భూకంపాలు తట్టుకోగల భవనాలు
- బీఐఎస్ నిబంధనలు పాటిస్తే సాధారణ వ్యయానికే నిర్మాణం సాధ్యమే
- నిర్మాణ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం వల్లే నాణ్యతలేమి
- ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీపీడబ్ల్యూ ఏడీజీ శ్రీనివాసన్
సాక్షి, హైదరాబాద్: భూకంపాలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగల భవనాల నిర్మాణానికి అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రజా పనుల విభాగం అదనపు డెరైక్టర్ జనరల్ పి.పి శ్రీనివాస్ తెలిపారు. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) రూపొందించిన భవన నిర్మాణ నియామవళిని అనుసరించి సాధారణ వ్యయానికే భవనాలు నిర్మించవచ్చన్నారు. అయితే సామాన్య ప్రజలు నిర్మాణ ఖర్చులను స్వల్పంగా తగ్గించుకుని డబ్బులు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తుండటం వల్లే భవనాలు నాణ్యత కోల్పోతున్నాయన్నారు. ఉదాహరణకు రూ. 100 వ్యయం చేసే భవనానికి రూ. 110 ఖర్చు చేస్తే అధిక వ్యయమని, అదే రూ. 90 ఖర్చు చేసి పొదుపు చేసినట్లు భావించడం మాత్రం త్యాగానికి సిద్ధపడినట్లేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్ర: భూకంపాలను తట్టుకోవడానికి భవన నిర్మాణాల్లో ఏయే జాగ్రత్తలు పాటించాలి?
జ: భూ పరీక్షలు జరిపాకే భవనాలకు పునాదులు వేయాలి. నేలపై ఒత్తిడి ప్రదర్శించి దృఢత్వాన్ని పరీక్షించాలి. భూకంపం సంభవించినప్పుడు భవనం నిలబడుతుండా? కుంగిపోతుందా? అని పరీక్షించాలి. కనీసం 300 మి.మీల సైజులో పిల్లర్లను నిర్మించాలి. భారీ భవంతుల బ్లాక్‌ల మధ్య ఖాళీ ప్రదేశం వుంటే భూకంపం సమయంలో ఒత్తిడి సర్దుబాటుకు అవకాశం వుంటుంది. లేకుంటే ఒక బ్లాక్ ఒత్తిడి మరో బ్లాక్ మీద పడి కుప్పకూలే ప్రమాదముంది. ఇటీవల వచ్చిన భూకంపం వల్ల కోల్‌కతాలో కూలిన ఓ భారీ భవనం వెనక కారణం ఇదే.
ప్ర: భవన నిర్మాణంలో, నిర్మాణం తర్వాత ఎలాంటి నాణ్యత పరీక్షలు జరపాలి?
జ: కాంక్రీట్‌ను సైతం చిన్న గొట్టంలో వేసి ఒత్తిడి ద్వారా విచ్ఛిన్నం చేస్తారు. తేలికపాటి ఒత్తిడికి ధ్వంసమైతే నాణ్యత లేదని నిర్ధరిస్తారు. నిర్మాణం పూర్తయ్యాక కట్టడానికి నష్టం జరగకుండా ‘నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్’లను జరుపుతారు. అల్ట్రా సోనిక్ కిరణాలను కాంక్రీట్‌పై పంపుతారు. తేలికగా లోపలికి చొరబడితే నాణ్యత లేదని భావిస్తారు. ప్రతి వెయ్యి ఇటుకలకు ఒక ఇటుకను పరీక్షించాల్సిందే.
ప్ర: భవనాల నిర్మాణంలో బీఐఎస్ నిబంధనలు అమలు కావడం లేదెందుకు?
జ: భూకంపాల సంభావ్యత తీవ్రతను బట్టి దేశాన్ని ఐదు జోన్లుగా విభజించారు. ఏ జోన్‌లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలో బీఐఎస్ నియామవళిలో స్పష్టంగా ఉంది. సామాన్య ప్రజల్లో అవగాహన లేకే దీన్ని అమలు చేయడం లేదు. అనుమతులు ఇచ్చే పురపాలక సంఘాలే నిబంధనల అమలును కఠినం చేయాలి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు సైతం చొరవ తీసుకోవాలి.