నిఘా.. ఎక్కడ నీ చిరునామా! | Now became police sub-control rooms to be ineffective | Sakshi
Sakshi News home page

నిఘా.. ఎక్కడ నీ చిరునామా!

Published Mon, Jun 9 2014 1:05 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

నిఘా.. ఎక్కడ నీ చిరునామా! - Sakshi

నిఘా.. ఎక్కడ నీ చిరునామా!

 దిష్టిబొమ్మల్లా పోలీసు సబ్ కంట్రోల్ రూంలు
 
కర్నూలు, న్యూస్‌లైన్: పోలీసు సబ్ కంట్రోల్ రూంలు దిష్టిబొమ్మల్లా మారిపోయాయి. శాంతి భద్రతల పరిరక్షణకు ఒక అడుగు ముందుకేసి ఏర్పాటు చేసిన ఈ విభాగం సేవలందించలేకపోయింది. ఉద్దేశం మంచిదే అయినా.. ఆచరణలో విఫలమవడం ప్రజలకు శాపంగా మారింది. 2012లో అప్పటి రాష్ట్ర పోలీసు బాస్ దినేష్‌రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి హయాంలో ఆరు సబ్ కంట్రోల్ రూంలు ఏర్పాటయ్యాయి.
 
 కిడ్స్ వరల్డ్.. జిల్లా పరిషత్ ఎదురుగా.. ఎంజీ పెట్రోల్ బంకు.. ఐదు రోడ్ల కూడలి.. ప్రభుత్వాసుపత్రి ప్రధాన గేటు.. సత్యనారాయణ గుడి(మెయిన్ రోడ్డులో).. కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ రూంలు ఇప్పటికీ సేవలందించకలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏఎస్‌ఐ స్థాయి అధికారితో పాటు కానిస్టేబుళ్లతో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు వీటిలో బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించేందుకు కార్యాచరణ రూపొందించారు.
 
 పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కేందుకు జంకే బాధితులు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకుకోవాలనేది సబ్ కంట్రోల్ రూంల ఉద్దేశం. మహిళల పట్ల ఆకతాయిల ఆగడాలు.. తాగుబోతుల హల్‌చల్.. అల్లరిమూకల ఆటకట్టించేందుకు ఈ విభాగం ఉపయోగపడనుంది. ఆ మేరకు పోలీసు అధికారులు సబ్ కంట్రోల్ రూంలలో నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రారంభోత్సవం సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. అయితే వీటిని ఆర్భాటంగా ఏర్పాటు చేశారే కానీ సిబ్బంది నియామకంలో చేతులెత్తేశారు.
 
 ప్రస్తుతం పోలీసు సబ్ కంట్రోల్ రూంలు నిరుపయోగంగా మారిపోయి అసాంఘిక కార్యకలాపాలకు నిలయమవుతున్నాయి. కిడ్స్ వరల్డ్ వద్దనున్న కంట్రోల్ రూంలో గుర్తు తెలియని వ్యక్తులు గోనెసంచులు మూటకట్టి పెట్టారు. ప్రతిచోటా చిరు వ్యాపారులు వీటికి అడ్డంగా దుకాణాలు పెట్టేయడంతో ఈ విభాగం మరుగునపడుతోంది.
 
పోలీసు అధికారుల ఆకాంక్షకు అనుగుణంగా కంట్రోల్ రూంలకు ఒక కానిస్టేబుల్‌నైనా నియమిస్తే కొంత మేరకైనా నేరాలకు అడ్డుకట్ట వేయచ్చనే అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. గత ఐదు నెలల కాలంలో కర్నూలు నగరంలోనే 12 భారీ చోటు చోటు చేసుకున్న నేపథ్యంలోనైనా పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement