నగరి : అనర్హులుగా తేలిన వారికి పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం నగరి మున్సిపాలిటీలోని 7వ వార్డులో కౌన్సిలర్ మునికృష్ణయ్య అధ్యక్షతన ఇన్‌చార్జి కమిషనర్ ప్రసాద్ నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చైర్‌పర్సన్ శాంతికుమార్ మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ పింఛన్లు తొలగించేశారని పలువురు విమర్శిస్తున్నారని అర్హులకు ఎవరికీ తొలగించలేదన్నారు.
అనర్హులైన వారికి పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. అర్హులైన వారికి తొలగిపోయివుంటే వారికి తప్పక ఇప్పిస్తామన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని సమస్యలు తెలుసుకోవడానికే నిర్వహిస్తున్నామన్నారు. లక్షన్నరదాకా రుణమాఫీ తప్పకచేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా తప్పక న్యాయం చేస్తామన్నారు. మరో అతిథి మాజీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగడం కారణంగా తీవ్రమైన ఆదాయపు లోటు ఏర్పడిందన్నారు.
ఈ దశలోను ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చైర్‌పర్సన్ శాంతికుమార్ స్మగ్లర్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సమావేశ ప్రాంగణంలో మంత్రి గోపాలకృష్ణారెడ్డి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో పెంచలకిషోర్, డీఎస్పీ కృష్ణకిషోర్ రెడ్డి, తహశీల్దార్ వెంకటరమణ, వైస్‌చైర్మన్ పీజీ నీలమేఘం, మాజీ చైర్మన్ కేజేకుమార్, జడ్పీటీసీ సభ్యులు వెంకటరత్నం, ఎంపీపీ మీరా, మాజీ సర్పంచ్ శ్రీహరినాయుడు, సహకార బ్యాంకు చైర్మన్ బాలసురేష్, వైద్యాధికారి సుభాషిణి, మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యవసాయ అధికారి రమేష్‌రాజు, పశువైద్య, ఐకేపీ, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.
అనర్హులకు పైసా ఇచ్చే ప్రసక్తే లేదు
Published Thu, Oct 9 2014 4:28 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM
Advertisement