నెలాఖరుకల్లా నోటిఫికేషన్
- గ్రూప్-1, 3 పోస్టుల భర్తీ
- ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ వెల్లడి
- ఏఈఈ పోస్టులకు 29, 30న మెయిన్ పరీక్షలు
సాక్షి, విశాఖపట్నం: గ్రూప్-1, 3లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ డా.పి.ఉదయభాస్కర్ వెల్లడించారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ గ్రూప్-1, గ్రూప్-3లో నోటిఫికేషన్‌లో వెయ్యికిపైగా పోస్టులు ఉండబోతు న్నాయన్నారు. జనవరిలో నోటిఫికేషన్ ఇస్తే వయోపరిమితిలో నిరుద్యోగులకు ఇబ్బంది ఏర్పడుతుందన్న భావనతోనే ఈ నెలాఖరులోగా జారీ చేయనున్నామని చెప్పారు. రెండు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్-2లో 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 256 ఏఈ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్, ప్రిలిమ్స్ పూర్తయ్యాయని, ఈనెల 29, 30 తేదీల్లో మెరుున్ పరీక్షలు నిర్వహించబోతున్నా మని తెలిపారు.
ఈసారి పరీక్షలు కంప్యూటర్ ఆధారంగా చేపట్టాలని ఆలోచనలో ఉన్నామని, పైగా పూర్తిగా జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. అవకత వకలకు ఆస్కారం లేకుండా ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ హాజరు, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏఈఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు రావడంతో 1:50 నిష్పత్తిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 37,489 మంది ఫైనల్ పరీక్షలకు అర్హత పొందారన్నారు. ఇటీవల గ్రూప్-2 కింద వివిధ కేడర్‌లలో 984 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటి వరకు 2.25 లక్షల దరఖాస్తులొచ్చాయని ఈనెల 10 వరకు గడువు ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గ్రూప్-2 పోస్టులకు రిజర్వేషన్లు వర్తించవన్నారు.