తొలిసారి పంచాయతీ బరిలో నోటా  | NOTA For Panchayat Elections | Sakshi
Sakshi News home page

తొలిసారి పంచాయతీ బరిలో నోటా

Published Sun, Jun 23 2019 11:08 AM | Last Updated on Sun, Jun 23 2019 11:08 AM

NOTA For Panchayat Elections - Sakshi

సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కులాల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేశారు. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించి తప్పొప్పులు సరిచేశారు. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలను పూర్తిచేసి అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకుని ఓటర్ల తుది జాబితాలను ప్రచురించారు. ఈసారి తొలిసారిగా స్థానిక ఎన్నికల్లో ‘నోటా’ విధానం ప్రవేశపెడుతుండటం మరింత ఆసక్తిని రేపుతోంది. నోటాకు అధిక ఓట్లు పోలయితే రీపోలింగ్‌ పెట్టాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో 909 గ్రామ పంచాయతీలుండగా 9,930 వార్డుల్లో 25,50,916 మంది ఓటర్లున్నారు.

రెండు బ్యాలెట్‌లతో నిర్వహణ
పంచాయతీ ఎన్నికలు రెండు బ్యాలెట్‌లతో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. పాత పద్ధతిలోనే బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్‌ పత్రాలు కొనుగోలు చేయాలని, ముద్రణకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో రెండు రంగుల బ్యాలెట్లు ఉంటాయి. సర్పంచ్‌కు గులాబీ రంగు బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుగు రంగు బ్యాలెట్‌ పత్రాలను కేటాయించారు. జిల్లా స్థాయి కమిటీ అనుమతితో ఎంపిక చేసిన కేంద్రంలో వచ్చేనెల బ్యాలెట్‌ ముద్రణ జరుగుతుంది.

అభ్యర్థుల ఖర్చు పెంపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల దరావతు, ఎన్నికల వ్యయ పరిమితి పెరగనుంది. దరావతు 150 శాతం నుంచి 1000 శాతం పెంచేలా ప్రతిపాదనలు చేశారు. 10 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలో సర్పంచ్‌కు రూ.20 వేలు, వార్డు సభ్యుడికి రూ.3 వేలు ఖర్చు చేయాల్సి వుండగా ప్రస్తుత సర్పంచ్‌ రూ.32 వేలు, వార్డుసభ్యుడు 4,800 వరకు ఖర్చు చేయవచ్చు. 10 వేల పైబడి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ రూ.40 వేలు, వార్డు సభ్యుడు రూ.5 వేలుగా ఉన్న ఎన్నికల వ్యయాన్ని ఇకపై సర్పంచ్‌కు రూ.64 వేలు, వార్డు సభ్యుడు రూ.8 వేలకు పెంచాలన్న ప్రతిపాదన ఉంది.

రిజర్వేషన్లపై తర్జనభర్జన
2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 39.99 శాతం, ఎస్సీలకు 18.30 శాతం, ఎస్టీలకు 8.50 శాతం కోటాను అమలు చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి నూతన ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి వుంది. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల్లో 13 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. దీంతో పల్లెల్లో పార్టీ మరింత బలంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు పలికిన సర్పంచులు గెలవడంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ సారి క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కులాల వారీగా ఆర్థిక స్థోమతను బట్టి ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

అభ్యంతరాలు పరిష్కరించాం
జిల్లాలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న వనరులు, వసతులు పరిశీలించి ఎంపిక పూర్తి చేశాం. పంచాయతీ కార్యాలయాల్లో తుది ఓటర్లు జాబితా, పోలింగ్‌ కేంద్రాల జాబితాలను ప్రకటించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల కులగణ అంతా పారదర్శకంగా చేశాం. ఆయా వర్గాలకు ఉన్న ఓట్ల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండడంతో చాలా జాగ్రత్తగా పూర్తిచేశాం. ప్రభుత్వం రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఎన్నికలు పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం.
– రోళ్లకంటి విక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఏలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement