* గొంతెండుతున్న పట్నం
* జాతీయ నిబంధనల కంటే అతి తక్కువగా నీటి సరఫరా
* 182 పట్టణాల్లో నిబంధనలకు మేర నాలుగు చోట్లే
* 138 మున్సిపాలిటీల్లో సరఫరా అస్తవ్యస్తం
* రెండు నుంచి ఆరు రోజులకోసారి నీటి సరఫరా
* రూ. 2,185 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం
దాహం.. దాహం.. దాహం.. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల ఆక్రందన ఇది. చిన్న మున్సిపాలిటీల నుంచి కార్పొరేషన్ల దాకా ఎక్కడ చూసినా నీటికి కటకటే. గుక్కెడు మంచినీటి కోసం కూడా అల్లల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనంతటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఎన్నో తాగునీటి పథకాలు చేపట్టినా.. అందులో పూర్తయి నీరందిస్తున్నవి కొన్నే. ఇప్పటికే ఉన్న మంచినీటి పథకాలు కూడా నిర్వహణ లోపం వల్ల పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. దీనికితోడు అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, నిధులున్నా పనులు చేయకపోవడం వంటి కారణాలతో పేదలకు ‘నీటి’ బాధ తప్పడం లేదు.
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో అంతో ఇంతో ఇస్తున్న ఆ నీటి సరఫరాకు కూడా సమయం సందర్భం ఉండడం లేదు. ఎప్పుడు సరఫరా చేస్తే అప్పుడు పట్టుకోవాల్సిందే. అదికూడా ఒక్కో రోజు ఒక్కో సమయంలో, ఒక్కో పరిమాణంలో ఉంటుండడం గమనార్హం. నియమిత పరిమాణం కంటే తక్కువ నీటిని సరఫరా చేస్తున్నా.. ప్రజలపై బిల్లుల మోత మాత్రం మోగిస్తూనే ఉన్నారు. ఇక ఇచ్చే నీరైనా ప్రతీరోజు ఇస్తున్నారా.. అంటే అదీ లేదు. చాలా పట్టణాల్లో రెండు నుంచి ఆరు రోజులకోమారు నీటిని సరఫరా చేస్తున్నారు. శీతాకాలం ముగియకముందే రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పరిస్థితి ఇలా ఉంటే.. వేసవిలో పరిస్థితిని ఊహిస్తేనే భయం గొలుపుతోంది.
ఇంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. సరఫరా చేసే ఆ కాస్త నీరైనా పరిశుభ్రంగా ఉండడం లేదు. మురికివాడల్లోని ప్రజల పరిస్థితి మరీ దారుణం. ఏది అందుబాటులో ఉంటే ఆ నీరు తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. అదే ఢిల్లీలో ఇటీవలే గద్దెనెక్కిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఒక్కో ఇంటికి ప్రతినెలా 20 వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా ఇస్తోంది. మన రాష్ట్రంలోనైతే ఉచితం కాదుగదా.. బిల్లులు వసూలు చేసైనా ఓ గంటసేపు మంచినీళ్లు ఇస్తే చాలని ప్రజలు వాపోతున్నారు.
అమలుకాని నిబంధనలు..
రాష్ట్రంలో 182 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. జాతీయ నియమావళి ప్రకారం.. పట్టణాలు, నగరాల్లో ప్రతీరోజు ఒక్కొక్కరికీ 135 లీటర్ల చొప్పున (ఎల్‌పీసీడీ) నీటిని సరఫరా చేయాలి. కానీ, రాష్ట్రంలో ఆ మేరకు నీటిని సరఫరా చేస్తున్న మున్సిపాలిటీలు కేవలం నాలుగే. కృష్ణా, గోదావరి నదుల పక్కనే ఉన్న పట్టణాలు, నగరాల్లోనూ నీటి సరఫరా అంతంత మాత్రమే. 100 లీటర్ల (ఎల్‌పీసీడీ) కంటే తక్కువ నీటిని సరఫరా చేసే మున్సిపాలిటీల సంఖ్య 138. అందులో 33 పట్టణాల్లో 40 లీటర్ల (ఎల్‌పీసీడీ) కంటే తక్కువ నీరు సరఫరా చేస్తున్నారు.
నీళ్లిచ్చేదెన్నడు?
జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద రాష్ట్రంలో దాదాపు రూ. 2,185 కోట్లతో 62 తాగునీటి పథకాలు చేపట్టారు. అందులో 50 పథకాలు దాదాపు పూర్తయ్యాయి కూడా. కానీ, పరిస్థితిలో మార్పులేదు. పథకాలు పూర్తయిన పట్టణాల్లో ఆశించిన స్థాయిలో నీటి సరఫరా లేకపోగా... కొన్ని ప్రాజెక్టులు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి..
- కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి తాగునీరు అందించే పథకానికి సంబంధించి 85 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి కోసం ఇన్‌టేక్ వెల్ నిర్మాణానికి, పైపులైను వేయడానికి రైతులు అడ్డు చెప్పడంతో నిలిచిపోయింది.
- తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీకి సంబంధించి 68 శాతం పనిపూర్తయ్యాక కాంట్రాక్టరుకు, అధికారుల మధ్య తలెత్తిన విభేదాలు కోర్టుకెక్కాయి. ఇప్పుడా పథకం పూర్తి కావాలంటే అదనంగా 9.84 కోట్లు అవసరం.
- తూర్పుగోదావరిలోని పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి కాంట్రాక్టరు గొడవతో పని నిలిచిపోయింది. దానిని పూర్తి చేయాలంటే అదనంగా 9.49 కోట్లు అవసరం.
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ప్రాజెక్టు మొత్తం పూర్తయింది. కానీ, నీళ్లు లేవు. ఇందిరాసాగర్ (పోలవరం) బ్యాక్‌వాటర్‌తో బేతుపల్లి ట్యాంక్ నింపి అక్కడి నుంచి మున్సిపాలిటీకి సరఫరా చేయాలి. కానీ పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు.
- చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీలకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి నీరు తీసుకోవాలన్నది ప్రణాళిక. ఈ పథకం పూర్తయినా హంద్రీనీవా సుజల స్రవంతి పూర్తయితే తప్ప నీరు వచ్చే అవకాశం లేదు.
- ఇక కొన్ని మంచినీటి ప్రాజెక్టులకు పైపులైను వేయడానికి అవసరమైన భూ సేకరణ, వివిధ విభాగాల అనుమతులతోపాటు కొద్దిపాటి నిధులు ఖర్చు చేస్తే పథకాలు పూర్తయ్యే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
బొట్టు రాలితే ఒట్టు !
Published Mon, Jan 20 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement