నేడే సార్వత్రిక శంఖారావం
- ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్న కలెక్టర్
- 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ
- 19 వరకు స్వీకరణ జ21న పరిశీలన, 23న ఉపసంహరణ
- మే 7న పోలింగ్, 16న కౌంటింగ్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల సమర శంఖారావం మోగనుంది. శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు. 21న పరిశీలన, 23న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే నెల 16న నగరంలో ఏర్పాటు చేస్తున్న మూడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
5 రోజులే నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల సమర్పించేందుకు షెడ్యూ ల్ ప్రకారం 8 రోజులు సమయముంది. సెలవు రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. ఈ నెల 13 ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి, 18న గుడ్‌ఫ్రైడే కారణంగా కేవలం అయిదు రోజులు మాత్రమే స్వీకరించనున్నారు. ఇప్పటికే పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను తీసుకువెళ్లారు. బుధవారం నుంచి నామినేషన్ల జోరు ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయాలకు వంద మీటర్లు పరిధిలో బారికేడ్లను పెడుతున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ చాంబర్‌లో విశాఖ పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్‌కు జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు, వారి అనుచరులను కలెక్టరేట్ గేటు బయటే నిలిపివేస్తారు. అభ్యర్థితో పాటు మరో నలుగురు ప్రపోజర్లను మాత్రమే అనుమతిస్తారు.
కలెక్టరేట్‌లోనే అదనపు జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో విశాఖ-తూర్పు నియోజవర్గం పోటీదారుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. వారు కలెక్టరేట్‌లో ఎస్‌బీఐ బ్యాంకు రోడ్డులో సివిల్‌సప్లయిస్ కార్యాలయం వైపున ఉండే మెట్ల నుంచి ఏజేసీ చాంబర్‌కు అనుతిస్తారు. నామినేషన్లు సమర్పించిన తరువాత తిరిగి అదే దారి నుంచి వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది.
కలెక్టరేట్‌లో మీడియా పాయింట్
నామినేషన్లు సమర్పించిన తరువాత పార్టీల అభ్యర్థులు మీడియాతో మాట్లేందుకు కలెక్టరేట్‌లోనే మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కలె క్టరేట్ ప్రాంగణంలో టీ క్యాంటిన్ పక్కన్న ఉన్న ఖాళీ స్థలాన్ని ఇందుకు కేటాయించారు. అభ్యర్థులు మీడియాతో మాట్లాడాలంటే అక్కడ మాత్రమే అనుమతిస్తారు.