరి
Published Tue, Jan 7 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :యూజీసీ నిధులు పొందుతున్న కళాశాలలకు నాక్ గుర్తింపు తప్పకుండా ఉండాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.వియ్యన్నారావు స్పష్టం చేశారు. యూనివర్సిటీ కమిటీ హాలులో సోమవారం వీసీ అధ్యక్షతన వర్సిటీ పరిధిలోని 2ఎఫ్, 12బీ గుర్తింపు ఉన్న కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం జరిగింది. వీసీ మాట్లాడుతూ నాక్ గుర్తింపు(అక్రిడిటేషన్) లేకపోతే నిధులు నిలిపివేస్తామని యూజీసీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సమాచారాన్ని అన్ని కళాశాలలకు పంపామన్నారు. ఆ జాబితాలో ఉన్న కళాశాలలు వెంటనే నాక్ అక్రిడిటేషన్ చేయించుకోవాలని సూచించారు.
దీని కోసం యూనివర్సిటీ నుంచి పూర్తి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కళాశాలలు కోరితే యూనివర్సిటీ నుంచి రిసోర్స్ పర్సన్స్‌ను కూడా నియమిస్తామని చెప్పారు. ఈఏడాది జూన్ ఒకటో తేదీలోగా నాక్ అక్రిడిటేషన్ చేయించుకోకపోతే వచ్చే ఏడాది ఏప్రియల్ ఒకటి నుంచి నిధులు నిలిచిపోతాయన్నారు. రెక్టార్ ఆచార్య వై.పి.రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి. రాజశేఖర్‌లు వివిధ అంశాలపై కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సూచనలిచ్చారు. కళాశాలల వారు వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో సీడీసీ డీన్ ఆచార్య జి.వి.చలం, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement