మోసం చేయడమే బాబు నైజం | Now resorting to fraud | Sakshi
Sakshi News home page

మోసం చేయడమే బాబు నైజం

Published Fri, Feb 21 2014 2:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Now resorting to fraud

    తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు
     బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి

 
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : మోసం చేయడమే టీడీపీ అధినేత చంద్రబాబు నైజమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

రాష్ట్ర విభజన అంశంలో బీజేపీ మోసం చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటుందని, పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు తెలుపుతామని స్పష్టం చేసిందని వివరించారు. ఈ మేరకు ఇచ్చిన మాటకు కట్టుబడి లోక్‌సభలో మద్దతు తెలిపామని స్పష్టం చేశారు. రాజ్యసభలో కూడా మద్దతు తెలుపుతున్నామన్నారు. కాగా, సంపూర్ణ తెలంగాణ కోసం నల్లగొండ జిల్లాకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి గిరిబాబు ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కల సాకారమవుతున్న ఈ సమయంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని అశోక్‌రెడ్డి సూచించారు.
 

వెంకయ్యనాయుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందే..


 వెంకయ్యనాయుడుకు సొంత అభిప్రాయమున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి అన్నారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణకు మద్దతు ఇచ్చిందన్నారు. టీడీపీతో గతంలో పొత్తు పెట్టుకుని పార్టీ దెబ్బ తిందని, ఈసారి పొత్తు పొట్టుకునేది లేదని, ఇదే అంశాన్ని జాతీ య నాయకత్వానికి చెప్పామని వివరించారు. తెలంగాణలో బీజేపీ పటిష్టంగా ఉండాలంటే పొత్తు అవసరం లేదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు శ్రీరాముల మురళీమనోహర్, తాళ్లపల్లి కుమారస్వామి, కొత్త దశరథం, మారెపల్లి రాంచంద్రారెడ్డి, ఉషాకిరణ్, దుప్పటి భద్రయ్య, చిలుక విజయారావు, ఎన్.యాకయ్య, అడప బిక్షపతి, త్రిలోకేశ్వర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement