టమాట రైతుకు రుణ విముక్తి ఏదీ?
రాష్ట్రంలోనే టమాట పంటకు మదనపల్లె పెట్టింది పేరు. ఇక్కడ 90 శాతం మంది రైతులు, వ్యాపారులు, కూలీలు ఇదే పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకప్పుడు వీరి బతుకులు సాఫీగా సాగాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వర్షాభావం, కరెంటు కోతలు, గిట్టుబాటు ధరలులేక వారు కుమిలిపోతున్నారు. అప్పుచేసి పంట పెట్టినా ఫలితం లేకుండాపోతోంది. తీవ్ర దుర్భిక్షం టమాట బతుకును ఛిద్రం చేస్తోంది. చేసిన అప్పులు తీర్చాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు పంపుతున్నారు. లేకుంటే తాకట్టు పెట్టిన నగల్ని వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారు. రుణ మాఫీ హామీ నీటిమీద రాతలా మారింది. దీనిపై ఎవరినడగాలో.. ఎక్కడ చెప్పుకోవాలో దిక్కుతోచడంలేదు. వీరి సమస్యలు తెలుసుకునేందుకు మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. మదనపల్లె టమాట మార్కెట్‌ను సందర్శించారు. స్థానిక కూలీలు, వ్యాపారులు సమస్యలను ఏకరువు పెట్టారు. రుణవిముక్తి కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ టమాట రైతుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రెజెంటేషన్: చిట్టెం సుధాకర్, మాడా చంద్రమోహన్
దేశాయ్ తిప్పారెడ్డి హామీలు
మదనపల్లె టమాట మార్కెట్‌ను మోడ్రన్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతా. ఈ విషయంపై ఈనెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో చర్చకు తీసుకువస్తా. రూ.10 కోట్లతో మార్కెట్‌ను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. వేలం పాటలకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తాం. మార్కెటింగ్ మంత్రి పుల్లారావు, మార్కెటింగ్ కమిషనర్ వెంకటరామిరెడ్డితో స్వయంగా కలిసి సమస్యలు తెలియజేస్తాను. తాగునీటి కోసం ఆర్‌ఓఆర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా. పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. జాక్‌పాట్ నిర్వహించే మండీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రయత్నిస్తా.
దేశాయ్ తిప్పారెడ్డి: నమస్తే అన్నా.. నా పేరు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి. మదనపల్లె ఎమ్మెల్యేని. టమాటాకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? ప్రభుత్వం సహకారం ఎలా ఉంది?
ఆంజనేయులు(రైతు): టమాటా బాక్సులకు కమీషన్లు ఇవ్వాలి. గిట్టుబాటు కాలేదు. పంటను నమ్ముకున్నాం. చివరకు మందుల ధరలు పెరిగిపోయాయి. చెమడోచ్చి పం డించిన కాయలు మార్కెట్‌కు తెస్తే చివరకు చిల్లిగవ్వ కూడా మిగలేదు. ప్రభుత్వ సహకారం ఏమాత్రం అందడం లేదు.
దేశాయ్ తిప్పారెడ్డి: టమటా పంటకు రుణమాఫీ వర్తింపజేయాలా? మీరు పంట రుణమాఫీ ఎలా కావాలని కోరుకుంటున్నారు?
మల్లప్ప(రైతు): అన్ని పంటలతో పాటు టమాటా పంటకూ రుణమాఫీ అమలు చేయాలి. ఎంతోమంది రైతులు టమాటా పంట పెట్టి నష్టపోయారు. శెనగ పంట కంటే టమాటాకు మొదట రుణమాఫీ చేయాలి. ముఖ్యమంత్రి దీనిపై ఆశించిన సమాధానం ఇవ్వలేదు.
దేశాయ్ తిప్పారెడ్డి: టమటాకు ఎంత రుణమాఫీ చేయాలనుకుంటున్నావు?
సంగప్ప(రైతు): సార్, టమాట పంటకు ఎకరాకు రూ.1.5 లక్షలు ఇవ్వాలి. పంట పెట్టినప్పటినుంచి ఎంతో నష్టపోయాం. చివరకు శెనిగి చెట్లు కూడా వేయలేదు. రుణమాఫీ చేయకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
దేశాయ్ తిప్పారెడ్డి: టమాటాకు రుణమాఫీ చేయకపోతే మీరు ఏం చేస్తారు?
సంగప్ప: రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తాం. తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి ఆందోళనలు చేస్తాం.
దేశాయ్ తిప్పారెడ్డి: మద్దతు ధర ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు?
మల్లికార్జున: సార్.. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. పంట పెట్టినప్పటి నుంచి మార్కెట్‌కు వచ్చే వరకు కష్టాలే. ధరలు తగ్గితే ఎవరూ పట్టించుకోరు. కనీసం కిలో రూ.15 ధర ప్రకటించాలి.
దేశాయ్ తిప్పారెడ్డి: మీరు పెట్టిన పంటకు ఇన్సూరెన్సు లభిస్తుందా?
ఆంజినేయులు(రైతు): ఏం చెప్పమంటారు సారు.. పెట్టిన పంటకు ఇన్సూరెన్సు ఇవ్వలేదు. పంట పెట్టి దేవుడిపై భారం వేస్తున్నాం.
దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
ప్రభాకర్‌రెడ్డి (రైతు): రాత్రి కాయలు తెస్తే మండీల బయటే పడుకోవాలి. దోమల బెడద, తాగేందుకు నీళ్లు దొరకవు. రాత్రంతా జాగరణ ఉండాల్సిందే. పొద్దునే వేలం పాట పాడే వరకు ఉండి డబ్బులు తీసుకుని పోతున్నాం.
దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్‌లో విశ్రాంత భవనం ఉంది కదా. ఎలా ఉపయోగపడుతోంది?
రామప్ప(రైతు): సారు.. ఏం చెప్పమంటారు.. పేరుకు మాత్రం పెద్ద అచ్చరాలతో రైతు విశ్రాంతి భవనం అని రాశారు. ఎప్పుడు సూసినా మూసివేసివుంటారు. ఎవరినైనా అడిగితే వెళ్లవయ్యా..అంటూ కసరుకుంటారు.
దేశాయ్ తిప్పారెడ్డి: అన్నా... మరుగుదొడ్లు ఉన్నాయా?
రాంమోహన్ (రైతు): ఎక్కడున్నాయి సారు.. కట్టిన మరుగుదొడ్లు ఎప్పుడు చూసినా తాళాలు వేసివుంటారు. రాత్రయితే మార్కెట్ ఆవరణలోనే మలవిసర్జన చేయాల్సి వస్తోంది. దీంతో దుర్వాసన వస్తుంది. మరుగుదొడ్లు కట్టినా ప్రయోజనం లేదు.
దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్‌లో తాగేందుకు నీళ్లు ఉన్నాయా?
శివన్న(రైతు): ప్యాకెట్ నీళ్లు తెచ్చుకుని తాగుతున్నాం. వాటికోసం కావాలంటే రోడ్డు దాటి పోవాలి. కొళాయిలున్నా నీళ్లు మాత్రం రావు. పడరాని పాట్లు పడుతున్నాం.
దేశాయ్ తిప్పారెడ్డి: మీరు తెచ్చిన టమటాలకు సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నారా?
పెద్దిరెడ్డి(రైతు): సార్ నిజం చెప్పమంటారా.. వందకు 10 రూపాయలు కమీషన్, 100 బాక్సులు తెస్తే గ్రేడింగ్ పేరుతో 60 బాక్సులు రాస్తారు. చివరకు మాకు మిగిలేది గుండుసున్నే. దళారీలు రాజ్యమేలుతున్నారు.
దేశాయ్ తిప్పారెడ్డి: ఏమ్మా.. మీకు కూలి గిట్టుబాటు లభిస్తుందా? ఏ సమస్యలు ఉన్నాయి?
శాంతమ్మ(కూలీ): రోజంతా కాయలు ఏరితే వంద వస్తుంది. ఇంట్లో పిల్లాజల్లా ఉన్నాం. కనీసం గుర్తింపు కార్డులు లేవు. కార్మికులుగా గుర్తింపు లేదు.
దేశాయ్ తిప్పారెడ్డి: డ్వాక్రాలో ఉన్నావా? రుణమాఫీ అవుతుందని అనుకుంటున్నావా?
శాంతమ్మ: డ్వాక్రాలో ఉన్నాను. రుణమాఫీ అవుతుందని చెబుతున్నారే తప్ప ఇప్పటివరకు చేసిందేమి లేదు. వారిని(ప్రభుత్వం) నమ్ముకుంటే గంగలో దూకినట్లే.
దేశాయ్ తిప్పారెడ్డి: అన్నా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?
కె.వి.రమణ(మండీ యజమాని): రైతులు తెచ్చిన కాయలు రోడ్లపైనే వేలం వేయాల్సి వస్తోంది. టమటాలు పచ్చి పంట. ఎండకు, వానకు నానినే పనికి రావు. ధరలు సరిగా ఉండవు. రోడ్లపై వేలం వల్ల కాయలు దెబ్బతింటున్నాయి. పక్కనే ఉన్న వాల్మీకిపురం, చింతపర్తి, గుర్రం కొండలో షెడ్లు వేశారు.
దేశాయ్ తిప్పారెడ్డి: అన్న.. మండీలో ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి?
నాగయ్య(మండీ యజమాని): షెడ్లు అదనంగా నిర్మించాలి. విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలి. దీనిపై మార్కెట్ జేడీకి తెలియజేశాం. రోడ్డుపైనే వేలం వేయడం వల్ల పచ్చికాయలు చెడిపోయి ధరలు తగ్గిపోతాయి. రైతులు, వ్యాపారులు నష్టపోతున్నాం.
దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్‌లో పరిశుభ్రత ఎలా ఉంది?
నరసింహులు(రైతు): మార్కెట్‌లో అడుగుపెడితే చాలు దుర్వాసన. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, కుళ్లిన టమాటాలు. వీటిని శుభ్రం చేయడం లేదు.
..అంతలోనే మార్కెట్ కమిటీ కార్యదర్శి జగదీష్ వచ్చారు.
దేశాయ్ తిప్పారెడ్డి: సెక్రటరీ గారూ..మార్కెట్‌లో జాక్‌పాట్‌లు, తాగునీరు లేదని, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం అ ద్వానంగా ఉందని, రోడ్లుపైనే వేలం పాటలు వేస్తున్నారని రైతులు, కూలీలు తెలిపారు. దీనిపై మీ స్పందన ఏమిటి?
జగదీష్ (మార్కెట్ కార్యదర్శి): టమాటా గిట్టుబాటు ధరల కోసం జాక్‌పాట్ చేసే మండీలకు నోటీసులు ఇచ్చాం. తాగునీటి సమస్య త్వరలో తీరుస్తాం. విశ్రాంతి భవనం ఏర్పాటు చేసేలా చూస్తాం. మార్కెట్‌లో పరిశుభ్రత పాటించే కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. మండీల ఎదుట పరిశుభ్రత ఉండేలా యజమానులకు తెలియజేశాం.
డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి: మార్కెట్‌లో స్వచ్ఛ భారత్ నిర్వహించలేదా?
జగదీష్ : మండీ యజమానులను భాగస్వాములను చేస్తున్నాం. వారి మండీల వద్ద చెత్తను ఒక చోట చేర్పించేలా చర్యలు చేపట్టాం. ఉదయం, సాయంత్రం చెత్తను ట్రాక్టర్లలో ఎత్తి వేస్తాం. తర్వలో స్వచ్ఛభారత్ నిర్వహిస్తాం.